సెప్టెంబర్ 17.. నిజాం సంస్థానం.. ఒకప్పటి హైద్రాబాద్ స్టేట్.. భారతదేశంలో విలీనమైన రోజు అది. నిజానికి, నిజాం కబంద హస్తాలనుంచి హైద్రాబాద్ స్టేట్‌కి విముక్తి కల్పించిన రోజు అది. దాన్నే, తెలంగాణ విమోచన దినంగా పాటించాలనే డిమాండ్ ఎప్పటినుంచో విన్పిస్తోంది. విమోచనం, విముక్తి, విలీనం, విద్రోహం.. ఇలా రకరకాల పేర్లు పెట్టి, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అనేక పోరాటాలు జరిగాయి. ఆ పోరాటల్లో కీలక భూమిక తెలంగాణ రాష్ట్ర సమితిదే.
'అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలి..' అంటూ టీఆర్‌ఎస్, నల్ల జెండాల్నీ, జాతీయ జెండాల్నీ ఎగరవేసిన రోజుల్ని ఎలా మర్చిపోగలం.? ఆ రకంగా తెలంగాణలో ఆందోళనలకు టీఆర్‌ఎస్ అప్పట్లో వేసిన స్కెచ్, సామాన్యుల్ని లాఠీ దెబ్బలు తినేలా చేసింది. అది కూడా తెలంగాణ ఉద్యమంలో ఓ భాగమైపోయింది. 'మేం అధికారంలోకి వచ్చాక అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పాటిస్తాం..' అంటూ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కూడా నిలదించిన సందర్భాలు అనేకం.
పరిస్థితులు మారాయి. విపక్షంలో వున్న టీఆర్‌ఎస్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ. ఇప్పుడు తెలంగాణలో విమోచన దినోత్సవం నిర్వహించాలని టీఆర్‌ఎస్ భావిస్తే, దానికి అడ్డేమీ వుండదు. కానీ, పార్టీ పరంగా పార్టీ సీనియర్ నేత నాయని నర్సింహారెడ్డి యదాతథంగా విమోచన దినోత్సవం రోజున విలీన దినోత్సవ వేడుకల్ని చేసేసి, ఊరుకుంటారంతే.
ఈసారి బీజేపీ నుంచి తెలంగాణ విమోచన దినోత్సవంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇంకోపక్క కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీలు కూడా విమోచన దినోత్సవం పేరుతో తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చే ప్రయత్నాలు షురూ చేశాయి. ఈ పరిస్థితుల్లో అధికారికంగా తెలంగాణ విలీన దినోత్సవాన్ని నిర్వహిస్తే ఎలా వుంటుంది.? అన్న దిశగా కేసీఆర్ సర్కార్ వ్యూహాల్ని సిద్ధం చేస్తోందట.
ప్రస్తుతానికైతే విలీనం గురించిన చర్చ మాత్రమే.. ఎప్పుడన్నా మళ్లీ ప్రతిపక్షంలోకి వెళితే, అప్పుడు విమోచన గురించి మాట్లాడొచ్చంటూ పార్టీ నేతలకు కేసీఆర్ సంకేతాలు పంపుతున్నారట. నిజమేనా.?