లోకేష్ కు పప్పుతో అభిషేకం!

నారా పులకేసి అంటూ చినబాబుని వైసీపీ విమర్శించింది. ఆయనకు బుద్ధి రావాలంటూ ముద్ద పప్పుతో లోకేష్ ఫ్లెక్సీకి అభిషేకం చేసింది. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ వైసీపీని విమర్శించడాన్ని ఆ పార్టీ నేతలు తప్పు పట్టారు.

శంఖారావం పేరుతో లోకేష్ విశాఖలో పర్యటించి మంత్రి గుడివాడ అమర్నాథ్ ని  కోడి గుడ్డు మంత్రి అని టీజ్ చేస్తే మంత్రి గుడివాడ అంతే స్థాయిలో ముద్ద పప్పు అని గేలి చేశారు. ఈ ఇద్దరి మాటల యుద్ధాన్ని పట్టుకుని ఇపుడు టీడీపీ వైసీపీ క్యాడర్ వీధులలోకి ఫైటింగ్ చేసుకుంటున్నాయి.

మొదట దీనికి తోవ ఇచ్చింది టీడీపీ. గుడివాడ ఫ్లెక్సీకి కోడిగుడ్లను కొట్టి తమ్ముళ్లు తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తే అదే ప్లేస్ లో వైసీపీ నేతలు లోకేష్ ఫ్లెక్సీల మీద పప్పుతో అభిషేకం చేశారు. ఇలా రెండు పార్టీలు పోటాపోటీగా విశాఖలో నిర్వహించిన ఈ నిరశన కార్యక్రమాలు స్మార్ట్ సిటీని ఒక్కసారిగా వేడెక్కించాయి.

మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫ్లెక్సీ పై కోడిగుడ్లతో దాడి చేస్తారా అని వైసీపీ నేతలు మండిపడ్డారు. మంత్రి అమర్నాథ్ పై విమర్శలు చేసే స్థాయి లోకేష్ లేదని వైసీపీ నేతలు అంటున్నారు. కనీసం ఎమ్మెల్సీ కూడా కానీ లోకేష్ ను చంద్రబాబు నాయుడు మంత్రినీ చేశాడని, ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి లోకేష్ ఓడిపోయాడని , ఈ విధంగా బ్యాక్ డోర్ లో వచ్చి మంత్రి అయినది లోకేష్ ఒక్కడేనని వైసీపీ నేతలు సెటైర్లు వేశారు.

మంత్రి గుడివాడ అమర్నాథ్ కుటుంబం దశాబ్దాల కాలంగా  రాజకీయాల్లో ఉందని కార్పొరేటర్ గా పనిచేసి,ఆ తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి అయిన అమర్నాధ్ ని  విమర్శించే హక్కు పప్పు ముద్దకు లేదని వైసీపీ నేతలు గణేష్ విమర్శించారు. వైసీపీ మహిళా విభాగంనేతలు మాట్లాడుతూ లోకేష్ కు పప్పు తింటే మంచి బుద్ధి వస్తుందని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున  కల్పిస్తే అవగాహన లేకుండా లోకేష్ మాట్లాడుతున్నారని అన్నారు. లోకేష్ శంఖారావం ఇప్పటికే అట్టర్ ప్లాప్ అయిందని రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుభి మోగిస్తుందని వైసీపీ నేతలు జోస్యం చెప్పారు.

Show comments