3 రాజధానులు: కొత్త చట్టానికి డెడ్‌లైన్ ఉందా?

అధికార వికేంద్రీకరణ, అమరావతి వ్యవహారాలకు సంబంధించి హైకోర్టు తీర్పులోని పలు అంశాలపై స్టే ఇస్తూ వచ్చిన సుప్రీం తీర్పు ప్రభుత్వానికి ఆనందకరమే. దీనిని ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు ప్రకటించారు కూడా. మరింత పకడ్బందీగా, రాజ్యాంగానికి లోబడి, న్యాయప్రక్రియకు అనుగుణంగా మూడురాజధానులకోసం కొత్తచట్టం తెస్తాం అని కూడా సజ్జల ప్రకటించారు. 

ఇప్పటికే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ మూడు రాజధానులకు అనుకూలంగా సభలు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రజల మదిలో మెదలుతున్న సందేహం ఏంటంటే.. మూడు రాజధానులకోసం కొత్తగా తెస్తానంటున్న చట్టానికి డెడ్‌లైన్ ఉందా? ఎప్పటిలోగా కొత్త చట్టం తేవాలని అనుకుంటున్నారు? అనేదే!

ఒక కోణంలో చూసినప్పుడు కొత్త చట్టం తేవడం అనేది అంత సులువుగా సాధ్యమయ్యే వ్యవహారంలాగా కనిపించడం లేదు. ఎందుకంటే.. ప్రస్తుతానికి జనవరి 31కి సుప్రీం న్యాయస్థానం ఈ వ్యాజ్యాన్ని వాయిదా వేసింది. ఇప్పుడు స్టే ఇచ్చిన అంశాలకు సంబంధించి.. అప్పటిలోగా ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో.. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదని హైకోర్టు చెప్పిన తీర్పుపై స్టే ఇవ్వాలో లేదో కూడా వాదనలు వింటారు. ఈ విషయంలో ఇంకా పూర్తిగా వినాల్సి ఉన్నదని సుప్రీం చెప్పడాన్ని మనం గమనించాలి. 

ఒకవేళ ఆ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పడం ఆలస్యం అయితే ఏమవుతుంది? రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రప్రభుత్వం చేతుల్లోనే ఉంది.. అని సుప్రీం విస్పష్టంగా తేల్చి చెప్పేస్తే ఏ గొడవాలేదు. ఎప్పటికి చెబుతుందనేదే ప్రశ్న. అంత తొందరగా తేలుతుందా? అనేది అనుమానం. కొత్త చట్టంతో మూడురాజధానులు తెస్తాం అంటున్న సజ్జల.. సుప్రీం తుదితీర్పును వెలువరించేదాకా ఆగాల్సిందేనా? లేదా, మరొక ప్రత్యామ్నాయ మార్గంలో కొత్త చట్టం తెచ్చే ఆలోచన చేస్తున్నారా తెలియదు. సుప్రీం తీర్పు వస్తే తప్ప కొత్త చట్టం సాధ్యం కాకపోయే పక్షంలో.. ఇంకా బాగా ఆలస్యం అవుతుంది. ఈలోగా 2024 ఎన్నికలు వచ్చేసినా కూడా ఆశ్చర్యం లేదు. 

నిజానికి ఎన్నికలు వచ్చినా పరవాలేదనే ఉద్దేశంతోనే వైసీపీ ఉంది. ఎందుకంటే.. మూడు రాజధానులు అనే ప్రతిపాదన అన్ని ప్రాంతాల్లోనూ తమకు ఓట్లను గంపగుత్తగా వేయిస్తుందని వారి కోరిక. పైగా టీడీపీ బలంగా ఉండే ఉత్తరాంధ్రలో తమ ప్రాబల్యం పెరుగుతుందని, ఇటు తమ సొంతబలం పుష్కలంగా ఉన్న జిల్లాల్లో ఎటూ తామే పైచేయి సాధిస్తామని వారు అనుకుంటున్నారు. అందుకే కొత్త చట్టం తేబోతున్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు గానీ.. దానికి డెడ్ లైన్ ఏమీ ఉండదని ప్రజలు భావిస్తున్నారు.

Show comments