కరెన్సీ మాయ.. అసలు నిజమిదయ్యా.!

ఓ ఆరు లక్షల కోట్ల రూపాయల్ని రిజర్వు బ్యాంక్‌, నలభై అయిదు రోజుల్లో విడుదల చేసింది. ఇదంతా కొత్త కరెన్సీ. ఇందులో 2 వేల రూపాయల నోట్లున్నాయి.. 500 రూపాయల నోట్లున్నాయి.. ఇంకా చిన్నవీ వున్నాయి. ఇంకోపక్క, బ్యాంకులకు చేరిన పాత పెద్దనోట్ల విలువ అటూ ఇటూగా 15 లక్షల కోట్ల వరకూ వుంటుందన్నది ఓ అంచనా. డిమాండ్‌కీ సప్లయ్‌కీ అసలు పొంతనే లేదనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, మార్కెట్‌లోకి వచ్చిన కొత్త కరెన్సీలో చాలావరకు పెద్ద నోట్లే. 500 రూపాయల నోట్లు చాలా తక్కువ. 2 వేల రూపాయల నోట్లు చాలా చాలా ఎక్కువ. వాటిని దాచుకోడానికి తప్ప, వాడుకోడానికి ఉపయోగించలేని పరిస్థితి. సామాన్యుడి చేతికి 2 వేల రూపాయల నోటు చేరిన మరుక్షణంలో, దాన్ని తక్కువ రేటుకే అయినాసరే మార్చేసుకోవాల్సి వస్తోంది. మరి, అలా మార్చుకుంటున్న నోట్లు ఏమవుతున్నాయి.? ఇది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. 

బ్యాంకుల ద్వారా బయటకు వచ్చే 2 వేల రూపాయల నోట్లు, తిరిగి బ్యాంకులకు చేరడం చాలా చాలా అరుదుగా కన్పిస్తోంది. అందుకే, కరెన్సీ సంక్షోభం తీవ్రమవుతోందన్నది ఓ అంచనా. మరి, 2 వేల రూపాయల నోటు ఎక్కడికి వెళుతున్నట్లు.? అంటే, ఇంకెక్కడికి వెళుతుంది.. నల్ల కుబేరుల చేతుల్లోకి.. అనే అభిప్రాయం సర్వత్రా విన్పిస్తోంది. ఐటీ సోదాల సందర్భంగా పెద్దయెత్తున కొత్త కరెన్సీ లభ్యమవుతుండడమే ఇందుకు నిదర్శనం. 

మరోపక్క, ఆరు లక్షల కోట్ల రూపాయల్లో ఎన్ని వేల కోట్లు ఇలా పక్కదారి పట్టి వుండాలి.? అలా వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టినా, ఐటీ సోదాల్లో లభ్యమవుతున్న కొత్త నోట్ల లెక్కలు అంతంతమాత్రంగానే ఎందుకు వుంటున్నాయి.? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఐటీ దాడుల సందర్భంగా నోట్ల కట్టలు వెలుగుచూస్తున్న మాట వాస్తవం. కానీ, కోటి, రెండు కోట్లు, కొన్ని సందర్భాల్లో లక్షలు, అప్పుడప్పుడూ 10 కోట్లు, పాతిక కోట్లు.. ఇదీ ఐటీ సోదాల్లో లభ్యమవుతున్న కొత్త పెద్ద నోట్ల తీరు. 

ఒక్కటి మాత్రం నిజం, నల్లధనం అనేది కేవలం కరెన్సీ రూపంలోనే లేదు. బంగారం రూపంలో వుంది, విదేశీ మారకం రూపంలో వుంది, రియల్‌ ఎస్టేట్‌ రూపంలో వుంది, ఇంకా అనేక రూపాల్లో వుంది. పక్కదారి పట్టిన వేల కోట్ల రూపాయల్లో జస్ట్‌ కోట్లు మాత్రమే దొరుకుతుండడం.. రాజకీయ నల్ల కుబేరుల జోలికి ఐటీ శాఖ రైడింగ్స్‌ వెళ్ళకపోవడం.. ఇవన్నీ సరికొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. 

ఏదిఏమైనా, పక్కదారి పడ్తున్న కరెన్సీలో 10 శాతం కాదు కదా, కనీసం 1 శాతం సొమ్ముని కూడా ఐటీ శాఖ వెలికి తీయలేకపోతోంది. దీని భావమేంట.? ప్రతి చిన్న దాడికీ విపరీతమైన పబ్లిసిటీ లభిస్తోందంటే, ఎక్కడో కథ తేడా కొట్టేస్తోంది. ఈ దాడులు పబ్లిసిటీ దాడులు తప్ప, చిత్తశుద్ధితో జరుగుతున్నవి కావేమోనన్న అనుమానాలు వ్యక్తమవడం సహజమే కదా.!

Show comments