ఎమ్బీయస్‌: చైనా టూరిస్టులు ఉత్తర కొరియాకు ఎందుకెళతారు?

ఉత్తర కొరియాలో దుర్భరమైన నియంతృత్వ పరిస్థితులున్నాయని అందరికీ తెలుసు. టూరిస్టుగా వెళ్లినా ప్రమాదమేమో అనిపిస్తుంది. ధైర్యం చేసి వెళదామన్నా అదేమీ భూతలస్వర్గం కాదు, చౌక ధరల్లో అమరసౌఖ్యాలందించే నందనవనమూ కాదు. ఆ మాట కొస్తే అక్కడ ఆధునిక సౌకర్యాలు బొత్తిగా లేవు. పైగా కఠినమైన రూల్సున్నాయి. చనిపోయిన కిమ్‌ సుంగ్‌ విగ్రహాన్ని ముందు నుంచి తప్ప వెనకనుంచి ఫోటో తీయడానికి వీల్లేదని టూరిస్టులను గైడ్లు హెచ్చరిస్తారు. అలాటి చోటికి చైనా పర్యాటకులు ఎందుకు వెళుతున్నారో ఓ పట్టాన ఎవరికీ అర్థం కాలేదు. అఫ్‌కోర్సు, వాళ్లకు ఉ. కొరియా బాగా దగ్గర. 

సరిహద్దుల్లో వున్న డాన్‌డాంగ్‌ వూరి నుంచి యాలూ నది దాటితే చాలు వెళ్లిపోవచ్చు. వెళ్లడం సులభమే కానీ, అక్కడేముందని వెళ్లాలి? అని అడిగితే 'ఏమీ లేదు కాబట్టే వెళుతున్నాం' అంటున్నారు చైనావారు. 'అక్కడ సెల్‌ఫోన్లు కంప్యూటర్లు వగైరాలు ఏమీ లేవు కాబట్టి ప్రాణానికి సుఖంగా వుంటుంది. మనశ్శాంతి దొరుకుతుంది' అని జవాబిస్తున్నారు. ఉత్తర కొరియాపై మార్చి నుండి ఆర్థికపరమైన ఆంక్షలు పెంచడంతో బొగ్గు, ఖనిజాల ఎగుమతుల ద్వారా సంపాదిస్తున్న విదేశీమారక ద్రవ్యానికి గండి పడింది. దాన్ని టూరిజంతో పూరించుకుందామని ఉ.కొరియా చూస్తోంది. 

జులై నెల నుంచి చైనా దేశస్తులు వీసా-పాస్‌పోర్టులాటివి లేకుండానే ఒక పూట పర్యాటనలు చేయవచ్చని ప్రకటించింది. అంతకంటె ఎక్కువకాలం గడపదలచుకుంటేనే వీసా తీసుకోవాలి. ఇదే అవకాశంగా డజన్ల కొద్దీ చైనీస్‌ టూరిస్టు కంపెనీలు కొరియాకు టూర్లు ఆపరేట్‌ చేస్తున్నారు. చైనా పర్యాటకుల్లో 85% వచ్చే దారిలో వారికి అతి దగ్గరగా సరిహద్దు దాటగానే వచ్చే సిన్యుజు నగరంలో లగ్జరీ హోటళ్లు, స్కీ రిసార్టులు, రెస్టారెంట్లు అవీ నెలకొల్పింది. కానీ అవన్నీ ఖరీదైనవే. అయితే చైనావాళ్లు కొరియాకు వెళుతున్నది ఆ ఫైవ్‌స్టార్‌ సౌఖ్యం కోసం కాదు, ప్లాస్టిక్‌ కవర్లు, చెత్తా చెదారంతో కలుషితం కాని ప్రకృతి కోసం! ఆధునికత, మానవప్రమేయం అంటకుండా ప్రకృతి అందాలు సహజంగానే వుండిపోవడం వాళ్లకు ఆకర్షణగా మారింది. 

''వైఫై లేని లోకాన్ని, కొండలు, జలపాతాలున్న సహజసీమను మా పిల్లలకు, మనుమలకు పరిచయం చేస్తున్నాం. చైనాలో కూడా ఎంతో మార్పు వచ్చేసి పల్లెలు పల్లెల్లా లేవు. గ్రామీణులు కూడా తెలివి మీరి కృత్రిమంగా అయిపోయారు. కొరియా సహజమైన పరిసరాలను, మనుష్యులను చూస్తూంటే మేం బాల్యంలో చూసిన గ్రామీణ చైనా గుర్తుకు వస్తోంది.'' అంటున్నారు వృద్ధులు.  అంతేకాదు, చైనాలో జనాభా పెరుగుతున్న కొద్దీ వారికి ఆహారం అందించడానికి మన దగ్గర లాగానే ఎరువులు వేయడాలు, క్రిమి సంహారక మందులు చల్లడాలు, కృత్రిమ వంగడాలతో ఆహారోత్పత్తి పెంచడాలు జరిగాయి.  Readmore!

వీటివలన కాయగూరలకు రుచి పోయిందని, ఆహారపదార్థాల నాణ్యత తగ్గిందని, రసాయనాల వాడకం చేత అనారోగ్యం కలుగుతోందని చైనీయులు ఆందోళన చెందుతున్నారు. కొరియాలో అలాటి బాధలేవీ లేవు. అంతా సహజంగా పండేవే, మనం ఆర్గానిక్‌ పేరుతో హెచ్చు ధరలు పెట్టి కొంటున్నవి అక్కడ అతి మామూలుగా దొరుకుతున్నాయి. ''బంగాళా దుంపలు, బీన్స్‌ల అసలు రుచి ఎలా వుంటుందో తెలియాలంటే కొరియా వెళ్లాల్సిందే, చైనాలో అలాటి రుచి చాలా అరుదుగా లభిస్తుంది.'' అంటున్నారు చైనా పర్యాటకులు. 

ట్రావెల్‌ ఏజంట్లు కూడా అదే ధోరణిలో యాడ్స్‌ గుప్పిస్తున్నారు. ''ఉత్తర కొరియాలో సముద్రం 100% క్లీన్‌. ఎక్కడా చెత్త కనబడదు.,, రాసన్‌ సిటీ మొత్తం ఆర్గానిక్‌యే!... సిగ్గుపడే మొగ్గల్లాటి పల్లెపడుచులను చూడాలంటే ఉత్తర కొరియాకు రావాల్సిందే..'' అంటూ. మన దేశంలో కూడా నదీతీరంలో లేదా కొండల మధ్య టీవీలు లేని, మొబైల్‌ సిగ్నల్సు రాని, ప్లాస్టిక్‌ వాడని, ఎరువులు వేయకుండా పంటలు పండించే శుభ్రమైన పల్లెటూళ్లను తయారుచేసుకుని టూరిస్టు స్పాట్లగా తీర్చిదిద్దితే సిటీ జనాలు ఏడాదికో సారైనా పరుగెత్తుకు వస్తారనుకుంటా. (ఫోటో - ఉ.కొరియాలో మౌంట్‌ మైయోహ్యాంగ్‌ వద్ద చైనా టూరిస్టులు) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2016)

mbsprasad@gmail.com

Show comments