ఎల్లో మీడియా జ‌ర్న‌లిస్టుల ఆశ చూడ‌త‌ర‌మా!

ఎల్లో మీడియా జ‌ర్న‌లిస్టులు ఆశ‌ల ఊహ‌ల్లో ఊరేగుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2024లో టీడీపీ ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని, అప్పుడే త‌మ‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్రాతినిథ్యం ఇస్తార‌నే గంపెడాశ‌తో ఉన్న‌ట్టు స‌మాచారం. ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కంటూ 5 వేల ఓట్లు ఉన్నాయ‌ని చెప్పుకునే ఎల్లో జ‌ర్న‌లిస్టు, అలాగే టాలీవుడ్‌లో మ‌హిళా న‌టుల‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన జ‌ర్న‌లిస్టు, అదే జ‌ర్న‌లిస్టు స‌హ‌చ‌రుడు, ఇటీవ‌ల అమ‌రావ‌తి రాజ‌ధానిపై చేతులు, కాళ్లు కందిపోయేలా పుస్త‌కం రాసిన జ‌ర్న‌లిస్టు, అలాగే క‌డ‌వ‌లు, కుండ‌లు బ‌ద్ధ‌లు కొడ‌తాన‌నే యూట్యూబ‌ర్‌ ఏం ఆశిస్తున్నారా తెలుసా?

క‌ష్ట కాలంలో టీడీపీని మోస్తున్న త‌మ‌కు రాజ్య‌స‌భ లేదా ఎమ్మెల్సీ ప‌ద‌వులు ఇవ్వాల‌ని ఆశిస్తున్నారని ఆ పార్టీ వ‌ర్గాల ద్వారా స‌మాచారం. ఏపీలో 23 అసెంబ్లీ, మూడు పార్ల‌మెంట్ స్థానాల‌కు టీడీపీ ప‌రిమిత‌మై, ముఖ్య నాయ‌కులు పార్టీని వీడి వెళ్లినా, తాము మాత్రం అండ‌గా నిలిచాం, నిలుస్తున్నామని ఎల్లో జ‌ర్న‌లిస్టులు చెబుతున్నారు. జ‌ర్న‌లిజం నైతిక విలువల‌ను ప‌క్క‌న పెట్టి మ‌రీ... పార్టీని, చంద్ర‌బాబును, ఆయ‌న త‌న‌యుడిని ఓన్ చేసుకుని త‌మ వాయిస్‌ను గ‌ట్టిగా వినిపిస్తున్నారు.

వైసీపీ ప్ర‌భుత్వంపై టీడీపీ కంటే ముందుగా తామే ఘాటైన కౌంట‌ర్స్ ఇస్తున్నామ‌ని గుర్తు చేస్తున్నారు. ఈ ప‌రంప‌ర‌లో ప్ర‌త్య‌ర్థుల నుంచి ఎన్ని ఛీత్కారాలు, అవ‌హేళ‌న‌లు ఎదుర‌వుతున్నా భ‌రిస్తూ, పార్టీ కోసం ప‌ని చేస్తున్న‌ట్టుగా చెబుతున్నారు. టీడీపీ కోసం ప‌ని చేస్తున్న ఎల్లో జ‌ర్న‌లిస్టుల జాబితా వేళ్ల మీద లెక్క పెట్టేంత  వుంది. అయితే వీరిలో చంద్ర‌బాబుకు ఆప్తులెవ‌ర‌న్న‌దే ప్ర‌శ్న‌. ఎల్లో మీడియాధిప‌తుల‌ను కాద‌ని, వారి జ‌ర్న‌లిస్టుల‌కు చంద్ర‌బాబు రాజ‌కీయంగా ప్రాధాన్యం ఇస్తారా? అనేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అస‌లే చంద్ర‌బాబు రాజ‌కీయ లెక్క‌ల్లో దిట్ట‌. చిత్ర‌గుప్తుడిని అయినా మ‌భ్య పెట్ట‌వ‌చ్చేమో కానీ, చంద్ర‌బాబును మోస‌గించ‌డం అంత సులువు కాద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు అంతా తాము చెప్పిన‌ట్టే 2024లో ప్ర‌జాతీర్పు వుంటుంద‌ని ఎల్లో జ‌ర్న‌లిస్టులు ఊహ‌ల్లో తేలాడుతున్నారు. చంద్ర‌బాబు సీఎం, లోకేశ్ అన‌ధికార సీఎం, ఇక త‌మ‌లో ఒక‌రిద్ద‌రికి రాజ్య‌స‌భ‌, మ‌రొక‌రికి ఎమ్మెల్సీ, మ‌రికొంద‌రికి కేబినెట్ హోదాతో కూడిన ప‌ద‌వులు ద‌క్కుతాయ‌ని లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం.

క‌ల‌లు క‌నండి..వాటిని సాకారం చేసుకోండ‌ని అబ్దుల్‌క‌లాం చెప్పిన మాట‌ల‌ను స్ఫూర్తిగా తీసుకుని వారంతా ముందుకు వెళుతున్నారు. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చి, ఆయ‌న ఇష్ట‌మొచ్చిన వాళ్ల‌కు ప‌ద‌వులు ఇస్తే కాద‌న‌డానికి మ‌న‌మెవ‌రం? అయితే చంద్ర‌బాబు అధికారంలోకి రావ‌డం ప్ర‌ధానం. అది అనుకున్నంత ఈజీనా? కాదా? అనేది ప్ర‌జ‌లు తేల్చాల్సిన అంశం. 

Show comments