పాతిక సీట్లు చాలుట...బాబు కోసమేనా?

ఏపీకి తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. ఆయన సీఎం అయ్యాక తొలిసారి ఏపీకి రావడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి నిరసనగా సాగిన ఈ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతిక ఎమ్మెల్యే అయిదు ఎంపీ సీట్లు కాంగ్రెస్ కి ఇవ్వండి అని జనాలకు పిలుపు ఇచ్చారు. ఇవి ఇస్తే కాంగ్రెస్ ఏపీలో అద్భుతాలు సృష్టిస్తుంది అని ఆయన అంటున్నారు.

ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు అయినా తమ పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలని కోరుకుంటారు. తాము గెలవాలని కోరుకుంటారు. కానీ పాతిక సీట్లు చాలు అదే మహా భాగ్యం అని రేవంత్ రెడ్డి అనడం పట్ల విస్మయం వ్యక్తం అవుతోంది.

రేవంత్ రెడ్డి మాటలు చూస్తూంటే జనసేన బీజేపీ పొత్తులో భాగంగా టీడీపీ నుంచి తీసుకున్న సీట్లు గుర్తుకు వస్తున్నాయని అంటున్నారు. ఆ పార్టీలు కూటమిలో ఉండి ఆ సీట్లు తీసుకున్నాయి. కూటమి బయట ఉండి కాంగ్రెస్ పాతిక చాలు అనుకుంటోంది. అంటే టీడీపీ 144 సీట్లలో పోటీ చేస్తే అందులో పాతిక కాంగ్రెస్ తీసుకుంటే ఆ మిగిలిన సీట్లతో బాబు సీఎం కావాలని ఆయన అధికారంలోకి రావాలన్నదేనా కాంగ్రెస్ నేతల తపనా అని ప్రశ్నలు కురిపిస్తున్నారు ప్రత్యర్ధులు.

ఏపీలో మేమే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ చెప్పనపుడు 175 సీట్లకు ఎందుకు పోటీ పెడుతున్నారు అన్నది కూడా సందేహంగా ఉంది అంటున్నారు. ఏపీలో విపక్షాలు అన్నీ జట్టు కట్టి వస్తున్నాయి అని జగన్ ఈ మధ్యనే తన సిద్ధం సభలలో చెబుతూ వస్తున్నారు. ఒక జాతీయ పార్టీతో నేరుగా పొత్తు ఉంది, మరో జాతీయ పార్టీ చంద్రబాబు  జేబులో ఉంది అని జగన్ విమర్శించారు. Readmore!

ఇపుడు రేవంత్ రెడ్డి మాటలు చూస్తూంటే అదే నిజమా అని అనిపించక మానదు అని అంటున్నారు. లేకపోతే కాంగ్రెస్ కి ఓటేయండి అధికారంలోకి అధికారంలోకి రండి, మొత్తం 175 అసెంబ్లీ, పాతిక ఎంపీ సీట్లూ ఇవ్వండి అని అడగాల్సిన రేవంత్ రెడ్డి ఒక పాతిక ఎమ్మెల్యేలు చాలు అని అడగడంలో ఆంతర్యం ఏమిటో అని అంతా తర్కించుకుంటున్నారు.

వైఎస్ షర్మిలను ఏపీ సీఎం గా చేస్తాను ఆమెకు అండగా ఉంటాను అని ఒక వైపు చెబుతూ మరో వైపు పాతిక ఎమ్మెల్యేలు చాలు అంటే దీని వెనక ఏమి వ్యూహాలు ఉన్నాయని కూడా అంతా అడుగుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ చేసిన నిర్వాకం చూసిన వారు ఆ పార్టీని నిలువునా గోయి తీసి పాతి పెట్టారు. రాష్ట్రాన్ని ఇచ్చిన చోటే కాంగ్రెస్ గెలవడానికి పదేళ్ళు పడితే రాష్ట్రాన్ని ముక్కలు చేసిన చోట గెలుస్తుందని ఎలా అనుకుంటారు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

ఇదే సభలో జగన్ ని ఘాటుగా విమర్శిస్తూ చంద్రబాబుని  తమలపాకుతో కొడుతూ రేవంత్ రెడ్డి చేసిన ఉపన్యాసాన్ని చూసిన వారు ఏపీలో జగన్ గద్దె దిగాలన్న ఆరాటం తప్పించి కాంగ్రెస్ గెలవాలన్న పోరాటం మాత్రం ఎక్కడా లేదు అనే అంటున్నారు.

సీఎం షర్మిల కావాలి అంటున్నపుడు మాత్రం రాజన్న బిడ్డ అమాయకత్వంతోనో  లేక అతి ధీమాతోనో నవ్వుతూ నిలుచున్న సన్నివేశం చూసిన వారికి రాజన్న కొడుకు రాజ్యాన్ని కూల్చేందుకు కంకణం కట్టుకుని ఇవతల అదే కుటుంబం వారిని మునగచెట్టు ఎక్కిస్తున్న తీరే కనిపిస్తోంది అని అంటున్నారు.

Show comments