అది తప్పేమీ కాదు... ఒప్పుకోవాల్సిందే...!

ఏ విషయమైనా సరే మనం తప్పనుకుంటే తప్పు...ఒప్పనుకుంటే ఒప్పు. 'అనుకున్నామని జరగవు అన్నీ...అనుకోలేదని ఆగవు కొన్ని...జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని'...అని ఆచార్య ఆత్రేయ అన్నారు. ఇది మనిషి వ్యక్తిగత జీవితానికే కాకుండా సామాజిక, రాజకీయ రంగాలకూ వర్తిస్తుందేమో...! వేగంగా మారుతున్న సమాజంలో అన్ని రంగాలూ మారుతున్నాయి. ప్రధానంగా రాజకీయ రంగంలో విలువలు దిగజారిపోయాయి. ప్రజాస్వామ్య దేశంలో డెమోక్రసీ 'నేతి బీరకాయలో నెయ్యి' మాదిరిగా తయారైంది. 

పాత కాలపు ఫ్యాషన్లే మళ్లీ ఇప్పుడు కొత్త ఫ్యాషన్లుగా మారినట్లుగా ఫ్యూడల్‌ వ్యవస్థలో, రాచరిక వ్యవస్థలో ఉన్న లక్షణాలన్నీ ఆధునిక ప్రజాస్వామ్యంలోనూ కనబడుతున్నాయి. నిజమైన ప్రజాస్వామ్యవాదులు మళ్లీ తిరిగొచ్చిన రాచరిక, ఫ్యూడల్‌ పోకడలను నిరసిస్తున్నారు. కాని ప్రజాస్వామ్య వేదం వల్లించే ఆధునిక రాజకీయ నాయకులు ఫ్యూడల్‌, రాచరిక పోకడలను సమర్ధిస్తున్నారు. ఈ పోకడల్లో వంశపారంపర్య రాజకీయాలు, వారసుల పరిపాలన మొదలైనవి ప్రధానం. ఒక పార్టీని, ప్రభుత్వాన్ని వంశపారంపర్యంగా గుప్పిట్లో పెట్టుకోవడం, పరిపాలించడం ప్రజాస్వామిక లక్షణం కాదు.

కుటుంబ రాజకీయాలు డెమోక్రీసీకి విరుద్ధం. కాని ఇది తప్పుకాదని, ఇదొక వాస్తవం కాబట్టి దాన్ని నిరసించకుండా ఒప్పుకొని తీరాల్సిందేనని అంటున్నారు కొందరు నాయకులు. ఇలా అంటున్నవారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె కమ్‌ నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ఉన్నారు. బతుకమ్మ పండుగ పేటెంట్‌ హక్కులను సొంతం చేసుకున్న కవిత తండ్రి , అన్నయ్య, బావ మాదిరిగానే చాలా తెలివిగా మాట్లాడగల సామర్థ్యమున్న నాయకురాలు. మోకాలికి బోడిగుండకు ముడిపెట్టగల చాకచక్యముంది. 'వంశపారంపర్య రాజకీయాలు తప్పు కాదు' అనేది కవిత అభిప్రాయం. 

తెలంగాణను కేసీఆర్‌ కుటుంబమే (కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు, కవిత) పరిపాలిస్తోందనే విమర్శ ఏనాటినుంచో ఉంది. ఇందులో అవాస్తవం లేదు. అమెరికాలో ఉంటున్న కేటీఆర్‌, కవిత తమ తండ్రి తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తరువాత రాజకీయంగా మంచి అవకాశాలున్నాయని భావించి స్వరాష్ట్రానికి వచ్చారనడంలో అతిశయోక్తి లేదు. కేసీఆర్‌ రమ్మన్నారో, వారంతటవారే వచ్చారో తెలియదు. మొత్తం మీద ఏదో బావుకోవాలనే వచ్చారు. సరే...తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచారు. కేటీఆర్‌ మంత్రి అయ్యాడు. కవిత ఎంపీ అయింది. ఇద్దరూ విపరీతమైన తెలివితేటలున్నవారు కాబట్టి బాగానే రాణిస్తున్నారు. 

కాని వారి రక్తంలో ఉన్న 'దొరతనం' ఎటు పోతుంది? అందుకే వంశపారంపర్య రాజకీయాలను, పాలనను కవిత సమర్థించింది. ఇప్పుడిది వాస్తవమని, దీన్నుంచి దూరంగా పోవడమో, కాదనడమో చేయడం సాధ్యం కాదని ఆమె ఒపీనియన్‌. కుటుంబ పరిపాలన, వంశపారంపర్య రాజకీయాలు ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాల్లో నడుస్తున్నాయన్నారు. ఏఏ రాష్ట్రాల్లో కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయో వివరించారు.  ఎన్నికల్లో తమకు ప్రజల ఆమోదం లభించిందని, ప్రజలు ఎన్నుకున్నందువల్లనే తాము రాజకీయాల్లో కొనసాగుతున్నామన్నారు. 

రాజకీయాల్లో ఉండేందుకు తమ కుటుంబ సభ్యులకు అన్ని అర్హతలున్నాయని కవిత చెప్పారు. ఒకప్పుడు సినిమాల్లో, రాజకీయాల్లో వారసులు చాలా తక్కువగా ఉండేవారు. కాని ఇప్పుడు ఈ రెండు రంగాలను వారసులే ఏలుతున్నారు. వారసుల కారణంగా అర్హతలు, ప్రతిభ ఉన్నవారూ కనుమరుగవుతున్నారు. కొన్ని సందర్భాల్లో తొక్కిపడేస్తున్నారు. సినిమాల విషయం అలా పక్కకు పెడితే రాజకీయాల్లో వారసులు రెండు రకాలుగా ఉన్నారు. కొన్ని రాజకీయ కుటుంబాల్లో గత్యంతరం లేని పరిస్థితిలో (రాజకీయాల్లో ఉన్న తండ్రి, తల్లి లేదా భర్త చనిపోవడమో, అనారోగ్యం పాలవడమో) తప్పనిసరై కుమారులో, కుమార్తెలో, భార్యలో పాలిటిక్స్‌లోకి వస్తున్నారు. 

రాజకీయ పట్టు పోకుండా ఉండేందుకు కొందరు నాయకులు  వారసులను పనిగట్టుకొని తీసుకువస్తున్నారు. వారసులకు మంత్రి పదవులు, పార్టీ పదవులు ఇవ్వాలని పార్టీ నాయకులే డిమాండ్‌ చేస్తున్నారు. వారసులే భావి ముఖ్యమంత్రులని ప్రచారం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌, చంద్రబాబు కుమారుడు లోకేష్‌ కనబడుతున్నారు. జాతీయ స్థాయిలో రాహుల్‌ గాంధీని చూస్తున్నాం. కాబట్టి  వారసత్వ లేదా వంశపారంపర్య రాజకీయాలను ఎవ్వరూ తప్పుగా భావించడంలేదు.  'ఇంతేరా ఈ జీవితం తిరగే రంగులరాట్నం' అన్నట్లుగా ఒకప్పుడు తప్పుగా భావించినవే ఇప్పుడు ఒప్పవుతున్నాయి. సమాజంలో విలువలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. మనం తప్పన్నా, ఒప్పన్నా ఏదీ ఆగదు. 

Show comments