ఆస్కార్ చరిత్రలోనే మూడో అరుదైన సినిమా!

వడపోతలెన్నో అయ్యాయి.. అంతిమ నిర్ణయానికి చివరి వడపోతలు కొనసాగుతున్నాయి. అండ్ ద ఆస్కార్ గోస్ టు.. అంటూ ప్రకటించే సమయం ఆసన్నమవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా.. ఆస్కార్ నామినేషన్ అనే అరుదైన గౌరవం పొందిన సినిమాల గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ సారి అకాడమీ అవార్డులకు సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి. ఈ విశేషాలన్నింటిలోనూ ప్రముఖంగా చెప్పుకోవాల్సిన అంశం ‘లా లా లాండ్’ సినిమా. అకాడమీ అవార్డుల చరిత్రలోనే అత్యంత అరుదైన సినిమాల్లో ఒకటిగా నిలుస్తోంది ఈ చిత్రం. ఏకంగా పద్నాలుగు విభాగాల్లో ఈ సినిమా నామినేట్ కావడం అత్యంత ఆసక్తికరమైన అంశం.

బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ (చాజెల్), బెస్ట్ యాక్టర్(గోస్లింగ్), బెస్ట్ యాక్ట్రెస్(ఎమ్మా స్టోన్), బెస్ట్ ఒరిజినల్ సాంగ్స్ తదితర విభాగాలతో సహా మొత్తం పద్నాలు కేటగిరీల్లో ఈ సినిమా 89 వ ఆస్కార్స్ కు నామినేట్ అయ్యింది. ఇది వరకూ ఈ స్థాయిలో నామినేషన్స్ సాధించిన చిత్రాలు రెండంటే రెండే ఉన్నాయి. 1950 ఆస్కార్స్ లో ‘ఆల్ అబౌట్ ఈవ్’ సినిమా  ఇన్ని నామినేషన్స్ సాధించింది, ఆ తర్వాత ఎన్నో దశాబ్దాల తర్వాత 1996లో వచ్చిన ‘టైటానిక్’ సినిమా పద్నాలుగు విభాగాల్లో నామినేట్ అయ్యింది. ఆ తర్వాత మరేసినిమా కూడా అకాడమీ అవార్డుల విషయంలో ఇన్ని నామినేషన్లను సాధించలేదు. ఆ అరుదైన ఫీట్ ‘లా లా లాండ్’ కే సాధ్యం అయ్యింది. మరి ఎన్ని ఆస్కార్స్ గెలుస్తుందనేది అత్యంత ఆసక్తికరమైన అంశం.

ఇది వరకూ పద్నాలుగు నామినేషన్స్ పొందిన  ‘ఆల్ అబౌట్ ఈవ్’ సినిమా నాలుగు విభాగాల్లో ఆస్కార్స్ ను సొంతం చేసుకుంది. ‘టాటానిక్’ పదకొండు విభాగాల్లో అవార్డులను అందుకుంది. మరి ‘లా లా లాండ్’ ఎన్ని పొందుతుందనేది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీకి కానీ తెలీదు. అయితే చెప్పుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే.. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో నామినేట్ అయిన ప్రతి విభాగంలోనూ ఈ సినిమా అవార్డులను సొంతం చేసుకుంది. మొత్తం ఏడు అవార్డులను సాధించింది. ఈ జోరు చూస్తుంటే.. ఆస్కార్స్ లో ఈ సినిమా అదరగొట్టే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది.

అయితే ఈ సారి ఈ సినిమాకు పోటీని ఇచ్చే సినిమాలు కూడా దూకుడుతో కనిపిస్తున్నాయి. 2016లో వచ్చిన బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా ‘లా లా లాండ్’ నిలవగా, ఈ రొమాంటిక్ మ్యూజికల్ కామెడీ డ్రామకు పోటీని ఇస్తున్న సినిమాలూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎనిమిది  విభాగాల్లో నామినేషన్ పొందిన సినిమాలు ‘అరైవల్’, ‘మూన్ లైట్’. ఉత్తమ చిత్రం విషయంలో ఇవి ‘లా లా లాండ్’ కు గట్టి పోటీని ఇస్తున్నాయి. వీటిలో ‘అరైవల్’ సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇది గోల్డెన్ గ్లోబ్స్ లో ఇది రెండు అవార్డులను ఒడిసిపట్టింది. బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డులను అందుకుంది ఈ సినిమా. ఆస్కార్స్ లో అయితే ఎనిమిది విభాగాల్లో పోటీ పడుతోంది. మరి ఎన్నింటిని సాధిస్తుందో చూడాల్సి ఉంది.

యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, సబ్జెక్ట్ మ్యాటర్ లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా ‘మూన్ లైట్’. ఈ డ్రామా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది! ఆస్కార్స్ ఉత్తమ సినిమా రేసులో ఉన్న మిగతా సినిమాలను గోల్డెన్ గ్లోబ్ వద్ద ఓడించిన ఈ సినిమా ఆస్కార్స్ లో కూడా సత్తా చాటి.. క్లాసిక్ గా నిలిచిపోతుందేమో చూడాలి. మొత్తం ఎనిమిది విభాగాల్లో పోటీలో ఉంది ‘మూన్ లైట్’.

భారతీయ మూలాలున్న కథాంశంతో రూపొందిన ‘లయన్’ సినిమా మొత్తం ఆరు విభాగాల్లో పోటీ ఉంది. ఉత్తమ చిత్రంతో సహా ఆరు నామినేషన్లను సాధించింది ఈ ఆస్ట్రేలియన్ డ్రామా. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. భారతీయ మూలాలున్న నటుడు దేవ్ పటేల్ ఈ సినిమాకు గానూ ఉత్తమ సహాయ నటుడి కేటగిరిలో ఆస్కార్ అవార్డుల రేసులో నిలిచాడు. బెస్ట్ పిక్చర్, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (దేవ్ పటేల్), బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ (కిడ్ మన్)లు అవార్డుల రేసులో ఉన్నారు.

