అనేకమంది భారతీయులు గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు పోగొట్టుకుని, అన్నాహారాలకై అలమటిస్తూ మన దేశానికి తిరిగి వచ్చారని వార్తలు చదువుతూన్నాం. ఒకప్పుడు సిరులతో అలరారిన అరబ్బుసీమలు యీనాడు తమ కార్మికులకు ఆరేసి నెలల జీతాలు బకాయి పెట్టి, వేలాది సంఖ్యలో ఉద్యోగులను తీసేయడం ఆశ్చర్యం కలిగించవచ్చు. గల్ఫ్‌లో మిగతా దేశాల మాట ఎలా వున్నా సౌదీ దగ్గర కుప్పలుతిప్పలుగా డబ్బు వుందని, మతపరంగా వుండే వారి ఆంక్షలను భరించడం నేర్చుకుంటే యిక్కడ పదేళ్లలో సంపాదించేది అక్కడ ఏడాదిలోనే సంపాదించుకోవచ్చని మనం నమ్ముతూ వచ్చాం. గల్ఫ్‌లో మొత్తం 60 లక్షల మంది భారతీయులుంటే, సౌదీలో 18 లక్షల మంది వున్నారు. వారిలో వేలాది మంది నాలుగైదు నెలల్లో నిరుద్యోగులయ్యారు. దీనికి కారణం సౌదీ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం. సౌదీలో అతి పెద్ద నిర్మాణ సంస్థ అయిన బిన్‌లాడెన్ గ్రూపు ఏప్రిల్ నెలలో 50 వేల మంది విదేశీ కార్మికుల ఉద్యోగాలు తీసేసి వీసాలు యిచ్చి యిళ్లకు పొమ్మంది. బకాయిపడిన జీతపు సొమ్ము యిస్తే తప్ప వెళ్లమని వాళ్లు మొండికేశారు. కంపెనీ యివ్వనంటే దాని బస్సులు తగలబెట్టారు. సౌదీ ఆగర్ అనే కంపెనీ జులైలో అనేక మంది భారతీయుల ఉద్యోగాలు పీకేసింది. 2014 జులైలో బారెల్ 110 డాలర్లు వుండే పెట్రోలు ధర తగ్గుతూ వచ్చి యిప్పుడు 30 డాలర్లు కావడంతో గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై పోయింది. ఆదాయంలో 90% తక్కిన దేశాల కంటె సౌదీ మరిన్ని చిక్కుల్లో పడింది. కితం ఏడాది పెట్రోలుపై వస్తాయనుకున్న లాభాల్లో 390 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. ఈ ఏడాది బజెట్ లోటు 100 బిలియన్ డాలర్లు వుండవచ్చు.
అరబ్ దేశాల్లో గత సంవత్సరం కింగ్ సల్మాన్ రాజయ్యేనాటికే సౌదీ పరిస్థితి బాగా లేదు. చమురు అమ్మకాలపై యిన్నాళ్లూ యిబ్బడిముబ్బడిగా ఆదాయం వచ్చిపడడంతో అది పెట్టి స్వదేశంలో ప్రజల విధేయతను, విదేశాలలో పలుకుబడిని కొంటూ వచ్చింది. నియంతృత్వానికి వ్యతిరేకంగా 2011లో తిరుగుబాట్లు జరిగి అరేబియాలో అనేకమంది దేశాధినేతలు కుప్పకూలుతూండగా దడిసిన సౌదీ రాజు అబ్దుల్లా ప్రజలను ఊరుకోబెట్టడానికి 70 బిలియన్ల ఆర్థిక ప్యాకేజి ప్రకటించి విద్యుత్, నీరు చార్జిలలో సబ్సిడీలు యిచ్చాడు. ఈ రాయితీలతో, చమురు ధరలు తగ్గడంతో 2015 వచ్చేసరికి విదేశీ నిల్వలు 16% తగ్గి 616 బిలియన్ డాలర్లకు చేరాయి. 1991 తర్వాత తొలిసారి 10 బిలియన్ డాలర్ల విదేశీ ఋణం తీసుకోవలసి వచ్చింది. ఇలాటి కష్టాలతో బాటు రాజుకు మరో కష్టం కూడా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ రూపంలో దాపురించింది. పేరుకు రక్షణమంత్రే కానీ ఆర్థిక, విదేశీ వ్యవహారాల్లో కూడా తల దూరుస్తాడు. దూకుడెక్కువ. యెమెన్‌పై యుద్ధం చేసి తీరాలన్న అతని పట్టుదల దేశం కొంప ముంచుతోంది. అమెరికా మద్దతుతో యిరుగుపొరుగు దేశాలపై పెత్తనం చలాయిద్దామని చూస్తున్న సౌదీకి ఇరాన్‌ను చూస్తే కన్నెఱ్ఱ. సిరియాను చూస్తే ఒళ్లు మంట. సిరియా పాలకుడు అసాద్‌ను గద్దె దించాలని అమెరికా, పశ్చిమ యూరోప్ దేశాల తోడ్పాటుతో తిరుగుబాటుదారులకు డబ్బు, ఆయుధాలు యిచ్చి ప్రోత్సహించడమనేది అబ్దుల్లా పాలనలోనే ప్రారంభమైంది. ఐదేళ్లగా తంటాలు పడినా అది సఫలం కాలేదు. ఇప్పుడు యెమెన్‌లో హౌతీలను అణచివేసే దుస్సాహసం నడుస్తోంది. ఇప్పటిదాకా అదీ సఫలం కాలేదు. ఇవన్నీ దేశానికి భారంగా పరిణమించాయి.
