ఒక్క రోజైనా నిజాయితీగా మాట్లాడు షర్మిలక్కా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం కోసం.. న్యాయసాధన పేరుతో తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారీ బహిరంగసభ నిర్వహించబోతోంది. ఏ ఎస్వీ తారకరామ స్టేడియం నుంచి అయితే.. పదేళ్ల కిందట నరేంద్రమోడీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదాను పదేళ్లపాటు ఇస్తాం అని వాగ్దానం చేశారో.. అదే స్టేడియంలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా డిక్లరేషన్ తేనుంది.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సాద్యమవుతుందో లేదో తర్వాతి సంగతి.. కానీ ప్రత్యేకహోదా అనేమాట ప్రజల్లో నిత్యం నానుతూ ఉండే పరిస్థితి అయితే షర్మిల వల్ల సజీవంగా ఉంది. ప్రత్యేకహోదా నినాదాన్ని ఇంకాస్త ఘాటుగా వినిపించడానికి తిరుపతి వేదికగా పెద్దసభ నిర్వహించడం అందరికీ సంతోషమే. అయితే తెలుగుప్రజలు వైఎస్ షర్మిల నుంచి కోరుకుంటున్నది ఒక్కటే.. కనీసం ఈ సభలో అయినా నిజాయితీగా మాట్లాడాలని.

షర్మిల ఏపీసీసీ సారథిగా బాధ్యతలు తీసుకున్న నాటినుంచి ప్రత్యేకహోదా మాట చెబుతూనే ఉన్నారు. అయితే ప్రతి సందర్భంలోనూ వైఎస్ జగన్ ను నిందించడానికే ఆమె ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి పడే ఓట్లను చీల్చి.. ఆ మేరకు చంద్రబాబునాయుడుకు మేలు చేయడమే జీవితలక్ష్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకహోదా విషయంలో తమ పార్టీ విధానం ఏమిటో జగన్ చాలా స్పష్టంగా చెప్పారు.

25 మంది ఎంపీలను ఇవ్వండి.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సాధించుకు వస్తానని 2019 ఎన్నికల సందర్భంగా చెప్పిన మాటను ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. అయితే.. లోక్ సభలో తమ బలం మీద ఆధారపడాల్సి వచ్చేలా  ప్రభుత్వం ఏర్పడితే చిటికెలో హోదా సాధించగలం అనే నమ్మకంతోనే ఆ రోజున ఆ ప్రకటన చేసినట్లుగా ఆయన తేటతెల్లం చేశారు. Readmore!

కేంద్రంలో ఒక్క బిజెపికే పూర్తి మెజారిటీ ఉండేలా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కేంద్రాన్ని బతిమాలడం తప్ప, ఒత్తిడి చేయలేని స్థితి. ఆ విషయాన్ని ఆయన చాలా విపులంగా బహిరంగ వేదికమీదనే చెప్పారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ఆయన ప్రత్యేకహోదా కోసం కేద్రానికి విన్నవిస్తూనే ఉన్నారు. ఫలితం లేదు. ఇంకా సూటిగా చెప్పాలంటే.. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మైనారిటీలో పడితే తప్ప.. మన ఎంపీల బలం మీద ఆధారపడితే తప్ప హోదా రాదని, వచ్చే ఎన్నికల్లో అయినా వాళ్లకు తక్కువ సీట్లు రావాలని కోరుకుందాం అని కూడా జగన్ బహిరంగంగా చెప్పారు.

ఇలాంటి జగన్ ను షర్మిల తప్పు పడుతున్నారు. హోదా కోసం ఏమీ చేయడం లేదని తిడుతున్నారు. అదే సమయంలో 2014 నుంచి మోడీ సర్కారులో భాగంగా ఉంటూ, మంత్రి పదవులు అనుభవిస్తూ ప్రత్యేకహోదా కోసం పోరాడేవాళ్ల మీద కేసులు పెట్టి వేధించారు. హోదా డిమాండ్ ను మంటగలిపేసి, డబ్బులు స్వాహా చేయడానికి ప్యాకేజీ పాట పాడారు. అది కూడా సాధించకుండా చేతగానితనం చూపించుకున్నారు. కానీ ఇవేమీ షర్మిల మాట్లాడడం లేదు. కేవలం జగన్ ను నిందించడానికే ఆమె పరిమితం అవుతున్నారు.

అందుకే, తిరుపతిలో ఇంత భారీ బహిరంగసభ నిర్వహిస్తున్న ఈ సందర్భంలోనైనా షర్మిల కాస్త నిజాయితీగా మాట్లాడితే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.

Show comments