జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్ని విధాలా విజయం సాధించారు. తాను చెప్పినట్టు నడుచుకునేలా పవన్‌ను తన వైపు తిప్పుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అయితే ఇదే సందర్భంలో పవన్ అభిమానులు, ఆయన సామాజిక వర్గం మనసులు తీవ్రంగా గాయపడ్డాయని, దెబ్బతిన్న ప్రాణులు ప్రతీకారం తీర్చుకునేందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాయనే కఠిన వాస్తవాన్ని చంద్రబాబు గుర్తించడం లేదు.
ఇదే టీడీపీ-జనసేన కూటమికి అత్యంత ప్రమాదకారి కానుంది. పరస్పర రాజకీయ అవసరాల రీత్యా టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడాన్ని ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులు స్వాగతించారు. స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబునాయుడిని పరామర్శించడానికి పవన్‌కల్యాణ్ వెళ్లారు. అనంతరం జైలు బయట పవన్ మాట్లాడుతూ ఇరుపార్టీలు పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించారు.
కూటమిలో టీడీపీది పెద్దన్న పాత్ర. పొత్తులో భాగంగా కనీసం 40 అసెంబ్లీ, నాలుగైదు లోక్‌సభ స్థానాలను జనసేన శ్రేణులు ఆశించాయి. ఎందుకంటే, తమతో పొత్తు ఖరారైన తర్వాతే టీడీపీకి జోష్ వచ్చిందని పవన్‌కల్యాణ్‌తో పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నమ్ముతున్నారు. ప్రాణం పోసిన తమకు సీట్లలో తగిన ప్రాధాన్యం వుంటుందని జనసేన ఆశించడంలో తప్పు లేదు.
అయితే అనుకున్నదొకటి, అయ్యిందొకటి. 24 అసెంబ్లీ, 3 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని చంద్రబాబునాయుడు ప్రకటించడంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. కూటమిలో సీట్ల కేటాయింపు జనసేనలో అసంతృప్తికి బీజం పడింది. ఇదే సందర్భంలో టీడీపీ కోణంలో చూస్తే... పవన్‌పై బాబు మొదటి విజయం. తక్కువ సీట్లకు పవన్‌ను ఒప్పించడంలో చంద్రబాబు తన చాణక్యాన్ని మరోసారి ప్రదర్శించారని టీడీపీ నేతలు అంటున్నారు.
ఇక సీట్ల కేటాయింపు విషయానికి వస్తే... రాజమండ్రి రూరల్ నుంచి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ పోటీ చేయాలని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మధ్య పవన్‌కల్యాణ్ రాజమండ్రికి వెళ్లినప్పుడు కందుల దుర్గేష్‌కు రూరల్‌లో పోటీపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో దుర్గేష్ అనుచరులు, జనసేన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దుర్గేష్‌ను నిడదవోలుకు వెళ్లాలని, రాజమండ్రి రూరల్ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేస్తారని చంద్రబాబు చావు కబురు చల్లగా చెప్పారు.
ఇక్కడ తమపై కమ్మ వాళ్లు విజయం సాధించారని కాపులు ఓటమి మూటగట్టుకున్న అవమాన భారంతో రగిలిపోతున్నారు. గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్న తమకు యాచించే దుస్థితి ఏంటని వారు మండిపడుతున్నారు. ఇదిలా వుండగా తణుకులో రామచంద్రరావు ఎపిసోడ్ కూడా జనసేనలో బలమైన అసంతృప్తికి కారణమైంది. గతంలో వారాహియాత్రలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ విడివాడ రామచంద్రరావుకు టికెట్ ఇవ్వలేనందుకు క్షమాపణ కోరుతూ, రానున్న ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేస్తానని వేలాది మంది సాక్షిగా హామీ ఇచ్చారు.
ఇప్పుడా సీటును టీడీపీకి కేటాయించడం ద్వారా.. పవన్‌పై చంద్రబాబు విజయం సాధించినట్టైంది. కూటమి కాస్త, పవన్‌పై చంద్రబాబు ఆధిపత్యం సాధించే పొలిటికల్ క్రీడగా మారింది. ఏ రకంగా చూసినా, తాము ఓడిపోయామనే తీవ్రమైన వేదన జనసేన శ్రేణుల్ని వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో తమను ఓడించిన టీడీపీపై జనసైనికులు ఏ రకమైన అభిప్రాయంతో వుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాము చెప్పినట్టల్లా వినేలా పవన్‌ను మార్చుకున్నామని చంద్రబాబు సంబరపడుతుండొచ్చు. అయితే ఇది చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల వ్యక్తిగత వ్యవహారం కానేకాదు.
పవన్‌ను గౌరవించడం అంటే, తమను అభిమానించినట్టుగా శ్రేణులు చూస్తాయి. పొత్తులో భాగంగా ఆ రకమైన పరిస్థితి 100కి 75 శాతం లేదనే మాట వినిపిస్తోంది. పొత్తులాటలో ఓడిపోయిన జనసేన శ్రేణుల ఆలోచన వేరేలా వుంది. పవన్ చెబితే వినే పరిస్థితి లేదు. ఎన్నికల రోజు మనసు చెప్పినట్టు జనసేన శ్రేణులు నడుచుకుంటాయి. ఫలితం ఏంటో టీడీపీకి కాలం రుచి చూపిస్తుంది.