అయ్యన్న ఒక్కడే నచ్చారా?

ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలలో మాజీ మంత్రి చింతకాయల  అయ్యన్నపాత్రుడే ఆ పార్టీ అధినాయకత్వానికి నచ్చారా అన్నది ఇపుడు హాట్ డిస్కషన్ గా ఉంది. సీనియర్ నేతలు అందరికీ ఈసారి చెక్ చెప్పేస్తున్నారు. ఇద్దరు మాజీ మంత్రులకు ఈసారి విశాఖ జిల్లా రాజకీయాల్లో అవకాశం లేకుండా పోతోంది.

జనసేనతో పొత్తులు సీట్ల సర్దుబాటు అన్నది టీడీపీకి కత్తి మీద సాముగా ఉంది. ఆ కత్తి మాత్రం సీనియర్ల మెడకే తగులుకుంటోంది. విశాఖ జిల్లాలో గంటా వర్సెస్ అయ్యన్నగా దశాబ్దాల పాటు సాగిన టీడీపీ రాజకీయానికి ఈ విధంగా ఒక అనూహ్యమైన ముగింపు ఇవ్వాలని టీడీపీ హై కమాండ్ చూస్తోందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మాజీ మంత్రి గంటాకు టికెట్ ఇవ్వవద్దు అన్నది అయ్యన్న వర్గం పంతం. ఇపుడు టీడీపీ హై కమాండ్ విశాఖ జిల్లాలో టికెట్ ఇవ్వకుండా పొరుగు జిల్లాకు పంపాలనుకోవడంతో అయ్యన్న వర్గం విజయం సాధించిందా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. గంటా వంటి అన్ని బలాలు ఉన్న నేతని టీడీపీ ఈసారి ఎన్నికల్లో వదులుకోవడం అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.

గంటా తనకు ఎక్కడో ఒక చోట టికెట్ దక్కుతుందని ఆశించారు. కానీ అలా కాకుండా ఆయనకు వేరే చోటు చూపించారు. మామూలుగా అయితే గంటా వెళ్లేవారేమో కానీ ఉత్తరాంధ్రాకే ముఖద్వారం అయిన విశాఖ జిల్లాలో తనకు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారు అన్న పాయింట్ దగ్గరే ఆయన ఆగిపోతున్నారు అని అంటున్నారు.

మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి కూడా ఈసారి టికెట్ లేదు. ఆయన సొంత సీటు పెందుర్తిని జనసేనకి ఇచ్చేస్తున్నారు. అలా ఆయన రాజకీయానికి కూడా పెద్ద బ్రేక్ పడిపోతోంది. సీనియర్ నేతలుగా ఉన్న పల్లా శ్రీనివాసరావు పప్పల చలపతిరావు ఇతర సీనియర్ నేతలకు కూడా ఈసారి పొత్తుల వల్ల టికెట్లు వచ్చే పరిస్థితి లేదు.

అయితే నర్శీపట్నంలో మాత్రం పదవసారి అయ్యన్న పోటీ చేయబోతున్నారు. ఆయనకు టికెట్ ఇస్తోంది టీడీపీ హై కమాండ్. తన పొలిటికల్ కెరీర్ లో మూడు సార్లు ఓడారు అయ్యన్న. ఓటమి అంటే తెలియని గంటాని వద్దనుకుని  అయ్యన్నను చేరదీస్తున్నారు అంటే ఆయన అంత బాగా నచ్చారేమో అన్న కామెంట్స్ పడుతున్నాయి.

Show comments