ఒక్క ఘటన ఆలోచన మార్చేసిందా?

'ఒక ఐడియా ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది'...ఒక మొబైల్‌ కంపెనీకి చెందిన ప్రసిద్ధ ప్రచార నినాదం ఇది.  వ్యాపారానికి సంబంధించిన స్లోగన్‌ అయినా ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు. అయితే జీవితాన్ని మార్చే ఐడియా రావాలంటే ఏదో బలమైన సంఘటన జరగాలి. అలాంటప్పుడు ఒక దార్లో వెళ్లాలనుకున్న వ్యక్తి ఆ సంఘటన ద్వారా కలిగిన స్ఫూర్తితోనో లేదా అది నేర్పిన గుణపాఠంతోనో మరో దార్లో వెళతాడు. ఆ కొత్త దార్లో వెళ్లినప్పుడు జీవితం మలుపు తిరగొచ్చు. రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతుంటాయి. 

ఈమధ్య జరిగిన ఓ ఘటన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ రాజకీయ భవిష్యత్తును మారుస్తుందనుకుంటున్నారు. ఆ ఘటనతో బీజేపీ తన 'ఐడియా' మార్చుకున్నట్లు సమాచారం. ముందుగా వచ్చిన ఐడియా ఏమిటి? దాన్ని మార్చిన ఘటన ఏమిటి?  వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో యూపీని చేజిక్కించుకోవాలని అన్ని ప్రధాన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2019 సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీ లేదా కూటమి అధికారంలోకి వస్తుందో నిర్దేశించేవి యూపీ అసెంబ్లీ ఎన్నికలే. కాంగ్రెసు పార్టీ మొట్టమొదటిసారిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించింది. ఇతర పార్టీల కంటే ముందే ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. 

బీఎస్పీకి దాని అధినేత మాయావతే ముఖ్యమంత్రి అభ్యర్థి. అధికార ఎస్‌పీకి ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవే సీఎం అభ్యర్థి. కాని ఈమధ్య ఆ పార్టీలో అంతర్గత రాజకీయాలు ముదురు పాకాన పడటంతో అఖిలేష్‌ సీఎం అభ్యర్థి కాడని, ఎన్నికల్లో ఎస్‌పీ గెలిస్తే శాసనసభ్యులు తమకు ఇష్టమైనవారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని తండ్రి కమ్‌ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్‌ ప్రకటించారు. ఇదొక వ్యూహాత్మక ప్రకటన అని కొందరు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా అఖిలేష్‌ వైఫల్యాల కారణంగా ఎస్‌పీకి చెడ్డ పేరు వచ్చిందని, అతన్నే మళ్లీ ముఖ్యమంత్రిగా ఫోకస్‌ చేస్తే ఓడిపోయే పరిస్థితి ఉందని, దీంతో అతను సీఎం అభ్యర్థి కాడని ములాయం సింగ్‌ ప్రకటించారని చెబుతున్నారు. 

బీజేపీ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని భావించింది. అసోంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి విజయం సాధించింది. ఇదే ప్రయోగం యూపీలో చేయాలనుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్థులుగా కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్లు కూడా తెర మీదికి వచ్చాయి.  దానిపై తర్జనభర్జన పడుతుండగానే ఉరీలో పాక్‌ ఉగ్రవాదులు దాడులు చేసి మన సైనికులను చంపడం, ఆ తరువాత యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మన సైన్యం ఆక్రమిత కశ్మీర్లోకి దూసుకెళ్లి సర్జికల్‌ దాడులు చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం జరిగింది. 

సర్జికల్‌ దాడులు జరిగాయా? లేదా? అనేదానిపై వివాదం చెలరేగినప్పటికీ ఆ ఘటన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్‌ ఆకాశమంత ఎత్తు పెరగడం, బీజేపీ ప్రతిష్ట ఇనుమడించడం జరిగింది. మోదీ హీరో అయిపోయారు. ఆయన బద్ధ శత్రువులైన పార్టీలన్నీ ప్రశంసించక తప్పలేదు. సర్జికల్‌ దాడుల తరువాత యూపీలో బీజేపీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఆ పార్టీ నాయకులకు పెరిగిపోవడమే కాకుండా మీడియా అంచనా కూడా అలాగే ఉంది. అప్పటివరకు హంగ్‌ అసెంబ్లీ ఏర్పడొచ్చనే అంచనాలు సాగాయి. కాని దాడుల తరువాత బీజేపీ దశ తిరిగిపోయినట్లు కథనాలొచ్చాయి. 

సర్జికల్‌ దాడులతో మోదీ ఇమేజ్‌ విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం వృథా అని కమలం పార్టీ భావిస్తోందని తెలుస్తోంది. మోదీ ఇమేజ్‌ అధికారాన్ని కట్టబెడుతుందని నాయకులు విశ్వాసంతో ఉన్నారు. కాంగ్రెసు సీఎం అభ్యర్థి షీలా దీక్షిత్‌ బలమైన అభ్యర్థి కాదని బీజేపీయే కాదు. అందరూ అనుకుంటున్నారు. అఖిలేష్‌, మాయావతి బలమైన అభ్యర్థులు కాబట్టి వారికి దీటైన నాయకుడిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ భావించింది. కాని ఇప్పుడు వారిద్దరి ఇమేజ్‌ కంటే మోదీ ఇమేజ్‌ చాలా ఎక్కువగా ఉందని కమలం పార్టీ  నాయకులు చెబుతున్నారు.  

ఆయన్ని అభివృద్ధి  ప్రదాతగానే కాకుండా గొప్ప దేశభక్తుడిగా ప్రచారం చేస్తున్నారు. 'దేశభక్తి భావన, అభివృద్ధి ఆలోచన కలగలిసిన నేత' అని చెబుతున్నారు. ఇక యూపీలో కాంగ్రెసుకు విజయావకాశాలు లేవనే టాక్‌ వినబడుతోంది. ప్రియాంక గాంధీ ప్రచారపర్వం ఆలస్యం కావడం కూడా కాంగ్రెసు విజయావకాశాలను దెబ్బ తీస్తుందని కాంగ్రెసు నాయకులు భయపడుతున్నారు. యూపీలో కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సుదీర్ఘ కిసాన్‌ యాత్ర (2,500 కిలోమీటర్లు) చేసిన సంగతి తెలిసిందే. ఇది కాంగ్రెసు ఇమేజ్‌ పెంచుతుందని అనుకున్నారు. కాని సర్జికల్‌ దాడుల నేపథ్యంలో దానికి ప్రాధాన్యం తగ్గిపోయిందని మీడియా పండితులు చెబుతున్నారు. 

Show comments