రాహుల్‌లో ఎవ్వరూ లేరు...ప్రియాంకలో..?

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోదరి ప్రియాంక ఎట్టకేలకు పూర్తిస్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు. దీంతో కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు. ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నారు. పార్టీకి ఆశాజ్యోతి దొరికిందని మురిసిపోతున్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ విజయం సాధిస్తుందా? లేదా? అనేదాని కంటే ప్రియాంక గాంధీ పార్టీకి రక్షకురాలిగా వచ్చారనే భావనే వారిని ఎక్కువగా ఆనందపెడుతోంది. ఆమె పార్టీ సారథ్య బాధ్యతలు చేపడితే కాంగ్రెసుకు స్వర్ణయుగం వస్తుందని నాయకులు నమ్ముతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే వారు ప్రియాంకలో 'ఇందిరా గాంధీ'ని చూసుకుంటున్నారు. ఆమె ఇందిర అంతటి గొప్ప నాయకురాలు అవుతారా? కారా? అనేది ఇప్పుడు అంచనా వేయడం కష్టం. అది కాలక్రమంలో తేలుతుంది. కాంగ్రెసు నాయకులు ఇప్పుడు ఆమెను ఇందిరలా ఎందుకు భావిస్తున్నారంటే ఆమెలో నాయనమ్మ పోలికలు ఉన్నాయి కాబట్టి. అచ్చు గుద్దినట్లు నాయనమ్మలా లేకపోయినా చూడగానే ఆమెలా అనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

     రాహుల్‌ గాంధీలో జవహర్‌లాల్‌ నెహ్రూనో, రాజీవ్‌ గాంధీనో చూసుకోవడంలేదు. రూపంలోగాని, పనితీరులోగాని, వ్యవహారశైలిలోగాని నాయకులకు రాజీవ్‌ కనబడటంలేదు. కాని ప్రియాంకలో ఇందిరను చూసుకుంటూ అంతటి నాయకురాలవుతుందని భావిస్తున్నారు. ఆమె పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రావడం ఇతర పార్టీలకు కూడా కాసింత కలవరం కలిగిస్తుండొచ్చు. కాంగ్రెసును బలోపేతం చేసే సామర్థ్యం, ప్రజలను ఆకట్టుకునే సామర్థ్యం ఉన్నాయని నమ్ముతుండొచ్చు. ఇక బీజేపీ నాయకుడు వినయ్‌ కటియార్‌ ప్రియాంకను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయన లేకితనానికి నిదర్శనం. ప్రియాంక పెద్ద అందగత్తేమీ కాదని, ఆమె కంటే తమ పార్టీలో స్మృతి ఇరానీ పెద్ద అందగత్తెని వ్యాఖ్యానించడం చూస్తుంటే పైత్యం తలకెక్కిందని అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకున్న బీజేపీలో మోదీ అధికారంలోకి వచ్చాక పిచ్చి మాటలు మాట్లాడేవారు ఎక్కువయ్యారు. వినయ్‌ కటియార్‌కు రాజకీయాలంటే అందాల పోటీలా కనబడుతున్నాయా? కటియార్‌ అభిప్రాయం ఎలాంటిదైనా ప్రియాంక గాంధీ అందగత్తె అనేది వాస్తవం. గాంధీ-నెహ్రూ కుటుంబం రాజకీయాలు, పరిపాలన మొదలైనవి ఎలా ఉన్నా జవహర్‌లాల్‌  దగ్గర్నుంచి ప్రియాంక వరకు అందరూ అందగాళ్లే. 

      ప్రియాంక గ్లామర్‌ బీజేపీని దెబ్బకొడుతుందని వినయ్‌ కటియార్‌ భయపడుతున్నాడేమో తెలియదు. మన దేశంలో రాజకీయ పార్టీల సిద్ధాంతాలను, విధానాలను ఎవ్వరూ పట్టించుకోరు. ప్రజలకు సిద్ధాంతాలు అక్కర్లేదు. అవి ప్రజలపై ప్రభావం చూపించలేవు. అక్కడక్కడా కొన్ని మినహాయింపులు ఉంటే ఉండొచ్చేమోగాని మన రాజకీయాల్లో వ్యక్తుల (నాయకుల) ప్రభావమే ఎక్కువ. నాయకుల ఛరిస్మాతో అధికారంలోకి వచ్చిన పార్టీలు అనేకమున్నాయి. ఇందుకు టీడీపీ వ్యవస్ధాపకుడు  ఎన్‌టి రామారావును ఉదాహరణగా చెప్పకోవచ్చు. కాంగ్రెసు పార్టీ దేశాన్ని సుదీర్ఘ కాలం పరిపాలించడానికి కారణం జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల వ్యక్తిగత ఛరిస్మాయే కారణం. ఏదైనా పార్టీ బలహీనపడితే దానికి జవజీవాలు నింపడానికి ప్రజల్లో ఆకర్షణ ఎక్కువగా ఉన్న నాయకులను ముందుకు తీసుకువస్తుంటారు. కాంగ్రెసు కూడా ప్రియాంకను అందుకే తీసుకొచ్చింది.

     రాహుల్‌ 'విఫల నాయకుడు' అనే అభిప్రాయం ఏర్పడటం, సోనియా గాంధీ ఆరోగ్యం దెబ్బ తినడంతో ప్రియాంక పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రాక తప్పలేదు. కాంగ్రెసు సముద్రాన్ని ఈదడం రాహుల్‌ ఒక్కడివల్ల కాదని సోనియాకూ తెలుసు.   యుద్ధంలో ప్రియాంకను ముందు వరుసలో నిలపడం తప్ప మరో మార్గం లేదు. యూపీ ఎన్నికల మాదిరిగా మరే రాష్ట్రం ఎన్నికలు దేశ రాజకీయాలను ప్రభావితం చేయలేవనే విషయమూ తెలిసిందే. 2019 సాధారణ ఎన్నికల్లో ఢిల్లీలో పాగా వేసేది ఏ పార్టీయో లేదా కూటమో నిర్ణయించేంది యూపీ ఎన్నికలే. రాహుల్‌ గాంధీ గతంలో కంటే మెరుగుపడినప్పటికీ ప్రియాంక గాంధీ 'గ్లామర్‌' పార్టీ విజయావకాశాలను మెరుగుపరుస్తుందని కాంగ్రెసు నేతలు భావిస్తున్నారు. కాంగ్రెసు పార్టీకి ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్‌ కిషోర్‌ కూడా ప్రియాంక క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. ఆమె రాజకీయాల్లోకి వస్తే పార్టీకి ప్రయోజనం కలుగుతుందని సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ కూడా అన్నారు. ఉత్తర భారతంలోని గ్రామీణ ప్రాంతాల కాంగ్రెసు కార్యకర్తలు సైతం ప్రియాంకను తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు. పార్టీకి ప్రియాంక, రాహుల్‌ ఇద్దరూ అవసరం. ఈ రెండు అవసరాలను సమన్వయం చేయడమే కాంగ్రెసు వ్యూహం.  

-నాగ్‌ మేడేపల్లి 

Show comments