ద్రవిడ సిద్ధాంతాలకు నీళ్లొదిలిన 'జయ'

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎంతటి పవర్‌ఫుల్‌ నాయకురాలో, ఎంతటి ఆధిపత్యం, అధికారం చెలాయించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అగ్రకులాధిపత్యానికి ఇంకా చెప్పాలంటే బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా పుట్టిన ద్రవిడ ఉద్యమానికి ప్రతీక అయిన అన్నాడీఎంకేలో బ్రాహ్మణ (శ్రీరంగం వైష్ణవులు-అయ్యంగార్లు) సామాజిక వర్గానికి చెందిన జయలలిత ఎదురులేని నాయకురాలిగా ఎదగడం సామాన్యమైన విషయం కాదు. కాని దాన్ని ఆమె సాధించారు. కన్నుమూసేవరకు ఏకచ్ఛత్రాధిపత్యంగా పార్టీని ఏలారు. 

మొదటిసారి 1991లో ముఖ్యమంత్రి కాగానే పార్టీలో, ప్రభుత్వంలో ఆమె ఆధిపత్యం కూడా ప్రారంభమైంది. పగ్గాలు చేపట్టిన మరుక్షణమే అమ్మకు ఎదరులేకుండా పోయింది. బలమైన బ్రాహ్మణేతర సామాజిక వర్గాలున్న తమిళనాడులో బ్రాహ్మణ వర్గానికి చెందిన మహిళ ఈవిధంగా విశ్వరూపం చూపించడం అరుదనడంలో సందేహం లేదు. ఇక అన్నాడీఎంకేలో బ్రాహ్మణ నాయకుడుగాని, నాయకురాలుగాని పార్టీ పగ్గాలు లేదా ప్రభుత్వ పగ్గాలు చేపట్టే అవకాశం ఉండకపోవచ్చు. జయలలితను ఎంజీఆర్‌ రాజకీయాల్లోకి తీసుకొచ్చిన మాట వాస్తవమైనా ఆయన ఏనాడూ ఆమెను తన వారసురాలిగా ప్రకటించలేదు. దీంతో ఆమె భీకరమైన పోరాటం చేయాల్సివచ్చింది. 

బ్రాహ్మణాధిపత్య వ్యతిరేక పునాదుల మీద పుట్టిన పార్టీలో ఆ సామాజికవర్గానికి చెందిన జయలలిత పోరాటం చేసి విజయం సాధించడమే కాకుండా పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా తన ఆధిపత్యాన్ని, చరిస్మాను అలాగే కొనసాగించడం విశేషం. చెప్పుకోదగ్గ విషయమేమిటంటే జయ తొలిసారి ముఖ్యమంత్రి కాగానే ద్రవిడ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి కూడా పార్టీలో పట్టును కోల్పోలేదు.

ప్రస్తుతం రాష్ట్రంలోని ద్రవిడ పార్టీలన్నీ పేరుకే ద్రవిడ పార్టీలుగా కొనసాగుతున్నాయి తప్ప ద్రవిడ సిద్ధాంతాలేమీ లేవు. కాలానుగుణంగా అనేక మార్పులు సంతరించుకున్నాయి. డికె (ద్రవిడ కళగం), డిఎంకె (ద్రవిడ మునేట్ర కళగం), అణ్ణాడిఎంకే (అణ్ణా ద్రవిడ మున్నేట్ర కళగం)...ఇవి ప్రధాన ద్రవిడ పార్టీలు. 

కాలక్రమంలో మరికొన్ని ద్రవిడ పార్టీలు పుట్టాయనుకోండి. కాని వాటికి అంత ప్రాధాన్యం లేదు. ఆది ద్రవిడ పార్టీ అయిన డికె కూడా నామమాత్రమైంది. డికె నుంచి డీఎంకే, డీఎంకే చీలిపోయి అన్నా డీఎంకే ఏర్పడ్డాయి. ఈ పార్టీలోనూ చీలికలు రావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తమిళనాడు ద్రవిడ ఉద్యమానికి, ద్రవిడ సంస్కృతికి పేరెన్నికగన్నది. ద్రవిడ ఉద్యమం-తమిళ రాజకీయాలు రెండూ నాణేనికి బొమ్మ, బొరుసు వంటివి. ద్రవిడ ఉద్యమం, ద్రవిడ సిద్ధాంతాలు ఇక్కడ ఎంతగా వేళ్లూనుకొనిపోయాయంటే ఈ గడ్డ మీద మరో పుట్టి పెరగడంగాని, పెరిగినా బతికి బట్ట కట్టడంగాని సాధ్యం కాని పని. 

