ఏపీ ఆర్థిక శక్తి ఎంతా?

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా బలంగా ఉందా? దాని మనీ పవర్‌ ఎంత? ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన మూడేళ్ల తరువాత కూడా ఇంకా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూనే ఉందా? లేక దండిగా నిధులున్నాయా? నిజానికి ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు లేవు. ఏపీ ఆర్థిక పరిస్థితికి సంబంధించి టీడీపీ సర్కారు ఇప్పటివరకు నిర్దిష్టమైన సమాచారం ఇచ్చిన దాఖలాలు లేవు.

ఆర్థిక పరిస్థితి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ విధంగా మాట్లాడితే, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మరో రకంగా మాట్లాడతారు. అధికారులు ఇంకో విధంగా చెబుతారు. ఎక్కడా పొంతన ఉండదు. ఒక అంశంపై రెండు మూడు రకాలుగా మాట్లాడే అలవాటున్న చంద్రబాబు నాయుడు ఆర్థిక పరిస్థితి విషయంలోనూ అదే విధంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. కట్టుబట్టలతో వచ్చాం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని ఒకసారి అంటారు.

రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోందని, రాష్ట్రం వృద్ధిరేటు జాతీయ స్థాయితో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందని చెబుతారు. రాజధాని నిర్మాణానికి నిధుల కొరత లేదని, ఎంతైనా ఖర్చు చేస్తామని తాజాగా చెప్పారు. కాని కేంద్రం నుంచి అనుకున్న నిధులు రావడంలేదు. అసలు విభజననాటి రెవెన్యూ లోటునే కేంద్రం ఇప్పటివరకు పూడ్చలేదు. మరోపక్క ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో సహా పలు దేశాల ఆర్థిక సంస్థల నుంచి ఇబ్బడిముబ్బడిగా రుణాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తోంది.

కొంతకాలం క్రితం ఓ  ప్రముఖ ఆంగ్ల పత్రిక  ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేయందే రోజు గడిచే పరిస్థితి లేదని రాసింది. దానికి తగ్గట్లుగానే తాజాగా చంద్రబాబు అమరావతి నిర్మాణం కోసం ఎక్కడెక్కడి నుంచి రుణాలు, ఎంతెంత తీసుకోబోతున్నారో వివరించారు. అప్పులు చేస్తున్నారు కాబట్టి రాజధాని నిర్మాణానికి నిధుల కొరత లేదంటున్నారు.

కాని స్వతహాగా నిధులు కూడగట్టుకోవడం కష్టమే. అద్భుత రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చిన మోదీ సర్కారు నామమాత్రపు సహాయంతో చేతులు ఎత్తేసింది. ఇక చంద్రబాబు సర్కారుకు ఎంత అప్పు కావాలంటే అంత ఇచ్చేందుకు ప్రపంచ కాబూలీవాలా ప్రపంచ బ్యాంకు ఉండనే ఉంది. 

బాబు సర్కారు ఒక్క ప్రపంచ బ్యాంకు నుంచే కాదు, జపాన్‌, చైనా, మరో రెండు మూడు విదేశీ ఆర్థిక సంస్థల నుంచి కూడా భారీ ఎత్తున రుణాలు తీసుకోవడానికి ప్లాన్‌ చేసింది. ఇవేవీ ఉదారంగా రుణాలివ్వవు. అనేక షరతులు పెడతాయి. ఈ విషయంలో ప్రపంచ బ్యాంకు మరింత కర్కశంగా వ్యవహరిస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వం అంగీకరిస్తూనే ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రానికి బాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకుతో అంటకాగారు.

అప్పట్లో 'ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు' అని కమ్యూనిస్టు పార్టీలు ప్రచారం చేశాయి. పుస్తకాలూ ప్రచురించాయి. ఏపీ ప్రభుత్వం అభివృద్ధిపై పాజిటివ్‌గా ప్రచారం చేస్తోందనుకోవాలి. ప్రత్యేక హోదాపై చంద్రబాబు రాజీపడిపోయారు. హోదా లేకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. దాన్ని ఎస్టాబ్లిష్‌ చేయడం కోసం అప్పుడప్పుడు రకరకాల గణాంకాలు చెబుతున్నారా? కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనంతకాలం దానిపై బాబు రకరకాలుగా మాట్లాడారు.

ఒక దశలో ఏం మూట్లాడుతున్నారో ఆయనకే తెలియని పరిస్థితి ఏర్పడింది. హోదా కోసం ప్రతిపక్షాలు ఉద్యమించేసరికి ప్రజావ్యతిరేకత వస్తుందనే భయంతో ప్రత్యేక హోదా సంజీవిని అన్నారు. అంటే అది లేకుండా బతకలేమనే కదా అర్థం. రక్తం మరుగుతోందన్నారు. దీంతో హోదాపై తాడోపేడో తేల్చుకుంటారని జనం అనుకున్నారు.

కాని చివరకు ప్రత్యేక సాయానికి అంగీకరించి మళ్లీ హోదాను ఎద్దేవా చేయడం ప్రారంభించారు. అభివృద్ధి మాత్రం బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే ప్రచారం విదేశాలకు వెళ్లినప్పుడూ కొనసాగిస్తున్నారు. గతంలో చైనాకు వెళ్లినప్పుడు ఏపీ అభివృద్ధి గురించి చైనీయులకు ఊదరగొట్టేశారు. ఆయన చెప్పిందాంట్లో ఎంత వాస్తవముందో తెలియదు. ఇండియా సగటు వృద్ధి రేటు 7.6 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి రేటు 10.99 శాతం ఉందన్నారు.

అంటే 1శాతమని చెప్పుకోవచ్చు. ఇంత అభివృద్ధి రేటు ఉండటం వాస్తవమేనా? లేక చైనీయులను ఆకట్టుకునేందుకు ఇలా చెప్పారా? త్వరలో 15శాతం అభివృద్ధి సాధిస్తామని వారితో చెప్పారు.  వ్యాపార రంగంలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని, ఎఫ్‌డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)ల్లో మూడో స్థానంలో ఉందని చెప్పారు.

ఇండియాలో తమది ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నామని చంద్రబాబు అక్కడి కమ్యూనిస్టు పార్టీ నాయకులకు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాష్ట్రం 12.6 శాతం వృద్ధి రేటు సాధించిందని, జాతీయ వృద్ధి రేటు 7.1 శాతమేనని చెప్పారు. వ్యవసాయ రంగంలో 22.7 శాతం వృద్ధి సాధించామన్నారు. 2018 వరకల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామంటున్నారు. కాని నిపుణులు అది అసాధ్యమని తెలియదు.

Show comments