ప్రతిపక్షాల బ్రహ్మాస్త్రం ప్రియాంకా గాంధీ!

2019 ఎన్నికలకు ప్రతిపక్షాలు ఇప్పటినుంచే సమాయత్తమవుతున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ప్రతిపక్షాల ఐక్యత అంతగా కనపడకపోయినప్పటికీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయానికి వచ్చేసరికి ప్రతిపక్షాల ఐక్యత స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనపడింది. నిజానికి ప్రతిపక్షాలన్నీ ఏకమయినప్పటికీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు వారికి దక్కే అవకాశాలులేవు అయినప్పటికీ ఈ రెండు పదవులకు జరిగే ఎన్నికలను తమ ఐక్యతను ప్రదర్శించేందుకు ప్రతిపక్షాలకు ఉపయోగపడింది.

రాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీజేపీ ఒక ముందడుగు వేసి ఒక దళిత అభ్యర్థి పేరును ప్రకటించడంతో నితీష్‌కుమార్‌ లాంటి నేతలు సమర్థించవలిసి వచ్చింది.  బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే  ప్రతిపక్షాలు తమ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించాయి.  బీజేపీ నేతలు నరేంద్రమోడీ, అమిత్‌ షా చాలాకాలం నుంచి రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కీలక జాగ్రత్తలు తీసుకుంటూ అడుగులు వేస్తున్నారు. అందరితో మాట్లాడారు కాని ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయానికి వచ్చేసరికి బీజేపీ ఇప్పుడిప్పుడే తన వ్యూహరచన ప్రారంభించింది. ఈలోపు ప్రతిపక్షాలు ఒకడుగు ముందుకువేసి ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిని ముందుగానే ప్రకటించాయి.

బీజేపీ ఊహించని పరిణామం ఇది.

ఉపరాష్ట్రపతి పదవికి మహాత్మాగాంధీ మనువడు గోపాలకృష్ణ గాంధీ పేరును కాంగ్రెస్‌ నిర్ణయించడం ఒక వ్యూహాత్మక నిర్ణయం. మహాత్మాగాంధీ మనుమడిని కాదనే వారెవరుంటారు? అంతేకాక ఆయన భారత తొలి గవర్నర్‌ జనరల్‌ రాజాజీ మనుమడు కూడా. మేధావి, రచయితగా గుర్తింపు పొందారు. మచ్చలేని వ్యక్తిగా పేరొందారు.  బీజేపీ రాజకీయాలను నిరసిస్తున్న వ్యక్తి. గవర్నర్‌, రాయబారి పదవుల్లోనూ, రాష్ట్రపతి కార్యదర్శిగా రాణించిన వారు.

దీనితో జనతాదళ్‌(యు) నేత నితీష్‌కుమార్‌ కూడా ఈసారి ప్రతిపక్షం వైపు వచ్చి ఉపరాష్ట్రపతి పదవికి గోపాలకృష్ణ గాంధీ పేరును సమర్థించారు. ఈసారి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దిగివచ్చి ప్రతిపక్ష నేతలందరితోనూ మాట్లాడారు. గోపాలకృష్ణ గాంధీ వ్యక్తిత్వమే ప్రతిపక్ష ఐక్యతకు దారితీసింది. నిజానికి ఆయన పేరు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలకు అంత ఇష్టంలేదు. గోపాలకృష్ణ గాంధీ సోదరుడు రాజమోహన్‌ గాంధీ 1989 ఎన్నికల్లో రాజీవ్‌గాంధీకి వ్యతిరేకంగా పోటీచేశారు. గోపాలకృష్ణ గాంధీపై కాంగ్రెస్‌కు ఇష్టంఉంటే ఆయనను గతంలోనే రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసేవారు.

కాని మహాత్మాగాంధీ నిజమైన వారసత్వం కాంగ్రెస్‌కు ఇప్పుడు అవసరం అయింది. స్వచ్చభారత్‌కు గాంధీ పేరును వాడుకుని, మాటిమాటికీ మహాత్ముడి పేరును ఉచ్చరిస్తూ, ఆయన తమ రాష్ట్రానికి చెందినవాడని చెప్పుకున్న నరేంద్రమోడీకి ప్రతిపక్షాలు ఇప్పుడు గుణపాఠం చెప్పడానికి గోపాలకృష్ణ గాంధీ అవసరం అయ్యారు. నిజమైన గాంధీ వారసత్వం తమకే ఉన్నదని చెప్పుకునేందుకు ఆయన అభ్యర్థిత్వం కాంగ్రెస్‌కు దోహదపడింది.

కాంగ్రెస్‌ కూడా తన ప్రస్తుత పరిస్థితి ఏమిటో గ్రహించింది. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు ప్రతిపక్షాల ఐక్యతను సాధనంగా వాడుకున్నారు. సోనియాగాంధీకి వాస్తవపరిస్థితిని అంచనా వేయడం బాగాతెలుసు. తన బలహీనతను గ్రహించినందువల్లే ఆమె అయిష్టంగానైనా గోపాలకృష్ణ గాంధీ పేరును ఉపయోగించుకుంటున్నారు.