ద్రవిడ ఉద్యమం ప్రభావంతో ఏర్పడిన మొదటి పార్టీ డీకే (ద్రవిడ కళగం). కాంగ్రెసు నుంచి చీలిపోయిన రాజగోపాలాచారి తదితరులు నెలకొల్పిన 'జస్టిస్‌ పార్టీ' నుంచి వేరుపడిన శకలమే డీకే. నాస్తికుడిగా, సంఘ సంస్కర్తగా పేరుబడిన ఇవిఆర్‌ పెరియార్‌ నాయకర్‌ నాయకత్వంలో డీకే ద్రవిడ ఉద్యమ ప్రతినిధిగా ఎదిగింది. ద్రవిడ పార్టీలకు ప్రధాన పునాదులు నాస్తికత్వం, బ్రాహ్మణ వ్యతిరేకత, అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం. ద్రవిడ సిద్ధాంతం మతాన్ని కూడా అంగీకరించదు. తమిళనాడులో వెనకబడిన, బడుగు బలహీన వర్గాలవారు అధికం. వీరి మీద అల్ప సంఖ్యాకులైన అగ్రవర్ణాలవారు పెత్తనం చేయడం ద్రవిడ ఉద్యమకారులు సహించలేకపోయారు. 

దీంతో బ్రాహ్మణ ద్వేషం వటవృక్షంలా ఎదిగింది. ఈ అగ్నికి ద్రవిడ పార్టీల నాయకులు ఆజ్యం పోశారు. కాలక్రమంలో సంభవించిన రాజకీయ పరిణామాల్లో డీకే నుంచి విడివడి అణ్ణాదురై నాయకత్వంలో డీఎంకే ఏర్పడింది. ఆ తరువాత డీఎంకే నుంచి సినీ హీరో ఎంజీఆర్‌ బయటకు వచ్చి అన్నా డీఎంకే స్థాపించారు. తమిళుల ఆరాధ్య దైవమైన అణ్ణాదురై ద్రవిడ సిద్ధాంతాల నుంచి వైదొలగలేదు. 

ఆయన వారసుడైన ఎంజీఆర్‌ కొంత ఉదారంగా వ్యవహరించారు. ఇక జయలలిత మొదటిసారి అధికారం చేపట్టగానే ద్రవిడ సిద్ధాంతాలకు, దాని భావజాలానికి నీళ్లొదలడం ప్రారంభించారు. జయలలిత అధికారానికి వచ్చిన కొత్తల్లో డీకే, డీఎంకే ఆమెను తీవ్రంగా విమర్శించాయి. ద్రావిడ పరంపరను నాశనం చేస్తున్నారని, దాని సిద్ధాంతాలను కాలరాస్తున్నారని మండిపడ్డాయి. అయితే ప్రజలను ఆకర్షించడమే ధ్యేయంగా పెట్టుకున్న జయలలిత అనేక జనాకర్షక పథకాలు రూపొందించారు. ఈ దశలో ద్రవిడ సిద్ధాంతాలను ఆమె పట్టించుకోలేదు.

జయలలిత మొదటిసారి అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే ఆలయాలపై అమిత శ్రద్ధ తీసుకోవడం ప్రారంభించారు. నాస్తికత్వమే పునాది అయిన ద్రవిడ పార్టీకి చెందిన జయలలిత ఆలయాల పునరుద్ధరణ పథకాన్ని ప్రారంభించారు. ఆలయాల జీర్ణోద్ధరణ కోసం కంకణం కట్టుకున్నారు. ఆమె ఈ ధోరణి సహజంగానే బ్రాహ్మణులను, ఇతర ఆస్తిక అగ్రవర్ణాలవారిని ఆకర్షించింది. ఆలయ జీర్ణోద్ధరణ నిధికి ముందుగా ఆమే విరాళం ప్రకటించారు. ఆ తరువాత ఈ పథకానికి కుప్పలు తెప్పలుగా నిధులు రావడం ప్రారంభమైంది. మంత్రులు తమ శాఖలకు చెందిన ఉద్యోగుల నుంచి డబ్బు వసూలు చేసి ఆలయ పునరుద్ధరణ పథకానికి విరాళంగా ఇచ్చారు. అలాగే ఎంతోమంది పారిశ్రామికవేత్తలూ విరాళాలిచ్చారు. రాష్ట్రంలోని 123 ఆలయాల్లో ఒక్కపూటైనా పూజలు జరిపించాలనే ఉద్దేశంతో వాటికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఆర్థికంగా దైన్య స్థితిలో ఉన్న ఆలయాలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. రాష్ట్రంలో వేద ఆగమ పాఠశాలలు ప్రారంభిస్తామని ప్రకటించారు. అర్చకులకు పెన్షన్‌ పెంచారు.

జయకు ముందు ఏ ముఖ్యమంత్రీ ఆలయాల పట్ల ఇంత శ్రద్ధ చూపించలేదు. జయలలిత ద్రవిడ పార్టీకి నాయకత్వం వహించినప్పటికీ ఆమె ద్రవిడ సిద్ధాంతాలు జీర్ణించుకోలేదు. అధికారమే పరమావధిగా పెట్టుకున్న ఆమె ప్రజలను ఆకర్షించే, వారి ఆదరణ పొందే పథకాలు, కార్యక్రమాల పట్లనే మొగ్గు చూపారు. ఆమెకు బ్రాహ్మణ సామాజిక వర్గంపై పక్షపాతం ఉందని విమర్శలు చేసినా పట్టించుకోలేదు.

