నవీన్‌తో స్నేహం కావాలి...రైల్వే జోన్‌ హుళక్కే...!

అవ్వా కావాలి..బువ్వా కావాలంటే కుదరదు. ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలంటారు పెద్దలు. అంటే రాజీపడిపోవడమన్నమాట. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇలాగే రాజీపడిపోవాలని  నిర్ణయించుకున్నట్లు సమాచారం. మోదీ సర్కారు రాజీపడిపోవడం వల్ల నష్టపోయేది ఎవరు? ఆంధ్రప్రదేశ్‌. ప్రయోజనం పొందేదెవరు? బీజేపీ. ఈ రాజీ కథ విశాఖపట్నం రైల్వే జోన్‌కు సంబంధించింది. ఏపీకి ప్రత్యేక హోదా హుళక్కి అయిపోయింది. ఎవరెంత ఆందోళన చేసినా అది ముగిసిపోయిన కథే. హోదా అవసరంలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సర్దుకుపోయినప్పుడు ఎలాగైనా దాన్ని సాధిస్తామని ప్రతిపక్షాలు చెప్పుకోవడం రాజకీయ ప్రయోజనాలకు పనికొస్తుందేమో. ప్రత్యేక హోదా మాదిరిగానే రైల్వే జోన్‌ కథ కూడా కంచికి చేరేలా కనబడుతోంది. ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదని చెప్పిన బీజేపీ నాయకులు, రైల్వే ఉన్నతాధికారులు  ఏపీకి రైల్వే జోన్‌ అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చినా ప్రయోజనం లేదని చెప్పినట్లే రైల్వే జోన్‌ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు. నిధులు, సౌకర్యాలు ప్రధానంగాని జోన్‌ ఇస్తే ఏం ఒరుగుతుంది? అని అడుగుతున్నారు. రైల్వే జోన్‌ విషయంలో ఇదో అంశం.

ఇక రాజకీయపరమైన అంశం ఒకటుంది. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్‌ ఇవ్వడానికి ఒడిశాలోని నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం ఎప్పటినుంచో అభ్యంతరం చెబుతోంది. ఈ సంగతి బీజేపీకి, టీడీపీకి తెలిసినా ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల్లో మోదీ, చంద్రబాబు, వెంకయ్య నాయుడు తదితరులు హామీ ఇచ్చారు. ఒడిశా కేంద్రంగా పనిచేస్తున్న ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేలో భాగమైన వాల్తేరు డివిజన్‌ కారణంగా ఆ రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనాలున్నాయి. విశాఖ కేంద్రంగా జోన్‌ ఏర్పాటు చేస్తే ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయి. ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ మోదీ, బాబు అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే 2014లో నవీన్‌ పట్నాయక్‌ కేంద్రానికి లేఖ రాశారు. అప్పటినుంచి బీజేపీ నాయకులు దీనిపై మభ్యపెడుతున్నారుతప్ప ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

తాజా సమాచారం ప్రకారం 2019 ఎన్నికల్లో బీజేపీ ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌ పార్టీ బిజెడితో పొత్తు పెట్టుకోవాలనుకుంటోంది. పొత్తు పెట్టుకోవాలంటే నవీన్‌ కోరికను కాదనకూడదు. కమలం పార్టీకి తన రాజకీయ ప్రయోజనాలే ప్రధానం తప్ప ఏపీ ప్రయోజనాలు కాదు కదా. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదంటే గమ్మున ఉన్నవారు రైల్వే జోన్‌ ఇవ్వడం కుదరదన్నా గమ్మున ఉంటారని బీజేపీ భావిస్తున్నట్లుంది. మరో విషయమేమిటంటే ఒడిశాలో బీజేపీ బలం పుంజుకుంటోంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో (జిల్లాపరిషత్‌) బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. 854 జడ్‌పి సీట్లలో 2012లో కేవలం ఏడు సీట్లు గెలుచుకున్న కాషాయం పార్టీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో విజయ పరంపర కొనసాగిస్తోంది. ఫిబ్రవరి 21 వరకు జరిగే జడ్‌పీ ఎన్నికల్లో ఇప్పటివరకు ఫలితాలు ప్రకటించిన 360 సీట్లలో 130 గెలుచుకుంది. ఇంకా గెలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. 

ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో అధికార పార్టీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి రావాలనుకుంటోంది. ఏపీకి రైల్వే జోన్‌ ఇస్తే పొత్తు సాధ్యం కాదు. నిజానికి రైల్వే జోన్‌ అంశం రాష్ట్ర విభజనతో తెర మీదికి రాలేదు. తెలంగాణ ఉద్యమం మొదలుకాకముందునుంచే ఈ డిమాండ్‌ ఉంది. అలా ఉంది కాబట్టే విభజన చట్టంలో చేర్చారు. బీజేపీ కూడా హామీ ఇచ్చింది. వచ్చే ఎన్నికలనాటికి చంద్రబాబు దీన్ని సాధిస్తారో, వదులుకుంటారో తెలియదు. ఏపీకి రైల్వే జోన్‌ రాదని ఆ శాఖ అధికారులు మీడియాకు చెప్పినట్లు సమాచారం. రైల్వే జోన్‌ ఇచ్చే విషయమై ముగ్గురు అధికారుల కమిటీ పరిశీలిస్తోందట. జోన్‌ ఇవ్వాలని ఆ కమిటీ సిఫార్సు చేయబోదని అధికారులు చెబుతున్నదాన్నిబట్టి అర్థమవుతోంది.

రైల్వే జోన్‌ వస్తుందనే ఆశతోనే చంద్రబాబు రైల్వే మంత్రి సురేష్‌ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపించారు. ఆయనకు ప్రయోజనం కలిగించినా ఏపీకి శూన్యహస్తం చూపించారు.  ఇక సురేష్‌ ప్రభు విషయానికొస్తే హర్యానా నుంచి పెద్దల సభకు ప్రాతినిథ్యం వహించిన ఆయన్ని ఆంధ్రకు పట్టుకొచ్చారు. మహారాష్ట్రకు చెందిన ఈయనకు ఆంధ్రతో లింకు లేదు.  రైల్వే జోన్‌ ఇవ్వకపోయినా ప్రత్యక్షంగా నిలదీసే అవకాశం లేదు. ఆరేళ్లు ఆయన పదవికి ఢోకా లేదు. ఇప్పటివరకు రైల్వే మంత్రులైనవారంతా తమ సొంత రాష్ట్రాలకు ఎక్కువ మేలు చేశారు తప్ప ఇతర రాష్ట్రాలను అంతగా పట్టుంచుకున్న దాఖలాలు లేవు. ఏ రైల్వే మంత్రి తీరైనా ఇంతే. 

Show comments