దీనితో ఈసారి జనతాదళ్‌(యు) నేత, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ కూడా తన వైఖరి మార్చుకుని గోపాలకృష్ణ గాంధీ పేరును సమర్థించారు. రాష్ట్రపతి పదవి పేరుకు గోపాలకృష్ణ గాంధీ పేరునే నితీష్‌ కుమార్‌ గతంలో సోనియాగాంధీకి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అప్పుడే కనుక సోనియాగాంధీ ఆయన పేరును ఒప్పుకుని ఉంటే ప్రతిపక్షాలు విడిపోయేవి కావు.

గోపాలకృష్ణ అభ్యర్థిత్వానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలేకాక వాటికి బద్ద శత్రువైన తృణమూల్‌ కాంగ్రెస్‌ సమర్థన కూడా ఉండడం విశేషం. నేషనలిస్టుపార్టీ నేత శరద్‌ పవార్‌, డిఎంకె, రాష్ట్రీయ జనతాదళ్‌, సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీ కూడా మద్దతునీయనున్నాయి. గోపాలకృష్ణ గాంధీ మూలంగా ఏర్పడ్డ ఐక్యత 2019 ఎన్నికలవరకు కూడా కొనసాగితే అంతకంటే కాంగ్రెస్‌కు, ఇతర ప్రతిపక్షాలకూ కావల్సింది ఏమీలేదు.

గోపాలకృష్ణ గాంధీ ఒకరకంగా లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ పాత్రను పోషించనున్నారు. రాష్ట్రంలో రెండు బీజేపీయేతర పార్టీలు పోరాడినప్పటికీ కేంద్రంలో మాత్రం ప్రతిపక్ష కూటమిగా ఏర్పడేందుకు సన్నద్దంకావడం, తృణమూల్‌-వామపక్షాలు, బీఎస్‌పీ-ఎస్‌పీ కేంద్రంతో కలిసి పోరాడాలని నిర్ణయించడం ఒక బలమైన కూటమి ఏర్పడనుందనేందుకు సంకేతాలు. ప్రతిపక్షాల ఈ ఐక్యతతో గుజరాత్‌, కర్ణాటక తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి బలంగా పోటీనిచ్చేందుకు అవకాశం ఏర్పడింది.

ప్రతిపక్షాల ఐక్యత మరింత అద్భుతంగా కొనసాగాలంటే సోనియాగాంధీ తనయ ప్రియాంకాగాంధీని రంగంలోకి దింపాలన్న ఆలోచన ఒకటి బలంగా ప్రచారం అవుతుంది. రాహుల్‌గాంధీ నాయకత్వంలో సాధారణ ఎన్నికల్లో మోడీకి పోటీనీయలేమని ప్రతిపక్షాలు ఒక ఆలోచనకు వచ్చాయి. 2019 ఎన్నికల్లో ఇదే ప్రతిపక్షాల ఐక్యత కొనసాగి ప్రియాంకాగాంధీ రాజకీయ రంగప్రవేశం చేస్తే తిరుగుండదని ఆర్‌జెడి నేత లాలూప్రసాద్‌ యాదవ్‌ కూడా అన్నారు.

నిజానికి ఈ విషయంలో కాంగ్రెస్‌లో కూడా అంతర్మధనం జరుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి ప్రియాంక క్రియాశీలక పాత్ర పోషిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో సోనియాగాంధీ లోక్‌సభకు పోటీ చేయబోదని, ఆమె స్థానంలో ప్రియాంక పోటీ చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు సోనియా, రాహుల్‌, ప్రియాంక ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ప్రియాంక ఇటీవలి కాలంలో క్రియాశీలక పాత్ర పోషించడం కూడా ఈ మేరకు సంకేతాలను ఇస్తోంది. మామూలుగా ఎన్నికల సమయంలోనే మాట్లాడే ప్రియాంకాగాంధీ ఇప్పుడు చురుకుగా కనిపిస్తున్నారు. బెంగళూర్‌లో జరిగిన నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కార్యక్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

దళితులు మైనారిటీల ఊచకోత, హత్యల గురించి ఆమె నోరు విప్పారు. ఈ ఘటనల గురించి విన్నప్పుడల్లా తన రక్తం మరిగిపోతుందని ఆమె అన్నారు. ప్రియాంక మాట్లాడిన తీరు గతంలో ఇందిరాగాంధీ మాట్లాడిన తీరుకు సంకేతమని రాజకీయవర్గాలు అంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రియాంకాగాంధీ కాంగ్రెస్‌ నాయకత్వంలోని ప్రతిపక్షాల కూటమికి బ్రహ్మాస్త్రమవుతుందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

Show comments