ఆలయాలపట్ల ఆమె శ్రద్ధ తీసుకోవడంతో ప్రతి ఏడాది ఆమె జన్మదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగేవి. మంత్రులంతా ఆలయాలకు వెళ్లి తమ నాయకురాలి పేరిట ప్రత్యేక పూజలు చేయించేవారు. మతోన్మాద పార్టీగా ముద్ర వేయించుకున్న బీజేపీతో దోస్తీకి ఆమె ఎంతో ఉత్సాహం చూపించేవారు. అయోధ్యలో రామాలయ నిర్మాణంపై బీజేపీ వాదనను సమర్ధించారు.

ద్రవిడ ఉద్యమాన్ని గురించి డీకే, డీఎంకే అప్పుడప్పుడు గొంతు పెగుల్చుకున్నా ప్రజల్లో స్పందన రాలేదు. ఇక జయలలిత మొదటి టర్మ్‌లో డీఎంకే హిందీ వ్యతిరేకోద్యమాన్ని లేవదీయాలని ప్రయత్నాలు చేసినా జనం పట్టించుకోలేదు. ద్రవిడ ఉద్యమ సిద్ధాంతాల్లో హిందీ వ్యతిరేకత కూడా భాగమే. ఒకసారి డీఎంకే మెరీనా బీచ్‌లో భారీ స్థాయిలో హిందీ వ్యతిరేకోద్యమ సభ నిర్వహించింది. అందులో మాట్లాడిన కరుణానిధి రాష్ట్రంలో హిందీ భాషకు ప్రాధాన్యం పెరుగుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ భారీఎత్తున పోరాటం చేస్తామన్నారు. వాస్తవానికి జయలలితకు హిందీపై వ్యతిరేకత ఏమీ లేదు.

ఆమె ద్రవిడ పార్టీకి నాయకురాలైనప్పటికీ ద్రవిడ ఉద్యమంతో ఆమెకు సంబంధం లేదు. అసలు సిసలు ద్రవిడ పార్టీ ద్రావిడ కళగం (డికె). దాంతో అన్నాడీఎంకేకు ఏమీ సంబంధం లేదు. డీఎంకే నుంచి విడిపోయిన ఎంజీఆర్‌ ఈ పార్టీ పెట్టారు. కాబట్టి డీకే ప్రభావం లేదనే చెప్పాలి. తమిళనాడులో హిందీ వ్యతిరేకత అనేది రాజకీయ అస్త్రమే తప్ప ప్రజల్లో వ్యతిరేకత లేదనే చెప్పాలి. జయలలిత ఏనాడూ సిద్ధాంతాలు బోధించలేదు. సుదీర్ఘ ప్రసంగాలు చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా ఆ యాత్ర ఈ యాత్ర అంటూ అదే పనిగా ప్రజల్లో తిరగలేదు.

ఏ రాష్ట్రంలోనైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన లీడర్‌ మీడియాతో సత్సంబంధాలు నెరపాలని, ప్రభుత్వ పథకాలకు ప్రచారం కావాలని కోరుకుంటాడు. కాని జయలలిత ఐదేళ్లపాటు మీడియాను దగ్గరకు రానివ్వలేదు. పత్రికా సమావేశాలు పెట్టిన దాఖలాలు లేవు. ఎంత పెద్ద విషయం చెప్పాలన్నా కేవలం ప్రకటన విడుదల చేసేవారంతే...! 

ఇక ద్రవిడ ఉద్యమం వ్యక్తి పూజకు వ్యతిరేకం. నాయకుడిని దైవాంశ సంభూతుడిలా ఆరాధించడం, దేవుడిలా పూజించడం చేయకూడదు. కాని జయలలిత ఇందుకు వ్యతిరేకంగా వ్యహరించారు. మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే ఆమె పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆరాధ్య దేవతగా మారిపోయారు. వినయవిధేయతలు, నియంతృత్వం పతాకస్థాయికి చేరాయి. పాదాభివందనాలు నిత్యకృత్యమయ్యాయి. అసెంబ్లీలోనే ఆమె పార్టీ సభ్యులు స్తోత్రం చేసేవారు. మరి దీన్నంతటినీ ఆమె వ్యతిరేకించినట్లుగా కనబడలేదు. ఆమె జీవించినంతకాలం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఆమెను 'జయలలిత' అని సంభోదించి ఎరుగరు. 'అమ్మ' అని మాత్రమే అనేవారు. కొందరు పురట్చి తలైవి అనేవారు. ఈ రెండు రకాలుగా తప్ప మరోలా ఉచ్చరించేవారు కాదు. జయలలిత ప్రజా నాయకురాలు. ద్రవిడ నాయకురాలు కాదు. ప్రజాకర్షక నేత. ద్రవిడ సిద్ధాంతాల ప్రవచనకర్త కాదు.

-నాగ్‌ మేడేపల్లి

Show comments