యువరాజు సల్మాన్ మెకెన్సీ వాళ్లను పిలిచి, ఆర్థిక పరిస్థితి ఎలా చక్కదిద్దాలో సూచించమన్నాడు. ప్రపంచ బ్యాంకుతో సహా అలాటి సంస్థలన్నీ ఎలాటి సలహాలిస్తాయో మన దేశానికి బాగా అనుభవమే. అవే సలహాలు వారికీ దయచేశారు. 'ప్రజలకు యిచ్చే రాయితీలు కట్ చేసి పడేయాలి, ప్రభుత్వ సెక్టార్‌లో పెట్టుబడులు ఉపసంహరించాలి, విదేశాలనుంచి ప్రయివేటు పెట్టుబడులు ఆహ్వానించాలి, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే 30 లక్షల మంది విదేశీ ఉద్యోగులను తీసివేయాలి (నిజానికి వారి జీతాలు తక్కువే). ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యం పూర్తిగా తగ్గించివేసి, మార్కెటు ఆధారంగా నడపాలి. చమురు ఆధారిత ఎకానమీ నుంచి పరిశ్రమ-టూరిజం-ఫైనాన్స్ ఆధారిత ఎకానమీగా మార్పు తేవాలి. ఈ మార్పు తేవడానికి అయ్యే పెట్టుబడి కోసం ప్రభుత్వ ఆస్తులను అమ్మివేయాలి.' వినగానే ఇదంతా జరిగే పనేనా అనిపిస్తుంది. ఎందుకంటే యిప్పటిదాకా సౌదీ ప్రజలు పన్నులు కట్టనక్కరలేకుండా, హాయిగా రాయితీలు పొందుతూ, తక్కువ జీతాలకు పనిచేసే విదేశీ పనివాళ్ల చేత సేవలు పొందుతూ కులాసాగా వున్నారు. ఇప్పుడు అవన్నీ పోయి, ఏ విదేశీ కంపెనీలోనే ఉద్యోగాలు చేసుకుంటూ, ఆ ఉద్యోగం వుంటుందో వూడుతుందో తెలియని అభద్రతా భావంతో బతకడం అంటే ఎంత హడిలిపోతారో వూహించుకోవచ్చు.
అయితే యువరాజు సల్మాన్‌కు మెకెన్సీ నివేదిక బ్రహ్మాండంగా నచ్చింది. సౌదీ విజన్- 2030 అని డాక్యుమెంటు పెట్టి దాన్ని యథాతథంగా దింపేశాడు. 2030 నాటికి 60 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానన్నాడు. అతనిప్పటిదాకా చేసి చూపించిందేమీ లేకపోయినా, రాజుకి కొడుకు శక్తిసామర్థ్యాలపై అపారమైన నమ్మకం. అందువలన అతను 2020 కల్లా పెట్రోకెమికల్స్ పరిశ్రమలు, మధ్య స్థాయి మాన్యుఫేక్చరింగ్ పరిశ్రమలు పెడతానని అనడంతో దానికై ఆరామ్‌కో అనే ప్రభుత్వ చమురు సంస్థలో 2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల ఉపసంహరణకు అనుమతి యిచ్చేశాడు. వీళ్లు అమ్మచూపితే కొనేవాళ్లెవరు అంటే చైనా ముందుకు వచ్చింది. సౌదీ నుంచి భారీ స్థాయిలో పెట్రోలు కొంటున్న చైనా యిప్పటికే 2.48 బిలియన్ డాలర్ల న్యూక్లియార్ డీల్ చేసుకుంది. చైనాకు సంబంధించిన సైనోపెక్, పెట్రో చైనా, యునాన్ యుంటియాహువా ఆరామ్‌కోతో కలిసి సౌదీలో, చైనా సముద్రతీరంలో ఆయిల్ రిఫైనరీలు నెలకొల్పుతున్నారు. చైనా కనస్ట్రక్షన్ కంపెనీలు హారామెయిన్ రైల్‌రోడ్డును కడుతున్నారు. సౌదీ అరేబియాకు ప్రస్తుతం చైనాయే అందరి కంటె పెద్ద వాణిజ్యభాగస్వామి. ఇప్పటిదాకా అమెరికాతో కలిసి వూరేగుతున్న సౌదీ చైనాను ఆదరించడానికి వెనుక కొన్ని కారణాలున్నాయి.
