‘పుత్రికా ప్రీత్యర్థం..’ రాజీపడక తప్పదా?

రాజకీయాల్లో గానీ, సినిమా రంగంలో గానీ.. పుత్రగండం మనకు అనేక సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. కొడుకును నాయకుడును చేయాలని, కొడుకును హీరోగా చేసేయాలని తపన పడుతూ అవస్థలు పడిన వారు మనకు అనేకమంది కనిపిస్తారు. అదే విధంగా కూతురును రాజకీయంగా నిలబెట్టడానికి రాజకీయ కురువృద్ధుడు అనేక మెట్లు దిగి రాజీపడుతున్న వైనం ఇప్పుడు మనకు మహారాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులు, తాను స్థాపించిన పార్టీనుంచి తనను బయటకు గెంటేసిన శత్రువులను శరద్ పవార్ విందుకు ఆహ్వానించడం ఇందుకు తార్కాణంగా కనిపిస్తోంది.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో కొన్నేళ్లుగా చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలుసు. శివసేన నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ కూటమిని కూలదోసి బిజెపి కూటమి అధికారంలోకి వచ్చింది. అసలు శివసేన బిజెపితో పొత్తు పెట్టుకున్న వర్గం మాత్రమే అనే ఈసీ మరియు సుప్రీం తీర్పు కూడా వచ్చేసింది. ఆ పార్టీకే చెందిన ఏక్‌నాధ్ శిండేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అదే సమయంలో శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీ చీలిక వర్గం ప్రభుత్వానికి మద్దతివ్వడం.. అజిత్ పవార్ డిప్యూటీ సీఎం కావడం కూడా జరిగాయి. ఆ చీలిక వర్గమే అసలైన ఎన్సీపీ అని కూడా ఈసీ తేల్చేసింది.

ఈ నేపథ్యంలో శరద్ పవార్ చేతిలో ఆయన సొంత పార్టీ ఎన్సీపీ ఇప్పుడు లేదు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుంచి ఆయన కూతురు సుప్రియా సూలే పోటీచేయాలని అనుకుంటున్నారు. అయితే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఇక్కడినుంచి పోటీచేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో శరద్ పవార్ వారితో రాజీ ప్రయత్నాల్లో పడ్డట్టుగా కనిపిస్తోంది.

బారామతిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎం లను శరద్ పవార్ తన ఇంటికి విందుకు ఆహ్వానించారు. ప్రస్తుతం బారామతి ఎంపీగా ఉన్న కూతురు సుప్రియను మళ్లీ గెలిపిపంచుకోవడానికి శరద్ పవార్ అధికారంలో ఉన్న కూటమితో రాజీ పడే అవకాశం ఉన్నదని అంచనాలు సాగుతున్నాయి.

ఎన్సీపీ సారథ్యాన్ని వదులుకోవాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న శరద్ పవార్ వయస్సు ఇప్పుడు 83 ఏళ్లు. ఈ విందు భేటీ తర్వాత ఆయన తన వర్గంగా మిగిలిన ఎన్సీపీని కూడా అధికారంలో ఉన్న పార్టీతో విలీనం చేసేసి కూతురు రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలని చూస్తున్నట్టుగా పలువురు విశ్లేషిస్తున్నారు. మరి, మహా పరిణామాలు.. ఎలాంటి మలుపులు తిరుగుతాయో, వృద్ధనేత తన పుత్రికా ప్రీత్యర్థం చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.

Show comments