మాటలతో కాంగ్రెస్‌ 'సర్కార్ల కోటలు'...!

లోక్‌సభకు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు 2019లో జరుగుతాయి. కాని తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. అంటే రెండేళ్ల ముందుగానే కోలాహలం మొదలైపోయిందన్నమాట. ఆంధ్రాను అలా పక్కన పెడితే తెలంగాణలో కాంగ్రెసు, బీజేపీ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఈమధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా వచ్చి కేసీఆర్‌ సర్కారుపైన తీవ్రమైన విమర్శలు చేసి వెళ్లారు. ఇప్పుడు కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వచ్చి షా కంటే తీవ్రమైన విమర్శలు చేశారు.

ఎన్నికలకు రెండేళ్ల ముందే పార్టీల ప్రచారం ఇంత ఉధృతంగా ఉంటే ఎన్నికల్లో ఇంకెలా ఉంటుందో...! రాహుల్‌ సభ బ్రహ్మాండంగా విజయవంతమైందని, ఇక రాష్ట్రంలో అధికారం తమదేనని నేతలు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. 2019లో తెలంగాణలోనే కాకుండా కేంద్రంలోనూ కాంగ్రెసు అధికారంలోకి వస్తుందని, రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం తథ్యమని నాయకులు రాహుల్‌ సభలో చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో నూటపదకొండు సీట్లు గెల్చుకుంటామని కేసీఆర్‌ చెప్పారని, కాని ఆ సీట్లు గెలుచుకునేది టీఆర్‌ఎస్‌ కాదని, కాంగ్రెసు పార్టీయేనని నాయకులు బల్ల గుద్దారు. రెండేళ్ల ముందుగానే రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేశారు.

బస్సులోనో, రైలులోనో ప్రయాణికులు కర్చీఫులు. తుండుగుడ్డలు వేసి సీట్లు రిజర్వు చేసుకున్నట్లుగా కాంగ్రెసు నాయకులు అధికారం రిజర్వు చేసి పెట్టుకున్నారు. మాటలతోనే తెలంగాణలో, కేంద్రంలో సర్కారుల కోటలు కట్టేశారు. కేంద్రంలో కాంగ్రెసు అధికారంలోకి వస్తే ప్రధాని రాహుల్‌ గాంధీయే. ఆయన ప్రధాని కావడం ఇప్పటికే ఆలస్యమైంది. రాష్ట్రంలో కాంగ్రెసు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కోసం కొట్టుకోవడానికి నాయకులు సిద్ధంగా ఉన్నారు. అధికాష్టానం ఎవరినో ఒకరిని నెత్తి మీద రుద్దేంతవరకు పదవి కోసం పోటీ పడతారు.

అసలు తెలంగాణలో, కేంద్రంలో అధికారంలోకి వస్తామని కాంగ్రెసు నాయకులు ఇంత ధీమాగా ఎందుకు చెబుతున్నారో తెలియదు. అందుకు ఆధారాలు ఉన్నాయా? అధికారంలోకి వస్తామంటున్నవారు ఫలానా కారణాలవల్ల పవర్‌లోకి వస్తామని స్పష్టంగా చెప్పడంలేదు. తెలంగాణలో కేసీఆర్‌పై, దేశంలో నరేంద్ర మోదీపై వ్యతిరేకత ఉందని, కాబట్టి ప్రజలు కాంగ్రెసునే అధికారంలోకి తెస్తారని చెబుతున్నారు.

కేసీఆర్‌, మోదీపై నిజంగా వ్యతిరేకత ఉందా? ఉంటే ఏ స్థాయిలో ఉంది? రెండేళ్ల ముందుగా తెలిసే అవకాశం లేదు. కేసీఆర్‌ సర్వే చేయించుకొని టీఆర్‌ఎస్‌కు 111 సీట్లు వస్తాయని, కాంగ్రెసుకు రెండు మాత్రమే వస్తాయని చెప్పారు. దీంతో ఒళ్లు మండిన కాంగ్రెసు నాయకులు అన్ని సీట్లు తమకే వస్తాయంటున్నారు.

ఏ పార్టీకాపార్టీ చేయించుకునే సర్వేల్లో వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయనే చెప్పకుంటారు. అధికార, ప్రతిపక్షాలు పరస్పరం మైండ్‌ గేమ్‌ ఆడుకుంటున్నాయి. ఎవరికివారే తామే బలవంతులమని చెప్పుకుంటున్నారు. సంగారెడ్డి సభలో రాహుల్‌ బాగా ప్రసంగించారని, ఆయన ప్రసంగానికి స్పందన బాగా వచ్చిందని మీడియాలో వార్తలొచ్చాయి. సంగారెడ్డిలో సభ నిర్వహించడానికి కారణం ఓ సెంటిమెంటు. ఇందిరాగాంధీ 1980-84 వరకు మెదక్‌ పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు.

ఇప్పుడు రాహుల్‌ సభ జరిగిన చోటనే 1979లో ఇందిరా గాంధీ సభ జరిగింది. అప్పుడు ఆమె, ఇప్పుడు రాహుల్‌ ఒక్కచోటి నుంచే ప్రసంగించారన్నమాట. ఇదో శుభసూచకంగా రాష్ట్ర కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు. అందుకే కాంగ్రెసు అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు. ఇదో మూఢ నమ్మకం. రాహుల్‌ సభకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతవరకే.

రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు తాము ఆణిముత్యాలమని, ఎదుటివారు అధములని భావిస్తుంటారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని రాహుల్‌ విమర్శించారు. వెంటనే టీఆర్‌ఎస్‌ నాయకులు జవహర్‌లాల్‌ నెహ్రూ నుంచి రాజీవ్‌ గాంధీ వరకు ప్రధానులైన వైనం వివరించి మీది కుటుంబ పాలన కాదా అని నిలదీశారు.

ఇప్పుడు కుటుంబ పాలన అనేది పెద్దగా పట్టించుకోవల్సిన విషయమని ఎవరూ అనుకోవడంలేదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది. కుటుంబ పాలన లేదా వంశపారంపర్య పాలన అనే విమర్శ అవుట్‌డేటెడ్‌ అయిపోయింది. ఏది ఏమైనా తెలంగాణలో తన బలం చాటుకునేందుకు కాంగ్రెసు గట్టి ప్రయత్నమే చేసింది. ఈ బలం ఎన్నికల్లో ఎలా ఉంటుందో...!

Show comments