తెలంగాణ రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ యువ మహిళా ఎమ్మెల్యే లాస్య నందిత (37) దుర్మరణం చెందారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలపై లాస్య నందిత గెలుపొందారు. శుక్రవారం తెల్లవారుజామున పటాన్‌చెరు ఓఆర్ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది.
ఈ దుర్ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె పీఏ ఆకాశ్, డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
ఇదిలా వుండగా కంటోన్మెంట్ నుంచి తండ్రి వారసత్వంగా ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న చిన్న కుమార్తె లాస్య నందిత. బీటెక్ చదివిన లాస్య మొదట కార్పొరేటర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. గత ఏడాది అనారోగ్యంతో సాయన్న మృతి చెందడంతో లాస్యకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. హోరాహోరీ పోరులో గద్దర్ కుమార్తెపై లాస్య గెలుపొందారు.
ఎంతో రాజకీయ భవిష్యత్ ఉన్న లాస్య... రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.