చిరు భవిష్యత్తుపై అప్పుడే ఊహాగానాలా?

సామాజిక మాధ్యమం (సోషల్‌ వెబ్‌సైట్లు) బాగా విస్తరించిన ఈ రోజుల్లో ప్రతి అంశం మీదా రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. అభిప్రాయాల మార్పిడి ఎక్కువగా జరుగుతోంది. సామాజిక మాధ్యమంలో జరిగే చర్చలు, ఊహాగానాలు రాజకీయాలపై బాగా ప్రభావం చూపుతున్నాయి. సామాన్యుల దగ్గర నుంచి నాయకులు, పాలకుల వరకు సామాజిక వెబ్‌సైట్లను ఫాలో అవుతుండటంతో కొన్ని అంశాలు రోజుల తరబడి ప్రజల నోళ్లలో నానుతున్నాయి. ప్రముఖ నాయకుల గురించి లేదా ఇతర రంగాల్లోని సెలబ్రిటీల గురించి సోషల్‌ వెబ్‌సైట్లలో స్పెక్యులేషన్స్‌ వచ్చినప్పుడు అసలు వ్యక్తులు నోరు విప్పితే నిజానిజాలు తెలియవు. 

ప్రస్తుతం మెగాస్టార్‌, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడైన చిరంజీవి రాజకీయ భవిష్యత్తుపై అప్పుడే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వీటి ఆధారంగా టీవీ చర్చల్లోనూ నాయకులు చిరంజీవి విషయం ప్రస్తావిస్తున్నారు. 2012 ఏప్రిల్‌ 3వ తేదీన రాజ్యసభ సభ్యుడైన చిరంజీవి పదవీ కాలం 2018 ఏప్రిల్‌ 2వ తేదీ వరకు ఉంది. అంటే ఇంకా సుమారుగా 17 నెలలు రాజ్యసభ సభ్యుడిగా ఉంటారు. వచ్చే సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు ఆయన పదవి నుంచి దిగిపోతారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజ్యసభ సభ్యుడైన ఆయన రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో పదవి నుంచి దిగిపోతారన్నమాట. 

ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ ఏమిటి? చిరంజీవి టీడీపీలో చేరే అవకాశముందని. ఇందుకు ఆస్కారమిచ్చింది ఆయన కుమారుడు రాంచరణ్‌ డైరెక్టర్‌గా ఉన్న టర్బో మెగా ఎయిర్‌వేస్‌ విమానయాన సంస్థ. ఆ విమానయాన సంస్థకు ఏపీ సర్కారు డబ్బులిచ్చింది కాబట్టి చిరంజీవి 'పచ్చ' పార్టీలో చేరతారని పుకార్లు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం డబ్బు ఎందుకు ఇచ్చింది? ఏపీలో విమానాలు నడుపుతున్న ప్రయివేటు సంస్థలు ఆక్యుపెన్సీ రేషియో (సీట్లు భర్తీ కావడం) అందుకోలేక నష్టపోతే ఆ నష్టాన్ని ప్రభుత్వం చేస్తుంది. విమాయాన సంస్థలను ప్రోత్సహించడానికి బాబు ప్రభుత్వం ఇదో విధానంగా పెట్టుకుంది. 

దీని కింద ఇతర సంస్థలకు డబ్బు ఇచ్చినట్లే రాంచరణ్‌ సంస్థకూ డబ్బు ఇచ్చింది. ఎంత ఇచ్చింది? ఐదు కోట్లు అని, పది కోట్లు అని రెండు రకాలుగా మీడియాలో వచ్చింది. ఎంత ఇచ్చారనేది పక్కన పెడితే 'కోట్ల రూపాయలు' అనే దాంట్లో డౌట్‌ లేదు. ధనికులు మాత్రమే ఉపయోగించే విమానాల కోసం ప్రభుత్వం ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సమంజసమేనా? అనేది వేరే చర్చ. కేవలం రాంచరణ్‌ సంస్థకే ప్రభుత్వం సాయం చేయకపోయినా ఇది 'మెగా ఫ్యామిలీ' కి సంబంధించిన విషయం కావడంతో చర్చనీయాంశమైంది. 

అందుకు తగ్గట్లే చిరంజీవి పదవీ కాలం గడువు దగ్గర పడుతుండటంతో ఆయన్ని తన పార్టీలోకి లాక్కోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి అవునో కాదో చెప్పాల్సింది చిరంజీవే. ఆయన మాట్లాడేందుకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఇప్పుడు నోరిప్పకపోవచ్చు. రాజకీయాల్లో ఆయన మెగాస్టార్‌గా ఎదగలేకపోయినా రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది ఆసక్తికరమే. ఆయన రిటైరైన ఏడాదికే లోక్‌సభ ఎన్నికలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికలూ జరుగుతాయి. అప్పటికి ఆయన తమ్ముడి పార్టీ జనసేన కూడా బరిలో ఉంటుందని అనుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలో చిరు కాంగ్రెసులోనే ఉండి పోటీ చేస్తారా? పార్టీ మారతారా? అసెంబ్లీకి (ఏపీ) పోటీ చేస్తారా? లోక్‌సభకు చేస్తారా? చిరు భవిష్యత్తుకు సంబంధించి ఇలాంటి ప్రశ్నలన్నీ ముందుకొస్తాయి.  కాంగ్రెసు ప్రధాన పార్టీయే అయినప్పటికీ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడేది టీడీపీ, వైకాపా మాత్రమే. 2019 నాటికి వైకాపా మరింత బలపడవచ్చని, తక్కువ అంచనా వేసేందుకు వీల్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  జనసేన ప్రభావం ఎంత ఉంటుందో తెలియడంలేదు. పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ నాయకుడిగా ఇప్పటివరకు అడుగు ముందుకేయలేదు. కాబట్టి బలం ఏమిటనేది ఎన్నికల ముందు తెలియాలి. గత ఎన్నికల్లో కాంగ్రెసుకు శూన్యహస్తం మిగిలింది. ఇందుకు కారణం తెలిసిందే. 

చిరంజీవి రాజ్యసభకు వెళ్లిపోయారు కాబట్టి ఓటమి బాధ తప్పింది. వచ్చే ఎన్నికల్లోనైనా కాంగ్రెసు పరిస్థితి మెరుగు పడుతుందా? అని ప్రశ్నించుకుంటే 'కచ్చితంగా' అనే సమాధానం ఆ పార్టీ నాయకుల నుంచే రావడంలేదు. పార్టీ పరిస్థితి బాగాలేకపోయినా దాన్నుంచే పోటీ చేస్తారా? లేదా రాజ్యసభకు వెళ్లాలనుకంటే అందుకు అవకాశముంటుందా? కాంగ్రెసుకు అసెంబ్లీలో తగిన బలం ఉండాలి కదా...! మొత్తం మీద రిటైర్మెంటు తరువాత చిరంజీవి క్రాస్‌ రోడ్డులో నిల్చుంటారు. 

Show comments