కేటీఆర్ సవాలులోనే పలాయనవాదం!

ఎవ్వడూ స్వీకరించని, ఎవ్వడూ ఆచరించని సవాళ్లు ప్రతిసవాళ్లు మనకు రాజకీయ రంగంలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి సవాళ్లు కేవలం పత్రికల్లో పతాకశీర్షికలుగాను, టీవీ ఛానెళ్లలో బ్రేకింగ్, స్క్రోలింగ్ న్యూస్ గానూ కనిపించడానికి మాత్రమే. చాలా సందర్భాల్లో ఇవి కామెడీగా కూడా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు గులాబీ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు కూడా అలాంటి సవాళ్లే విసురుతున్నారు.

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఆయన మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీచేస్తాడట. ధైర్యముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన సీఎం పదవికి రాజీనామా చేసేసి.. మొన్నటిదాకా ఆయన సిటింగ్ ఎంపీ స్థానం అయినటువంటి మల్కాజిగిరిలో బరిలోకిదిగి కేటీఆర్ పై తలపడాలట. 

ఇలాంటి కామెడీ ఆలోచన కేటీఆర్ కు ఎందుకు వచ్చిందో తెలియదు. చూడబోతే.. పదేళ్లపాటు అధికారంలో ఉండి.. విర్రవీగిన ఆయనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకవైపు తన పార్టీని, తమ కుటుంబాన్ని తూర్పారపడుతూ ఉంటే.. తమ లోపాలను ఎత్తిచూపుతూ ఉంటే.. శాసనసభలో కూర్చోవడం చాలా కష్టంగా ఉన్నట్టుంది. అందుకని ఆయన ఎమ్మెల్యే పదవిని వదలుకుని, పలాయనం చిత్తగించి ఢిల్లీ పారిపోవాలని భావిస్తున్నట్టుగా ఉన్నారు. శాసనసభ గండం తప్పించుకోవడానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేస్తా అనే ప్రల్లదనపు పలుకులు పలుకుతున్నారు.

మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి మొన్నటిదాకా రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యే స్థానాన్ని కూడా కాంగ్రెస్ కోల్పోవడం, సిటీ అంతటా వారికి పరాజయాలే దక్కడం అనేది.. కేటీఆర్ కు ఇలాంటి సవాలు విసిరే ధైర్యం ఇచ్చినట్టుంది. సిటీ పరిధిలో ఉండే ఆ నియోజకవర్గం నుంచి తాను ఎంపీగా పోటీచేస్తే నెగ్గగలనని అనుకున్నట్టుగా ఉంది.

ఆయన ఆలోచన కరక్టే కావొచ్చు. ఆయనకు అసెంబ్లీ తప్పించుకోవాలని ఉంటే.. తాను దానిని సేఫ్ సీటుగా భావించి పోటీచేసి వెళ్లిపోవచ్చు. అయితే తెలంగాణ ప్రజలు కాంగ్రెసును అయిదేళ్ల పాటు పరిపాలించమని దీవించిన తర్వాత.. రేవంత్ రెడ్డిని అయిదేళ్లపాటూ ముఖ్యమంత్రిగా ఉండమని పార్టీ అవకాశం ఇచ్చిన తర్వాత.. రాజీనామా చేయమని కోరడం అనేది ప్రజల తీర్పును అవమానించడమే అవుతుంది కదా? అనేది ప్రజల సందేహం. 

ఒకవేళ తమ సత్తా చాలా ఉన్నదని నిరూపించుకోవాలని కేటీఆర్ కు అనిపించినప్పటికీ.. తమ పార్టీ అభ్యర్థిగా ఎవరు పోటీచేసినా.. మల్కాజిగిరిలో గెలిపించుకుంటే చాలు కదా.. కాంగ్రెస్ మీద నిందలు వేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది కదా.. దానికి ఈ ఇద్దరూ రాజీనామాలు చేసి.. ప్రజల మీద మరో ఎన్నికల భారం మోపడం ఎందుకు అనేది మరో సందేహం. 

అయినా ఎర్రకోట మీద  గులాబీ జెండా రెపరెపలాడిస్తామని ప్రతిజ్ఞలు చేసిన నాయకులు ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఎంత మేర సత్తా చాటుకుంటారో చూడాలి.

Show comments