'తలాక్.. తలాక్.. తలాక్..' అనేస్తే, ఇస్లాం మతానికి సంబంధించి షరియా చట్టాల ద్వారా భార్యా భర్తల మధ్య విడాకులు అయిపోయినట్లే. భర్త మూడుసార్లు 'తలాక్' అనడమంటే, ఇక ఆ వ్యక్తి, తన భార్యతో సంబంధం తెగ్గొట్టుకున్నట్లే లెక్క. మామూలుగా అయితే, విడాకుల కోసం భార్యాభర్తలు కోర్టును ఆశ్రయించాలి, ఆ తర్వాత కోర్టు కొంత సమయం ఇస్తుంది, 'రీ-యూనియన్' కోసం. ఈలోగా మనస్పర్ధలు తొలగిపోతాయన్నది కోర్టు భావన. అప్పటికీ భార్యాభర్తల మధ్య వివాదాలు సద్దుమణగకపోతే, విడాకులు మంజూరవుతాయి. ఇదీ విడాకుల చట్టం తీరు. ఇంత ప్రసహనం ఇస్లాంలో అవసరం లేదు, సింపుల్‌గా 'తలాక్' అని మూడుసార్లు చెప్పేస్తే సరి.
ఇండియన్ పీనల్ కోడ్ దేశంలో అందరికీ ఒకేలా వుండాలి కదా.? అంటే, దాంతో తమకు పనిలేదంటూ ముస్లిం మత పెద్దలు రచ్చకెక్కారు. తమ మత విశ్వాసాల్ని దెబ్బతీయడం తగదంటున్నారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు, కేంద్రం 'తలాక్' వివాదంపై తన వైఖరిని స్పష్టం చేసింది. 'తలాక్' వివాదానికి తాము వ్యతిరేకమని కేంద్రం, సుప్రీంకోర్టుకి తేల్చి చెప్పాక, ముస్లిం పర్సనల్ లా బోర్డ్, కేంద్రం వైఖరిపై భగ్గుమంది.
అయితే, 'తలాక్' తీరుపై ముస్లిం మహిళల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విడాకుల విషయంలో తమ ఇష్టాయిష్టాలతో సంబందం లేకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'తలాక్' వివాదాన్ని రూపుమాపాలనే ముస్లిం మహిళలు ముక్త కంఠంతో కోరుతున్నా, వారి మాట ఇప్పుడు చెల్లుబాటయ్యే పరిస్థితి లేదు. భార్యకు విడాకులు ఇవ్వకుండా ఇంకో మహిళను పెళ్ళాడితే అది మామూలుగా అయితే అది పెద్ద నేరమే. ఇది కూడా ఇస్లాంకి వర్తించదు.
'తలాక్'కి శుభం కార్డు వేసేస్తే, ఆ తర్వాత 'మల్టిపుల్ మ్యారేజెస్' విషయంలోనూ సమస్యలొస్తాయని ముస్లిం మతపెద్దలు గుస్సా అవుతున్నారు. దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాల గురించి కొత్తగా చెప్పేదేముంది.? ముస్లిం మహిళలకు న్యాయం జరుగుతుందని తెలిసినాసరే, 'ముస్లింల సెంటిమెంట్లను దెబ్బతీస్తున్నారు..' అనే కోణంలో వివాదాన్ని పక్కదారి పట్టించడానికి విపక్షాలు సమాయత్తమవుతున్నాయి.
అతి త్వరలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న దరిమిలా, ఇప్పుడీ 'తలాక్' వ్యవహారం, ప్రధాని నరేంద్రమోడీ మెడకి.. మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మెడకి గట్టిగానే చుట్టుకునేలా కన్పిస్తోంది.