మోదీ విదేశాలను అధ్యయనం చేశారా?

ఇంట్లో కుటుంబ సభ్యులు తీసుకునే చిన్నపాటి నిర్ణయాలే వివాదాస్పదమవుతుంటాయి. మనుషులుగాని, ప్రభుత్వాలుగాని తీసుకునే ఏ నిర్ణయాలకైనా పూర్తి ప్రతికూలత, అనుకూలత ఉండదు. కుటుంబాల్లో రాజకీయ పార్టీలు లేకపోయినా పెద్దలు తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నప్పుడు వంద కోట్లకు పైగా జనాభా, బొచ్చెడు రాజకీయ పార్టీలు ఉన్న దేశంలో ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా వివాదాస్పమవుతూనే ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాలను ప్రతిపక్షాలు సమర్ధించవు. విపక్షాల సలహాలను పాలకులు పాటించారు. పెద్ద నోట్ల రద్దు విషయం కూడా ఇలాంటిదే. ఈ నిర్ణయాన్ని సమర్ధించేవారు ఎందరున్నారో, వ్యతిరేకించేవారు అందరున్నారు. 

నల్లధనాన్ని అరికట్టాలనే విషయంలో ఎవ్వరికీ భిన్నాభిప్రాయం లేకపోయినా రద్దు సరైన నిర్ణయం కాదని కొందరంటున్నారు. సరైన నిర్ణయమే అయినా అమలులో లోపాలున్నాయని కొందరు చెబుతున్నారు. నోట్ల రద్దుతో మోదీ ఇమేజ్‌ పెరిగిందనేవారున్నారు. సామాన్య ప్రజలను ఇబ్బందుల పాలుచేసి, ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసినందుకు ఇమేజ్‌ తగ్గిందనేవారున్నారు. నోట్ల రద్దు దేశం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనేది ఒక ప్రశ్న అయితే, దీనివల్ల బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు సమకూరుతాయా? అనేది మరొకటి. 

ఈ రాజకీయ ప్రయోజనాలు తక్షణం సమకూరాలనుకునేది దేని ద్వారా? వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ద్వారా. ఆ ప్రయోజనం సిద్ధిస్తుందా? లేదా. అనేది కొన్ని నెలల్లో తెలిసిపోతుంది. ఇదిలా ఉంచితే...పెద్ద నోట్ల రద్దు మన దేశానికి సంబంధించిన అంతర్గత వ్యవహారం కాదు. ఇది అంతర్జాతీయం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ రద్దు నిర్ణయంపై విశ్లేషణలు చేస్తున్నాయి. వేళ్ల మీద లెక్కపెట్టగలిగిన కొన్ని దేశాలు మినహా చాలా దేశాల్లో నల్లధనం సమస్య ఉంది. అవినీతి ఊడలు దిగింది. అందుకే మోదీ చర్య చర్చనీయాంశమైంది. 

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న, ఒకదానితో మరొకటి పోటీ పడుతున్న ఆర్థిక వ్యవస్థలుగా ఇండియాను, చైనాను చెప్పుకుంటారు. ఈ రెండింటిని బలమైన ఆర్ధిక శక్తులుగా చెబుతుంటారు. ఈ నేపథ్యంలో నోట్ల రద్దు నిర్ణయంపై చైనా మీడియా స్పందించింది. నల్లధనాన్ని అంతం చేయడానికి మోదీ చేసిన ప్రయత్నాన్ని హర్షిస్తూనే ఇది 'రిస్క్‌తో కూడిన వ్యవహారం' అని పేర్కొంది. పెద్ద నోట్లు రద్దు చేసినంత మాత్రాన నల్లధనం నాశనం కాదని, అవినీతి హరించుకుపోదని చైనా మీడియా తేల్చిచెప్పింది. అయితే ఒక ప్రయత్నమంటూ చేసినందుకు మోదీని అభినందించింది. 

ఈ సందర్భంగానే ఓ సలహా ఇచ్చింది. ఏమిటది? అవినీతిని అరికట్టడానికి చైనా అనుసరిస్తున్న, అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని పేర్కొంది. అంటే ఆ దేశ విధానాలను అధ్యయనం చేశాక నిర్ణయం తీసుకుంటే బాగుండేదని చైనా మీడియా అభిప్రాయం కాబోలు. చైనా ఎంత కమ్యూనిస్టు దేశమైనా అక్కడా అవినీతి ఉంది. అక్కడ అవినీతికి పాల్పడినవారు, తప్పుడు పనులు చేస్తున్నవారు దొరికిపోతే కఠిన శిక్షలు విధిస్తారు. దాదాపుగా మరణ శిక్షే అమలు చేస్తారు. ఈ విషయంలో ఎంత ఉన్నతస్థానంలో ఉన్నవారినైనా వదలిపెట్టరు. 

అవినీతిపరులను శిక్షించినంత మాత్రాన వెంటనే అవినీతి అంతం కాదు. అవినీతి జరుగుతున్న, నల్లధనం పోగుపడుతున్న మార్గాలను మూసేయాలి. అందుకే అవినీతి జరగకుండా తాము ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నామో అధ్యయనం చేయాలని చైనా మీడియా సలహా ఇచ్చింది. దశాబ్దాలుగా చైనా అవినీతి అరికట్టే చట్టాలను అమలు చేస్తోందని, పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసిందని, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తెచ్చి దాన్ని బలోపేతం చేసిందని, పాలనలో పారదర్శక విధానాలు అమలు చేస్తోందని ఆ దేశం మీడియా తెలిపింది. చైనా విధానాలకు ఓ ఉదాహరణ చెప్పింది. 

అవినీతికి పాల్పడిన పన్నెండు మంది సీనియర్‌ అధికారుల కుటుంబ వివరాలను విదేశాంగ శాఖ తన వెబ్‌సైట్‌లో పెట్టింది. మన దేశంలో నల్లధనం పోగేసుకున్నవారి పేర్లు ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుంది. పాపాత్ములను ప్రజల ముందు పెట్టకుండా తెర వెనక ఎందుకు దాస్తారో అర్థం కాదు. చైనా ప్రభుత్వ సమాచారం ప్రకారం గత మూడేళ్లలో సర్కారు పది లక్షల మంది అధికారులను శిక్షించింది. ఇది మన దేశంలో సాధ్యమా? నోట్ల రద్దు నిర్ణయంపై మోదీ ఆరు నెలలు రహస్యంగా కసరత్తు చేశారట...!  

ఈ క్రమంలో విదేశాల్లోని విధానాలను అధ్యయనం చేశారా? మోదీ ఇంత చేసినా సామాన్య ప్రజలకు తెలిసిన కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు కూడా ప్రభుత్వ పెద్దల బుర్రలకు తట్టకపోవడం విచిత్రం. నోట్ల రద్దు నిర్ణయం తప్పని భావిస్తే తనను ఉరి తీయాలను మోదీ అన్నారు. ఒకవేళ ఎన్నికల్లో బీజేపీ (ఎన్‌డీఏ) పరాజయం పాలైతే అది ఉరి కంటే పెద్ద శిక్ష అవుతుంది. 

Show comments