ఆరు విభాగాల్లో నామినేషన్లు సాధించిన మరో రెండు సినిమాలు ‘మాంచెస్టర్ బై ద సీ’, ‘హాక్సారిడ్జ్’. వీటిల్లో ‘మాంచెస్టర్…’ డ్రామా, ‘హాక్సారిడ్జ్’ బయోగ్రాఫికల్ వార్ డ్రామా ఫిల్మ్. కీలకమైన ఉత్తమ చిత్రం విభాగంలో ఈ సినిమాలు తుదికంట పోరాడుతున్నాయి. ఫెన్సెస్, హెల్ ఆర్ హై వాటర్ , హిడెన్ ఫిగర్స్ సినిమాలు ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీలో ఉన్నాయి.

ప్రముఖ నటుడు డేంజెల్ వాషింగ్టన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఫెన్సెస్. ఇది ఉత్తమ చిత్రం పోటీలో ఉంది. ఇందులో నటనకు గానూ వాషింగ్టన్ ఉత్తమ నటుడి అవార్డు రేసులో ఉన్నాడు. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ విభాగంలో డావిస్ ఈ సినిమా తరపు నుంచి పోటీలో ఉంది. గోల్డెన్ గ్లోబ్స్ లో ఈమె  అవార్డును గెలుచుకుంది. వాషింగ్టన్ అక్కడ నామినేషన్ పొందినా అవార్డును సాధించలేకపోయాడు.

క్రైమ్ థ్రిల్లర్ ‘హెల్ ఆర్ హై వాటర్’ సినిమా నాలుగు విభాగాల్లో నామినేషన్స్ ను పొందింది. అమెరికన్ ఫిల్మ్ ఇనిస్టిట్యూషన్ ఎంపిక చేసిన బెస్ట్ టెన్ ఆఫ్ -2016 జాబితాలో ఈ సినిమా స్థానం సంపాదించింది. మరి ఆస్కార్స్ లో  ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాలి. ఉత్తమ చిత్రం తో సహా మూడు విభాగాల్లో పోటీలో ఉంది ‘హిడెన్ ఫిగర్స్’.  గోల్డెన్ గ్లోబ్స్ లో రెండు అవార్డులను గెలుచుకున్న ఈ సినిమా అకాడమీ అవార్డ్స్ లో ఎన్ని గెలుస్తోందో మరి!

ఉత్తమ విదేశీ చిత్రం ఏది?
ఆస్కార్స్ లో మరో ఆసక్తికరమైన విభాగం ఉత్తమ విదేశీ చిత్రం. వన్ అండ్ ఓన్లీ అన్నట్టుగా.. ప్రపంచ సినిమాకు అమెరికన్లు ఇచ్చే ఈ గౌరవం ఆసక్తిదాయకమైనది. ప్రత్యేకించి ఈ ఏడాది ఈ అవార్డుల బరిలో భారతీయ సినిమా కూడా ఒకటి పోటీలో నిలిచింది. అదే ‘విసారణై’ . తమిళనటుడు ధనుష్ నిర్మించిన ఈ క్రైమ్ డ్రామా.. వడపోతలో తిరస్కరణకు గురి అయ్యింది. మిగతా విదేశీ చిత్రాలు ఈ పోటీలో ఉన్నాయి.

ప్రపంచ సినీ ప్రియులను ఆకట్టుకోవడంలో ముందుంటుంది ఇరాన్ సినిమా. ఈ సారి కూడా ఆ దేశం తరపు నుంచి ఇక  సినిమా బెస్ట్ ఫారెన్ పిక్చర్ కేటగిరిలో  రేసులో ఉంది. అదే ‘ది సేల్స్ మ్యాన్’. ఈ ఫ్యామిలీ డ్రామాతో పాటు జర్మన్ సినిమా ‘టోనీ ఎర్డ్ మన్’, డెన్మార్క్ సినిమా ‘ల్యాండ్ ఆఫ్ మైన్’, స్వీడన్ సినిమా ‘ఏ మ్యాన్ కాల్డ్ ఓవ్’ , ఆస్ట్రేలియా సినిమా ‘టన్నా’లు విదేశీ చిత్రం కేటగిరిలో అవార్డుల రేసులో ఉన్నాయి. 

ఆస్కార్ రేసులో నిలవడం వేరు, ఆస్కార్ లో బెస్ట్ పిక్చర్ గా అవార్డును సంపాదించడం వేరు. తేడా స్వల్పమే అయినా.. ప్రేక్షకులకు రీచ్ కావడంలో బోలెడంత.. చెప్పలేనంత వ్యత్యాసం ఉంది. అవార్డును అందుకున్న సినిమా ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులందరినీ ఆకర్షిస్తుంది. అది విడుదలయ్యి, హిట్ టాక్ ను పొందినప్పుడు దక్కే ప్రేక్షకాదరణకు కొన్ని వేల రెట్ల స్థాయి ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఆస్కార్స్ లో ఉత్తమ చిత్రంగా ఏ సినిమా ఎంపికవుతుందా.. దాన్ని వీక్షిద్దాం.. అని అనేక మంది భారతీయ సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మరి అవార్డుతో అందరి వీక్షణనూ పొందే సినిమా ఏదో.. తేలాలంటే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకూ వేచి చూడాల్సిందే!

Show comments