ప్రణబ్‌ స్థానంలో ఎవరు?

దేశ రాజకీయాల్లో రాష్ట్రపతి ఎవరు అన్న విషయంపై రాజకీయవర్గాల్లో కీలక చర్చ సాగుతోంది. బీజేపీ కురువృద్ధులు లాల్‌కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీలపై బాబ్రీ మసీదు విధ్వంసానికి క్రిమినల్‌ కుట్రకు పాల్పడ్డారన్న కేసును పునరుద్దరించాలని సుప్రీంకోర్టు నిర్ణయించడంతో ఈ ఇద్దర్నీ రాష్ట్రపతి పదవికి పరిగణనలోకి తీసుకోవడం కష్టమన్న అభిప్రాయం న్యాయవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడం వెనుక ప్రధానమంత్రి నరేంద్రమోడీ హస్తం ఉన్నదని, ఆయనకు అద్వానీని రాష్ట్రపతిని చేయడం ఏమాత్రం ఇష్టంలేదని రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాల్‌కృష్ణ అద్వానీ విమర్శించారు. సీబీఐ ప్రధానమంత్రి చేతుల్లో ఉంటుందని, సీబీఐ ఈ కుట్రకేసుపైవిచారణ జరగాలని కోర్టులో చెప్పిందని లాలూ వెల్లడించారు. ఇదొక రాజకీయ కుట్ర అని ఆయన అన్నారు.

నిజానికి ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల తర్వాత నరేంద్రమోడీ బీజేపీలో తిరుగులేని నేతగా మారారు. ఆయన ఆద్వానీని రాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించకపోయినా పార్టీలో ఎవరూ  ప్రశ్నించలేని స్థితి నెలకొన్నది. అయితే ఒకప్పటి తన గురువైన అద్వానీని కాదనడం మోడీకి కష్టమైన పనే అని పరిశీలకులు భావించారు. అద్వానీ కూడా పైకి రాష్ట్రపతి పదవి రేసులో తానులేనని చెప్పినప్పటికీ కొందరు పార్టీ నేతలు తనను విస్మరిస్తున్న తీరుకు చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. తన వయస్సు దాటిపోయిందని, ఏ పదవీ చేసే పరిస్థితిలో లేనని మోడీ అనుయాయులు చేస్తున్న ప్రచారం అద్వానీకి బాధ కలిగించినట్లు తెలుస్తోంది. వయస్సు ముఖ్యం కాదు.. చురుకుగా పనిచేయగలనా లేదా అన్నది ముఖ్యం.. అని అద్వానీ తనను ఇంటర్వ్యూ చేసిన ఒక పత్రికకు చెప్పారు. రాజకీయాల్లో తనపాత్ర ఇంకా పూర్తికాలేదని ఆయన స్పష్టం చేసారు. తనను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయకపోతే అద్వానీ ఏమిచేస్తారా అన్నది వేచి చూడాల్సి ఉన్నది. రాజకీయాల్లో అధికారం ఎంతో ముఖ్యం. అద్వానీని ఇవాళ ఎవరూ బీజేపీలోనే పట్టించుకునే స్థితిలో లేరు. ఇప్పటివరకూ తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన మమతాబెనర్జీ ఒక్కరే అద్వానీకి మద్దతు ప్రకటించారు కాని స్వంతపార్టీ నేతలెవరూ నోరు విప్పలేదు.

అద్వానీ విజయవంతంగా రేసునుంచి తొలగిపోతే భారతీయజనతా పార్టీ ఎవర్నీ రాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలోకి దించుకుందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. రాష్ట్రపతి పదవి ఎంపిక విషయంలో ముందుగా మెజారిటీ ఉండేలా చూసుకోవాలని నరేంద్రమోడీ, అమిత్‌ షా అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇటీవల చాలాకాలం తర్వాత మోడీ ఎన్డీఏ నేతలసమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక క్రమంలో ఇది తొలిఅడుగు. ఎన్డీఏ నేతలంతా తనతో పాటు ఉన్నారా లేదా అని చూసుకోవడం మోడీ ప్రధానోద్దేశం. అనుకున్న విధంగా ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ సమావేశానికి వచ్చాయి. తెలుగుదేశంనేత చంద్రబాబునాయుడు, శిరోమణి అకాలీదళ్‌ నేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, శివసేన అధినేత ఉద్దావ్‌థాకరే ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిత్వం గురించి చర్చించకపోయినా కలిసికట్టుగా కార్యాచరణ చేయాలన్న విషయాన్ని చర్చించారు. దీనితో మోడీ మనోభావం అందరికీ అర్థమైంది.