వహాబి మార్గాన్ని అనుసరించే సౌదీకి షియా మార్గం అవలంబించే ఇరాన్ అంటే పడదు. ఇరాన్ ఆధిపత్యానికి గండి కొట్టడానికి అది ఎంత దూరమైనా వెళుతుంది. దాని ప్రోద్బలంతో అమెరికా ఇరాన్ ఆర్థిక దిగ్బంధాన్ని ప్రకటించింది. కానీ యిటీవల దానితో అణు ఒప్పందం కుదుర్చుకుని దిగ్బంధం ఎత్తివేసింది. అది సౌదీకి ఆగ్రహం కలిగించింది. వెంటనే సౌదీలో వున్న షియా మతగురువు ఆయొతొల్లా నిమ్ర్‌ను 46 మందితో కలిపి ఉరి తీసింది. దానికి ఇరాన్ అభ్యంతరం తెలిపింది. చమురు ధరలు పడిపోతున్నకొద్దీ తమ దేశాలు దెబ్బ తింటున్నాయని గుర్తించిన పెట్రోలు ఎగుమతి చేసే దేశాలన్నీ దోహాలో సమావేశమై చమురు ఉత్పత్తిని యిదే స్థాయిలో స్తంభింపచేసి, ధర మరీ పడిపోకుండా చేద్దామని ప్రతిపాదించాయి. దానికి సౌదీ ప్రతినిథి సుముఖంగానే కనబడినా ఆఖరి నిమిషంలో అడ్డుపుల్ల వేశాడు. ఇరాన్ తన అమ్మకాలను యీ స్థాయిలో స్తంభింపచేస్తేనే తను ఒప్పుకుంటానని మడత పేచీ పెట్టింది. ఇన్నాళ్లూ ఆర్థికదిగ్బంధం వలన కొట్టుమిట్టులాడిన ఇరాన్ యీ ప్రతిపాదనకు అంగీకరించడం అసంభవం. అందువలన ఒప్పందం కుదరలేదు. సౌదీ ప్రతినిథి చేత అలా చెప్పించినది యువరాజు సల్మానేట. ఆ ప్రాంతంలో తమ ఆధిపత్యం పోకుండా వుండడానికే యిలా చేశాడట. తమ వద్ద ఆస్తులు బాగానే వున్నాయి కాబట్టి యింకా రేటు తగ్గినా తాము తట్టుకోగలం కానీ చిన్న దేశాలు విలవిలలాడి తమ చెంత చేరతాయని అతని అంచనా. అంతేకాక, రేటు తగ్గిపోతున్నకొద్దీ యిటీవలే అమ్మకాలు మొదలుపెట్టిన ఇరాన్, రష్యా బాగా దెబ్బ తింటాయి. మూడో కారణం కూడా వుంది - అమెరికాలో గల్ఫ్ ఆయిలుకు ప్రత్యామ్నాయంగా షేల్ (మట్టి కలిసిన ఖనిజం) నుండి తీసిన పెట్రోలు అమ్ముతున్నారు. గల్ఫ్ పెట్రోలు ధర హెచ్చుగా వున్నపుడే షేల్ పెట్రోలు వ్యాపారం బాగుంటుంది. దీని ధర పడిపోతే ఆ వ్యాపారం కిట్టుబాటు కాక మూతపడుతుంది. ఇటువంటి లెక్కలు వేసి సౌదీ పెట్రోలు ఉత్పత్తిని ఫ్రీజ్ చేయకుండా చూసి ధరలు పడిపోనిస్తోంది.
