ఒక చేతిలో అధికారం...మరో చేతిలో మీడియా..!

    గులాబీ దళాధిపతి ఎవరో తెలుసు కదా. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఆయన ప్రజలకు ఏం చెప్పారో ఆ పని కచ్చితంగా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోపే తాను అనుకున్నది సాధిస్తున్నారు. పట్టుబట్టి లక్ష్యం నెరవేర్చుకుంటున్నారు. ఏమిటి...కేసీఆర్‌ను ఇంతలా పొగుడుతున్నారని అనుకుంటున్నారా? నిజానికి ఇది పొగడ్త కాదు. ఆయన చెప్పిన పని ఎంత పట్టుదలగా చేశారో చెప్పడమే ఉద్దేశం. ఆయన చేసిన ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించింది కాదు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడం కాదు. ఆయన చేస్తున్న పని స్వప్రయోజనాలకు సంబంధించింది. తన పాపులారిటీని పెంచుకోవడానికి చేస్తున్న కృషి. ఇంతకీ ఏమిటి ఆయన స్వప్రయోజనం? రాజకీయ నాయకులు స్వప్రయోజనం కోసం, ప్రచారం కోసం చేసే అతి పెద్ద పని సొంత మీడియాను పెట్టుకోవడం. అంటే పత్రిక, టెలివిజన్‌ ఛానెల్‌ పెట్టుకోవడమన్నమాట. శక్తి సామర్థ్యాలున్న నాయకులు రెండూ పెడుతున్నారు. అవి తక్కువున్నవారు పత్రికో, ఛానెలో పెట్టుకుంటున్నారు. 

    దీనివల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి ప్రత్యుర్థుల మీద విమర్శలు చేయడానికి, బురద చల్లడానికి. రెండు వ్యాపారం చేసుకోవడానికి. అధికార పార్టీ చేతుల్లో ఉన్న మీడియాకు ఈ రెండు పనులు చాలా సులభం. కేసీఆర్‌కు ఏం తక్కువ? అర్థ బలం, అంగ బలం పుష్కలంగా ఉన్నాయి. బలమైన పార్టీ ఉంది. అధికారముంది. ఆయన ఉద్యమ నాయకుడిగానే నమస్తే తెలంగాణ దినపత్రిక, టీ-న్యూస్‌ ఛానెల్‌ ప్రారంభించారు. 2011లో ఈ రెండు ప్రారంభమయ్యాయి. ముందుగా ఛానెల్‌, రెండు మూడు నెలల తేడాలో పత్రిక వచ్చాయి. నమస్తే తెలంగాణ ప్రారంభించినప్పుడే ఇంగ్లీష్‌, ఉర్దూలోనూ దినపత్రికలు ప్రారంభిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. కాని వెంటనే తేలేకపోయారు. ఒక దశలో ఈ రెండు పత్రికలు ఇక రావేమోనని మీడియా వర్గాలు భావించాయి. కాని ఎట్టకేలకు కొన్ని రోజుల క్రితం 'తెలంగాణ టుడే' పేరుతో ఇంగ్లీష్‌ పత్రిక ప్రారంభమైంది.  నమస్తే తెలంగాణ ప్రచురిస్తున్న తెలంగాణ పబ్లికేషన్స్‌ నుంచే తెలంగాణ టుడే ప్రచురిస్తున్నారు. తెలుగు పత్రిక పబ్లిష్‌ అవుతున్న నగరాల నుంచే దీన్ని పబ్లిష్‌ చేస్తున్నారు.

తెలంగాణ టుడే బయటకు రావడానికి చాలా సమయం తీసుకుంది.  ఈ పత్రిక ఎప్పుడెప్పుడు బయటకొస్తుందా అని చాలామంది జర్నలిస్టులు ఎదురు చూశారు. 2016లో రాకపోవచ్చని కూడా అనుకున్నారు.     కాని ఏడాది ముగిసిపోతున్న దశలో పత్రిక జనం మధ్యకు వచ్చింది. ముందు ముందు టీఆర్‌ఎస్‌ జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించే అవకాశముందని, అందుకే పార్టీ గురించి, తన పరిపాలన గురించి జాతీయ స్థాయిలో తెలియచేయాల్సిన అవసరముందని కేసీఆర్‌ అభిప్రాయం. ఇతర రాష్ట్రాలవారికి, దేశ రాజధాని ఢిల్లీలోని ప్రజలకు, అక్కడి వివిధ పార్టీల నాయకులకు గులాబీ పార్టీ, తెలంగాణ సర్కారు గురించి తెలియాలంటే ఇంగ్లిష్‌ పత్రిక ఒక్కటే మార్గం. రాష్ట్రంలో 'నమస్తే తెలంగాణ' బాగా క్లిక్‌ అయింది. తెలంగాణ సెంటిమెంట్‌, ఆంధ్రా వ్యతిరేకత కలగలిసిన ఆ పత్రికను ప్రజలు బాగా ఆదరించారు.  కేసీఆర్‌ లక్ష్య సాధనలో మిగిలిపోయిన ఉర్దూ పత్రిక  త్వరలోనే బయటకు రాబోతున్నట్లు సమాచారం. 

ఉప ముఖ్యమంత్రి కమ్‌ రెవిన్యూ మంత్రి అయిన మహమూద్‌ అలీ కుమారుడు ఆజం అలీ ఆధ్వర్యంలో 'ఆదాబ్‌ తెలంగాణ' పేరుతో ఉర్దూ పత్రిక వస్తుందట...! హైదరాబాదులో ఓవైసీ సోదరులకు  సొంత ఉర్దూ పత్రిక ఉంది. దాన్నుంచి ఓ సీనియర్‌ జర్నలిస్టును లాక్కుంటున్నారు. ఆయనకు ఎడిటర్‌గా బాధ్యతలు అప్పగిస్తారేమో. పాత బస్తీలో టీఆర్‌ఎస్‌ తమను టార్గెట్‌ చేయడానికే ఈ పత్రిక పెడుతోందని ఓవైసీ సోదరులు అనుమానిస్తున్నారట.   హైదరాబాదుతో పాటు తెలంగాణ జిల్లాల్లో ఉర్దూ దినపత్రికలు చదివేవారి సంఖ్య (ముస్లిములే కాకుండా హిందువులు కూడా) ఎక్కువగా ఉందని, కాబట్టి వారి కోసం ఉర్దూ పత్రిక కూడా ప్రారంభిస్తే బాగుంటుందని కేసీఆర్‌ అనుకున్నారని టీఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు. నమస్తే తెలంగాణకు  ప్రభుత్వ ప్రకటనలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. అలాగే ప్రయివేటు ప్రకటనలకు కొదవలేదు. యాడ్స్‌ ఇవ్వకపోతే ఏం తిప్పలొస్తాయో, ఏం కొంపలు మునుగుతాయోనని కంపెనీల వారు విపరీతంగా యాడ్స్‌ ఇస్తున్నారు. ఇంగ్లీష్‌, ఉర్దూ పత్రికలకూ యాడ్స్‌ కొరత ఉండకపోవచ్చు. మొత్తం మీద కేసీఆర్‌ ఒక పార్టీకి అధినేత, ముఖ్యమంత్రే కాకుండా పెద్ద మీడియా హౌస్‌ అధిపతి కూడా. అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా అధికారానికి మీడియా తోడైంది.  Readmore!

 -మేనా                                                                              

Show comments