రాష్ట్రపతి ఎన్నికకు అవసరమయ్యే ఎలెక్ట్రోరల్‌ కాలేజీలో 10,98,892 ఓట్లు ఉంటాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ అభ్యర్థి మెజారిటీతో గెలవాలంటే 5,49,442 ఓట్లు వసరం. ఉత్తరప్రదేశ్‌లో అఖండమైన మెజారిటీ వచ్చినప్పటికీ ఎన్డీఏకు 5.32లక్షల ఓట్లు మాత్రమే ఉన్నాయి. అంటే సగానికన్నా ఎన్టీఏకు 17,500 ఓట్లు తక్కువున్నాయి. ఎన్డీఏ పార్టీలను కలిసికట్టుగా ఉంచడమేకాక బిజూజనతాదళ్‌, అన్నాడిఎంకే, టీఆర్‌ఎస్‌ తదితర పార్టీల మద్దతు అవసరం. గతంలో రెండుసార్లు శివసేన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతునీయలేదు. శివసేన మద్దతు నీయకపోతే ఎన్డీఏ పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది. అయితే కేంద్రంలోమంత్రి పదవులు ఇస్తే శివసేన ఈసారి మద్దతునిచ్చే అవకాశాలున్నాయి.

ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా  నిర్ణయించే విషయంలో మోడీ అందర్నీ ఆశ్చర్యపరిచే  నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. చాలాకాలంగా మోడీ మనస్సులో తన స్వంత టీమ్‌తో ముందుకు పోవాలన్న అభిప్రాయం ఉన్నది. బీజేపీ పార్టీని, ప్రభుత్వాన్ని పూర్తిగా తన గుప్పిట్లో తీసుకున్నప్పటినుంచీ మోడీ పాతటీమ్‌ను నిర్ణయాలనుంచి తప్పించడం మొదలు పెట్టారు. అద్వానీ, జోషీని మార్గదర్శమండలికి పంపించారు. ఇంతవరకూ మార్గదర్శమండలి ఒక్కసారైనా సమావేశమైన దాఖలాలులేవు. వెంకయ్య, అరుణ్‌జైట్లీ తదితరులు పార్లమెంటరీ బోర్డుకుపరిమితమయ్యారు. అభ్యర్థుల ఎంపిక అమిత్‌ షా సర్వేల ప్రకారం చేస్తున్నందువల్ల పార్లమెంటరీ బోర్డు ప్రమేయం కూడా పెద్దగా ఉండడంలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా మోడీ, షా తమ మనుషులనే నియమించుకున్నారు. సీనియర్‌ నేతలెవరూ పార్టీ కార్యాలయంలో కనీసం అడుగుపెట్టకుండా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈక్రమంలో ప్రభుత్వం నుంచి కూడా పాత మనుషులను తప్పిస్తారన్న చర్చ వినపడుతోంది. అరుణ్‌ జైట్లీ, సుష్మాస్వరాజ్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. యూపీ ఎన్నికల తర్వాత రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రమేయం లేకుండాపోయింది. రాజ్‌నాథ్‌సింగ్‌ కుమారుడిని యోగీ ఆదిత్యనాథ్‌ తన మంత్రివర్గంలో నియమించకుండా ప్రక్కనపెట్టారు. ఇక వెంకయ్యనాయుడు మోడీకి పూర్తి సమర్థకుడుగా మారి ఆయనను అవకాశం వచ్చినప్పుడల్లా ఆకాశానికి ఎత్తడంతో ఆయనను ప్రక్కన పెట్టకపోవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వెంకయ్యను ఉపరాష్ట్రపతి పదవిలో నియమించి రాజ్యసభ చైర్మన్‌గా సభను నిర్వహించే అవకాశం కల్పించే అవకాశాలు లేకపోలేదని కూడా అంటున్నారు.

రాష్ట్రపతి పదవిలో మాత్రం మోడీ తన ఆలోచనను బయటకు పెట్టడంలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రామహాజన్‌, ఒడిషాకు చెందిన జార్కండ్‌ గవర్నర్‌ ద్రౌపదీ ముర్ము పేర్లు చర్చకు వచ్చాయి. ఎన్డీఏ అభ్యర్థి ఎవరైనా ప్రతిపక్షాల అభ్యర్థి ఎవరన్న విషయానికి కూడా ప్రాధాన్యత ఉన్నది. ఇప్పటివరకూ ప్రతిపక్షాల మధ్య అధికారికంగా ఎటువంటి చర్చ జరుగలేదు. రాహుల్‌గాంధీ, సీతారాం ఏచూరి మధ్య అనధికారిక చర్చలు జరిగాయని వినికిడి. నవీన్‌ పట్నాయక్‌, నితీష్‌కుమార్‌ల మధ్య కలిసికట్టుగా అభ్యర్థిని నిలబెట్టాలనే ప్రతిపాదన వచ్చింది. ముందుగా బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత నిర్ణయించుకోవచ్చునని కొన్ని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ప్రతిపక్షాల తరఫున శరద్‌యాదవ్‌, ములాయంసింగ్‌ యాదవ్‌, కరుణానిధి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. కాని అంతిమ నిర్ణయం బీజేపీ అభ్యర్థిని ప్రకటించడాన్ని బట్టి ఉంటుంది.

-హరీశ్‌ 

Show comments