ఉద్యోగులే భయపడుతుంటే..మరి నిరక్షరాస్యులు..?

రెండు తెలుగు రాష్ట్రాలు సాధ్యమైనంత త్వరగా క్యాష్‌లెస్‌గా మారిపోవాలని 'చంద్రులు' కంకణం కట్టుకోవడంతో దీనిపై ప్రచార, అవగాహన కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. పత్రికా భాషలో చెప్పుకోవాలంటే నగదురహిత విధానంపై పాలకులు ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఈ విధానం అనుసరించడం తప్ప మరో మార్గంలేదని నూరిపోస్తున్నారు. క్యాష్‌లెస్‌ విధానాన్ని ఏ వర్గాలవారు ఎంతవరకు అవగాహన చేసుకుంటున్నారో ఇప్పుడే తెలియదు. అమలు క్రమంలో తెలియాల్సిందే. చాలామంది ఆర్థిక విశ్లేషకులు హడావుడిగా క్యాష్‌లెస్‌ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని తప్పుపడుతున్నారు. 

కొన్ని విదేశీ పత్రికలు కూడా భారతదేశానికి ఇప్పటికిప్పుడు ఈ విధాననం అనవసరమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఇది పూర్తిగా సాంకేతిక విధానం కాబట్టి నిరక్షరాస్యులు, పేదలు అధికంగా మన దేశంలో బలవంతంగా క్యాష్‌లెస్‌ను రుద్దితే ప్రజలు ఇబ్బందులు పడే అవకాశముందని చెబుతున్నారు. క్యాష్‌లెస్‌ లావాదేవీలు ఎవరికివారు ఆసక్తితో స్వచ్ఛందంగా నిర్వహించే పరిస్థితి కల్పించాలే తప్ప బలవంతంగా డెడ్‌లైన్లు పెట్టి రుద్దడం సమంజసం కాదని బ్యాంకింగ్‌ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో విదేశాల అనుభవాలు చూసినా పూర్తి నగదురహిత వ్యవహారాలు చేయడానికి దశాబ్దాలు పట్టింది. 

క్యాష్‌లెస్‌ లావాదేవీలు నిర్వహించడానికి బాగా చదువుకున్నవారు, ఉద్యోగులే భయపడుతున్నారు. వీరే ఇలా ఉంటే అక్షరజ్ఞానం లేనివారి పరిస్థితి ఏమిటి? తాజాగా తెలంగాణ ప్రభుత్వం సచివాయంలో ఉద్యోగులకు నగదురహిత లావాదేవీల విధానంపై తరగతులు నిర్వహించింది. ఈ శిబిరం పేరు డిజిటల్‌ ఫైనాన్షియల్‌ లిటరసీ క్యాంప్‌. మొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన రాజీవ్‌ శర్మ (ప్రస్తుతం ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు), కొత్త చీఫ్‌ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర ఆధ్వర్యంలో ఉద్యోగులకు తరగతులు నిర్వహించారు. ఈ తరగతులను చూశాక క్యాష్‌లెస్‌పై ఉద్యోగులు ఎంత ఆందోళన చెందుతున్నారో అర్థమవుతోంది.  

ఈ విధానంపై అనేకమందికి భయాలున్నాయనే సంగతి తెలుస్తోంది. వాస్తవానికి ఉద్యోగుల్లో అనేకమంది ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వ్యవహారాలు చేస్తున్నారు. కార్డులు ఉపయోగించి షాపింగ్‌ చేస్తున్నారు. అయితే ఇకమీదట నూరు శాతం క్యాష్‌లెస్‌ విధానమే అనుసరించాలనేసరికి భయపడుతున్నారు. ఈ అవగాహన తరగతుల్లో చాలామంది ఉద్యోగులు ప్రశ్నల రూపంలో తమ భయాలను వ్యక్తం చేశారు. బ్యాంకుల్లోని తమ డబ్బుకు ఎంతవరకు భద్రత ఉంటుందని అడిగారు. ఉద్యోగుల సందేహాలకు బ్యాంకర్లు సమాధానాలిచ్చారు. 

ఉద్యోగులకు ఇలా శిబిరం పెట్టి వివరించడం బాగానే ఉంది. మరి పేదలకు, నిరక్షరాస్యులకు, చిరు వ్యాపారులకు, అసంఘటిత కార్మికులకు, రోజు కూలీలకు ఇలాగే వివరించగలరా? అవగాహన శిబిరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోందా? చదువుకున్నవారు, ఉద్యోగులు బ్యాంకర్లు చెప్పింది విని అర్థం చేసుకోగలుగుతారు. సందేహాలు అడిగి నివృత్తి చేసుకుంటారు. మరి నిరక్షరాస్యులు ఈ పని చేయగలరా? వారికి అర్థమయ్యేలా బ్యాంకర్లు వివరించగలరా?  ఇక క్యాష్‌లెస్‌ విధానంపై పాలకుల అనుకూల ప్రచారం సాగుతుండగానే మరోపక్క మీడియాలో ఈ విధానంలో జరిగే మోసాలపై కథనాలు వెలువడుతున్నాయి. 

సైబర్‌ నేరగాళ్లు ఏవిధంగా మోసం చేసి డబ్బు కాజేస్తారో మీడియా వివరిస్తోంది. అవి చదువుతున్నప్పుడు నిరక్ష్యరాస్యులు అనుక్షణం అప్రతమత్తంగా ఉంటూ తమ డబ్బును కాపాడుకోవడం అంత సులభం కాదనిపిస్తోంది. సైబర్‌ నేరగాళ్లు చేసే మోసాలు విద్యాధికులకు అర్థం కావడమే కష్టం. అనేకమంది మోసపోతున్న ఉదంతాలు మీడియాలో చూస్తూనే వున్నాం. ఇతరులను నమ్మి వారిపై ఆధారపడి వ్యవహారాలు చేసే పేదలు, నిరక్షరాస్యులు సులభంగా మోసాలకు గురయ్యే ప్రమాదముంది. ముఖ్యంగా క్యాష్‌లెస్‌ విధానంలో సాంకేతికతను నిరక్షరాస్యులు అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి పాలకులు క్యాష్‌లెస్‌ విధానాన్ని క్రమంగా అలవాటు చేయాలి తప్ప గొంతు మీద కత్తి పెట్టి చేయించడం మంచిది కాదు. 

Show comments