ఇరాన్‌కు సాయపడి, తమ ప్రాంతంలో తమకు పోటీదారుగా తయారుచేస్తున్నందుకు సౌదీకి ఒబామా ప్రభుత్వంపై గుర్రుగా వుంది. అంతేకాదు, మరో సమస్య కూడా వుంది. 9/11 దాడుల గురించి సమర్పించిన యింటెలిజెన్సు నివేదికలో సౌదీ పౌరుల, నాయకుల పాత్ర గురించి 28 పేజీలలో వివరాలున్నాయి. సౌదీలోని వహాబిజం నుంచి గతంలో అల్ కైదా, ప్రస్తుతం ఐసిస్ స్ఫూర్తి పొందుతున్నాయని పాశ్చాత్య దేశాలు నమ్ముతున్నాయి. అల్ కైదాకు సౌదీ రాచకుటుంబీకులు ధనసహాయం చేసినట్లు ఆధారాలున్నాయి. ఆ డబ్బు 9/11 దాడులకు ఉపయోగపడింది. దానిలో పాల్గొన్న 19 మంది హైజాకర్లలో 15 మంది సౌదీలే. అమెరికాలోని సౌదీ డిప్లోమాట్, సౌదీ గూఢచారి సంస్థ దాడికి తోడ్పడ్డాయని ఎఫ్‌బిఐ ఏజంట్లు తెలిపారు. ఈ నివేదికను బయటపెట్టినపుడు సౌదీ వారి పాత్ర గురించి వున్న 28 పేజీలను సెన్సార్ చేసి విడుదల చేయాలని బుష్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పేజీలను విడుదల చేసింది నేటి ఒబామా ప్రభుత్వం. దానిపై అమెరికన్ సెనేట్ బిల్లు పాస్ చేస్తానంది. అది పాస్ అయితే 9/11 దాడిలో నష్టపోయినవారు సౌదీ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోరవచ్చు. అలా చెల్లిస్తే సౌదీ ప్రభుత్వానికి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. 'బిల్లు పాస్ చేస్తే మీ దేశంలో మేం దాచుకున్న 750 బిలియన్ డాలర్ల డిపాజిట్ విత్‌డ్రా చేస్తాం జాగ్రత్త' అని సౌదీ బెదిరించింది. ఎందుకంటే బిల్లు అధ్యక్షుడి ఆమోదం పొందితే కోర్టులు ఆ డిపాజిట్లను ఫ్రీజ్ చేసేయవచ్చు. 1980లలో లెబనాన్‌లో, 1996లో సౌదీలో జరిగిన దాడుల్లో ఇరాన్ హస్తం వుందని నిర్ణయిస్తూ అమెరికా సుప్రీం కోర్టు ఇరాన్‌కు చందిన 2 బిలియన్ డాలర్ల ఆస్తులను స్తంభింపచేసింది. అదే గతి తమకూ పడుతుందని సౌదీ భయం. ఈ నేపథ్యంలో మార్చి నెలలో ఒబామా సౌదీ రాజధాని రియాద్‌కు వచ్చినపుడు సౌదీ రాజు ఎయిర్‌పోర్టుకి వచ్చి అతన్ని రిసీవ్ చేసుకోలేదు. ఒబామా రాకను ప్రభుత్వ టీవీ కవర్ చేయలేదు. సౌదీ రాజు ఒబామాతో దీని గురించి మాట్లాడితే వీటో చేసే నా హక్కును ఉపయోగించి, దాన్ని అమలు కాకుండా చేస్తానని హామీ యిచ్చాడు. మే నెలలో సెనేట్ బిల్లు పాస్ చేసేసింది. అధ్యక్షుడు ఏం చేస్తాడో చూడాలి.
సౌదీ తమమీద అలుగుతోందని తెలిసిన అమెరికా యెమెన్‌పై యుద్ధంలో దానికి పూర్తి మద్దతు ప్రకటించడమే కాక ఆయుధాలు కూడా భారీ ఎత్తున అమ్ముతోంది. ప్రపంచంలో ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలలో సౌదీది మూడో స్థానం. కానీ దానిలో 2% మాత్రమే దేశీయంగా ఉత్పత్తి చేసుకుంటుంది. తక్కిన దానిలో చాలా భాగం అమెరికా నుంచే కొనుగోలు చేస్తోంది. 2030 నాటికి తన అవసరాల్లో 50% తనే తయారు చేసుకోవాలనే పట్టుదలతో వుంది. అప్పుడు ఆయుధాల కోసం అమెరికాపై ఆధారపడే అవస్థ తప్పిపోతుంది. ఈ లక్ష్యాన్ని సాధించి తీరతానని యువరాజు అంటున్నాడు. సౌదీ ఆర్థిక వ్యవస్థ ఆయిలుపై ఆధారపడే పరిస్థితిని నాలుగేళ్లలో మార్చేస్తానంటున్నాడు. తక్కిన వాళ్లకు అంత ఆశలు లేవు. ప్రపంచ బ్యాంకు సౌదీ యువతలో 30% నిరుద్యోగం వుందంటోంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గత ఏడాది నివేదికలో సౌదీ ఖర్చులు, తగ్గిపోతున్న రాబడి చూస్తూంటే 2020 నాటికి దివాలా తీస్తుందని చెప్పింది. సౌదీ యువతలో కొందరు నిరాశతో సిరియాకు వెళ్లి ఐసిస్‌లో చేరుతున్నారు. రాజకుటుంబం వారి ఖర్చులు తగ్గించే సత్తా యువరాజుకి ఎంత వుందో తెలియదు. అందువలన యీ సంస్కరణలు ఎటు దారి తీస్తాయో కాలమే చెప్పాలి.
- ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2016)