పరీక్షల సమయంలో ఎలా చదివాం? ఎలా రాశాం? అనేదే ముఖ్యం. వాటినే బట్టే విద్యార్థులు సాధించే ఫలితాలు ఆధార పడి వుంటాయి. రాజకీయాల్లో ఎన్నికలైనా అంతే. ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఇవాళ మార్చి నెలలో అడుగు పెట్టాం. ఈ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. కాలం శరవేగంతో పరుగెడుతోంది. రాజకీయ నాయకులకు ప్రతి క్షణం ఎంతో విలువైంది.
రాజకీయ పార్టీల ప్రతి అడుగు... ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాజకీయ పార్టీల ఎత్తులు, వ్యూహాలే అధికారాన్ని తీసుకురావడం లేదా పోగొట్టడం చేస్తాయి. రాజకీయ పార్టీల ప్రతి కదలికలను జనం జాగ్రత్తగా గమనిస్తుంటారు. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి ఎన్నికల సన్నద్ధం సభలను ప్రజలు డేగకళ్లతో చూస్తున్నారు. సిద్ధం నినాదంతో వైసీపీ, జెండా పేరుతో ఇటీవల కూటమి సభలు నిర్వహించాయి. ఇంత వరకూ వైసీపీ ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మూడు సిద్ధం సభలు నిర్వహించింది. ఒకదానికి మించి మరొక సభ సూపర్ సక్సెస్ అయ్యాయి.
టీడీపీ-జనసేన కూటమి మొట్టమొదట గత నెల 28న నిర్వహించిన జెండా సభ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇలా జరుగుతుందని ఆ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా ఊహించి వుండరు. ఈ జెండా సభ.... ఒక ఎజెండా లేకుండా సాగిపోయింది. సిద్ధం సభల్లో జగన్ తన పార్టీ శ్రేణుల్ని ఎన్నికల సమరానికి రెడీ చేసేందుకు స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేయడాన్ని చూశాం. వైసీపీ పాలనలో ఏం చేశామో వివరించి, వాటి గురించి ఇంటింటికి వెళ్లి వివరించి, మంచి జరిగింది అంటేనే ఓట్లు వేయాలని కోరాలని జగన్ దిశానిర్దేశం చేశారు. తాను అభిమన్యుడిని కాదని, అర్జునుడిని అంటూ ఉత్సాహపరిచారు. అలాగే పార్టీ శ్రేణుల్ని కృష్ణుడితో పోల్చి, గొప్ప గౌరవాన్ని కల్పించారు. ప్రత్యర్థులపై పోరులో కార్యకర్తలే తన సైన్యం అని, లబ్ధిదారులే క్యాంపెయినర్లని చెప్పడం ద్వారా జోష్ నింపారు. వై నాట్ 175 అంటూ మరోసారి కదనరంగానికి పార్టీ శ్రేణుల్ని కదిలించారు.
ఇదే టీడీపీ-జనసేన కూటమి బహిరంగ సభలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ప్రసంగాలను గమనిస్తే, రెండు పార్టీల శ్రేణుల్లో ఎలాంటి జక్షస్ కనిపించలేదు. కేవలం సీఎం వైఎస్ జగన్‌ను తిట్టడానికే చంద్రబాబు, పవన్ పరిమితం అయ్యారు. జగన్‌ను ఎందుకు గద్దె దించాలో, తమను అధికారంలోకి తెస్తే ఏం చేస్తామో... చంద్రబాబు, పవన్ వివరించలేదు. పవన్‌కల్యాణ్ అహంకారం పుణ్యమా అని జనసేనతో పాటు టీడీపీకి కూడా ఓట్లు వేయొద్దని ఆయన అభిమానులు నిర్ణయించుకునేలా చేశాయి.
అసలు తనకు ఎవరూ సలహాలు, సూచనలు ఇవ్వొద్దని పవన్ తన పార్టీ శ్రేయోభిలాషులకు తేల్చి చెప్పారు. తన నిర్ణయాలకు అనుగుణంగా వెంట నడవాలే తప్ప, ప్రశ్నించకూడదని వార్నింగ్ ఇచ్చారు. సొంత పార్టీ శ్రేణులకి బహిరంగంగా హెచ్చరికలు జారీ చేసిన ఏకైక నాయకుడు బహుశా పవన్‌కల్యాణే అయి వుంటారు. ఈ సభ జన సైనికుల్లో తీవ్ర నిరాశ నింపగా, టీడీపీలో ఆందోళన కలిగించింది. కూటమి సభ ఒక లక్ష్యం లేకుండా సాగింది.
టీడీపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు ఇప్పుడు వైసీపీ సిద్ధం సభల గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. రాజకీయంగా జగన్‌తో విభేదించే వాళ్లు సైతం... కీలకమైన ఎన్నికల సమయంలో అధికార పార్టీ నిర్వహిస్తున్న సభలు వైసీపీలో మరోసారి అధికారంపై ధీమా, ఆత్మవిశ్వాసం పెంచాయనే మాట వినిపిస్తోంది. ప్రజల్లో కూడా వైసీపీ సభలు సానుకూల సంకేతాలు పంపింది. కానీ ఆ పని టీడీపీ-జనసేన సభ చేయలేకపోయింది. మొదటి సభే ఇలా జరగడంతో ఆ రెండు పార్టీల శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకుంది. మళ్లీ జగనే వచ్చేలా ఉన్నారనే అభిప్రాయాన్ని ప్రత్యర్థుల్లో కలిగించడంలో వైసీపీ సభలు సక్సెస్ అయ్యాయి. ఏంటో, ఇలా జరిగిపోతోందనే నిరాశను కూటమి సభ మిగిల్చింది.