టీడీపీకి జ‌న‌సేన ఓట్లా.. ప్ర‌శ్నే లేదు!

జ‌న‌సేన‌తో టీడీపీ పొత్తు పెట్టుకోడానికి ప్ర‌ధాన కార‌ణం... కాపుల ఓట్ల కోస‌మే. 2014లో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌న్న చంద్ర‌బాబు హామీతో టీడీపీకి వారంతా అండ‌గా నిలిచారు. అంతేకాకుండా త‌మ నాయ‌కుడిగా భావించే ప‌వ‌న్‌క‌ల్యాణ్ టీడీపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో మెజార్టీ కాపులు ఆద‌రించారు. ఐదేళ్ల ప‌రిపాల‌న‌లో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ ఇస్తామ‌న్న హామీని చంద్ర‌బాబు నిలుపుకోలేక‌పోయారు.

ఎన్నిక‌ల హామీని నిల‌బెట్టుకోవాల‌ని ఉద్య‌మించిన కాపుల‌పై కేసులు పెట్టారు. కాపు ఉద్య‌మ నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కుటుంబంపై చంద్ర‌బాబు ప్ర‌భుత్వ దాష్టీకం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అలాగే వంగ‌వీటి రంగ హ‌త్యానంత‌రం ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో క‌మ్మ వ‌ర్సెస్ కాపు అనే రీతిలో రాజ‌కీయం న‌డుస్తోంది. కాపుల మ‌ద్ద‌తు లేనిదే అధికారంలోకి రాలేమ‌ని భావించిన చంద్ర‌బాబు, అదే సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను త‌న‌దైన స్టైల్‌లో దువ్వ‌డం స‌త్ఫ‌లితాన్ని ఇచ్చింది.

రానున్న ఎన్నిక‌లు టీడీపీకి చావుబ‌తుకు స‌మ‌స్య‌. దీంతో మ‌రోసారి కాపుల ఓట్లు అవ‌స‌ర‌మ‌య్యాయి. అందుకే ప‌వ‌న్‌తో చంద్ర‌బాబు పొత్తు పెట్టుకున్నారు. జ‌న‌సేన‌కు సీట్లు త‌క్కువ ఇచ్చార‌ని ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ర‌గిలిపోతున్నారు. సీట్లు త‌క్కువ ఇస్తే ఓట్ల బ‌దిలీ జ‌ర‌గ‌ద‌ని చాలా కాలంగా కాపు నాయ‌కులు చేగొండి హ‌రిరామ‌జోగ‌య్య త‌దిత‌రులు హెచ్చ‌రిస్తున్నారు. 24 అసెంబ్లీ, 3 లోక్‌స‌భ సీట్లు కేటాయించ‌డంతో జ‌న‌సేన సోష‌ల్ మీడియాలో ఓట్ల బ‌దిలీపై ఆశ్చ‌ర్య‌క‌ర పోస్టులు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి.

జ‌న‌సేన పోటీ చేస్తున్న చోట ఓట్లు వేసుకుందామ‌ని, మిగిలిన చోట్ల ఎవ‌రిష్టం వారిద‌ని ఆ పార్టీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు పోస్టులు పెట్ట‌డం విశేషం. దీనికి తోడు తాడేప‌ల్లిగూడెం స‌భ‌లో ప‌వ‌న్ సొంత పార్టీ శ్రేణుల్ని కించ‌ప‌రిచేలా మాట్లాడ్డంతో... మ‌న‌కెందుకులేబ్బా అనే నైరాశ్యం అలుముకుంది. జ‌న‌సేన విష‌యంలోనూ అంత‌టి మార్పు వ‌చ్చిన‌ప్పుడు, ఇక టీడీపీని ఎలా చూస్తారో అర్థం చేసుకోవ‌చ్చు. జ‌న‌సేన వ‌ర‌కూ ఓట్లు వేసుకుందామ‌నే స్థాయి నుంచి మ‌న పార్టీ కాదులే అనే నిరాశ‌నిస్పృహ‌లో ఉన్నారు. దీంతో టీడీపీకి జ‌న‌సేన నుంచి ఓట్ల బ‌దిలీ అనేది అసాధ్య‌మ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. రానున్న రోజుల్లో రెండు పార్టీల మ‌ధ్య అగాథం మ‌రింత పెర‌గ‌డ‌మే త‌ప్ప‌, సర్దుకునే ప‌రిస్థితి వుండ‌దు. Readmore!

పి.గ‌న్న‌వ‌రంలో ఏం జ‌రుగుతున్న‌దో చూస్తున్నాం. అక్క‌డి టీడీపీ అభ్య‌ర్థి గ‌తంలో త‌మ‌పై దారుణ కామెంట్స్ చేశార‌ని రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సేన శ్రేణులు ర‌గిలిపోతున్నాయి. ఇలాంటివ‌న్నీ టీడీపీకి ఓటు వేయొద్ద‌నే ఆలోచ‌న‌ల‌కు మ‌రింత ప్రేర‌ణ‌గా నిలుస్తాయి. ఇలా ఒక‌దాని కొక‌టి అసంతృప్తుల గ‌ళాల‌న్నీ తోడై, ఎన్నిక‌ల నాటికి టీడీపీని శ‌త్రువుగా చూసే ప‌రిస్థితి. టీడీపీకి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఓట్ల బ‌దిలీ జ‌ర‌గాల‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎంత‌గా చెప్పినా, అది జ‌ర‌గ‌ని ప‌ని. ఎందుకంటే చంద్ర‌బాబు మాయ‌లో ప‌వ‌న్ ప‌డ్డార‌ని జ‌న‌సేన శ్రేణులు న‌మ్మ‌డ‌మే.

ప‌వ‌న్‌ను త‌మ‌కు కాకుండా చేసిన చంద్ర‌బాబుకు త‌గిన గుణ‌పాఠం చెప్పేందుకైనా.. ఎన్నిక‌ల్లో ఓటు అనే అస్త్రాన్ని ప్ర‌యోగించాల‌ని జ‌న‌సేన శ్రేణులు ఎదురు చూస్తున్నాయి.

Show comments