బ్యాంకులు నొక్కేశాయంటూ ఈ బొంకుడేంది.!

జనం బ్యాంకుల మీద తిరగబడ్తున్నారు.. తాము చెయ్యగలిగేదేమీ లేదనీ, తమకు వస్తున్న డబ్బుల్ని ఎక్కువమందికి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు.. ఎక్కడో, ఢిల్లీలో వుండే ప్రధాని నరేంద్రమోడీని ప్రశ్నించలేక, బ్యాంకుల మీద కాస్తో కూస్తో అసహనం వ్యక్తం చేసి, బతుకు జీవుడా.. అంటూ బ్యాంకు క్యూ లైన్ల నుంచి బయటపడ్తున్నారు సాధారణ ప్రజానీకం. 

ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు బ్యాంకుల వద్ద చోటు చేసుకోలేదంటే, దానర్ధం ప్రజలు హ్యాపీగా వున్నారని కాదు.. సంయమనం పాటిస్తున్నారు.. సహనం ప్రదర్శిస్తున్నారు. ఆ సహనానికి పరీక్ష ఇంకెన్నాళ్ళు.? అన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. క్యూ లైన్లలో నిల్చోలేక ఎవరైనా సొమ్మసిల్లి పడిపోయినప్పుడు మాత్రం, కాస్సేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. దురదృష్టవశాత్తూ ఎవరైనా మరణిస్తే మాత్రం పరిస్థితి చెయ్యిదాటిపోతోంది. 

ఇక, కేంద్రం తమ వైఫల్యాన్ని బ్యాంకుల మీద రుద్దేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బ్యాంకుల్లో అవకతవకలు జరిగాయంటూ ఇప్పటికే 'సోదాలు' షురూ చేసిన విషయం విదితమే. పలువురు బ్యాంక్‌ సిబ్బందిని అదుపులోకి తీసుకోవడం, సస్పెండ్‌ చేయడం కూడా జరిగిపోయాయి. దేశవ్యాప్తంగా కొన్ని బ్యాంకులు మూతపడ్తాయనే ప్రచారం కూడా జరుగుతుండడం గమనార్హం. 

అసలు విషయమేంటి.? అక్రమాలన్నీ బ్యాంకుల్లోనే జరుగుతున్నాయా.? రిజర్వు బ్యాంకు నుంచి వచ్చిన డబ్బులు బ్యాంకులకు చేరుకుని, అక్కడినుంచి ఎలా చేతులు మారుతున్నాయి.? వంటి ప్రశ్నలు మళ్ళీ సరికొత్త అనుమానాలకు ఆస్కారం కల్పిస్తున్నాయి. ఎందుకంటే, బ్యాంకుల నుంచి అక్రమాలు జరిగే ఆస్కారం వున్నా, ఆ అక్రమాల వెనుక 'పెద్ద తలకాయలు' లేకుండా అంత 'పెద్ద' పని జరగదుగాక జరగదు. 

హైద్రాబాద్‌లోని ప్రధాన కూడలిలో వున్న ఓ బ్యాంకుకి ఈ మధ్యకాలంలో ఓ రోజు పాతిక లక్షల రూపాయల సొమ్ములు చేరాయి. ఆ మొత్తాన్ని, వినియోగదారులకు అందించడానికి ఆ బ్యాంకు పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. డబ్బు అయిపోతోందనే విషయాన్ని గుర్తించి, క్యూ లైన్లలో వున్నవారికి చెప్పే ప్రయత్నం చేస్తే.. పెద్ద రచ్చే జరిగింది. ఎలాగోలా ఆ వివాదం సద్దుమణిగింది. బ్యాంకులపై ఇంత తీవ్రమైన ఒత్తిడి వుందని చెప్పడానికే ఈ ఉదాహరణ. 

ఓ బ్యాంకుకి ఓ పాతిక లక్షలు వస్తే, దాంట్లోంచి ఎంత మొత్తాన్ని పక్కదారి పట్టించగలరు.? అన్న విషయం ఆలోచిస్తే 'ఇంగితం' అర్థమయిపోతుంది. అంటే, మేటర్‌ ఇంకెక్కడో తేడా కొట్టేస్తోందన్నమాట. ఆ 'తేడా' వెనుక పెద్దలున్నారన్నమాట. పెద్దలు లేకుండా, పెద్దమొత్తాలు చేతులు మారే అవకాశాలు దాదాపు శూన్యం. ఇప్పటికే నెల రోజులుగా చాలా ఏటీఎంలు పనికిరాకుండా పోయాయి. బ్యాంకులు బతుకు జీవుడా.. అంటూ కాలం వెల్లదీస్తున్నాయి. జనానికి ఎంత సంయమనం వుందన్నదానిపైనే బ్యాంకుల భవిష్యత్తు ఆధారపడి వుంది. ఆ విషయం బ్యాంకులకీ, అందులోని సిబ్బందికీ బాగా తెలుసు. 

సో, ఇక్కడ మేటర్‌ క్లియర్‌. అక్రమాలు అతి పెద్ద స్థాయిలోనే జరుగుతున్నాయి. అయినా, నెపాన్ని బ్యాంకుల మీదకి నెట్టేయాలనుకోవడం వెనుక పెద్ద 'కుట్రే' దాగి వుండాలి. ఆ కుట్ర ఏమిటి.? తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోడానికి నరేంద్రమోడీ సర్కార్‌ ఎంత స్థాయికైనా దిగజార్చుతుందా.? ఎవర్నయినా ఇరికించేస్తుందా.? డౌటెందుకు, జరుగుతున్నది అదే కదా.! 

చివరగా: బ్యాంకుల్లో అక్రమాలు జరిగి వుండొచ్చు, జరగకపోయి వుండొచ్చు.. అక్రమాలు బ్యాంకులకు కొత్తేమీ కాదు.. ఆ అక్రమాలకు కారణం కూడా రాజకీయ నాయకులే కదా. ఆ రాజకీయ నాయకులే కదా, బ్యాంకుల్ని ముంచేసింది. ఇప్పుడు అదే రాజకీయం, బ్యాంకుల్ని విమర్శిస్తోంటే హాస్యాస్పదంగా అన్పించడంలేదూ.!

Show comments