తెలంగాణలో 'కమలం' చేసేదేమిటి?

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంలో బీజేపీది ప్రధాన పాత్ర. ఆ పార్టీ మద్దతు లేకపోతే తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యేది కాదు. తెలంగాణ ఇచ్చింది తామేనంటూ కాంగ్రెసు చెప్పుకుంటోందిగాని అలా ఇవ్వడానికి దోహదం చేసిన పార్టీ బీజేపీ. బహుశా ఆ హక్కుతోనే కాబోలు తెలంగాణలో తన జెండా పాతాలని కమలం పార్టీ యమ ఆత్రపడుతోంది. రాష్ట్ర బీజేపీ నాయకుల్లో చాలామంది వచ్చే ఎన్నికల్లో కాషాయం పార్టీ గెలవబోతున్నట్లే మాట్లా డుతున్నారు. అధికారం తమదేనేని బల్లగుద్ది చెబుతున్నా రు. తెలంగాణలో అధికారం దక్కడం పెద్ద కష్టం కాదన్నట్లుగా కొందరు మాట్లాడుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నామ జపంతో అధికారం దక్కుతుందని నాయకులు భావిస్తున్నారు. అలాగే తెలంగాణకు అంత సాయం చేశాం, ఇన్ని కోట్లుఇచ్చాం (కేంద్రం) అంటూ మోదీ ఉదారతను ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ విధానాలు, నిర్ణయాలపై కూడా విమర్శలు చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు, పార్టీని బలో పేతం చేసేందుకు, టీఆర్‌ఎస్‌కు బీజేపీని ప్రత్యామ్నాయంగా, గట్టి పోటీదారుగా చిత్రీకరించేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రాష్ట్రానికి వచ్చి హడావుడి చేస్తున్నారు.

ఇదంతా బాగానే ఉంది. కాని ఆయన మాటల్లో పూర్తి స్పష్టత కనబడటంలేదు. తెలంగాణలో స్వతం త్రంగానే  పోటీ చేస్తాం, అధికారం సాధిస్తామని చెప్పిన అమిత్‌ షా మరోసారి 'ఇప్పటికైతే ప్రతిపక్షంగా ఉన్నాం. అధికార టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందా? ఉండదా? అనేది సూక్ష్మస్థాయిలో ఆలోచించాలి' అని సెలవిచ్చారు. స్వతంత్రంగా పోటీ చేస్తామని చెప్పినప్పుడు దానికే కట్టుబడి ఉండకుండా టీఆర్‌ఎస్‌తో పొత్తు విషయం ఎందుకు మాట్లాడారు? ఆయనే గందరగోళంలో ఉంటే పార్టీ శ్రేణు ల్లో అయోమయం నెలకొనదా? అధికారం సాధించడమే లక్ష్యమని చెబుతున్నారు.

అది సాధించాలంటే ఒంటరిగా పోటీ చేయాలి. మరో మార్గం లేదు. టీడీపీతో పొత్తు లేదని ఇదివరకే ప్రకటించారు. మిగతా ఏ పార్టీలూ బీజేపీతో కలవవు. బలం ఉందనుకున్నప్పుడు ఒంటరిగా పోటీ చేసి సత్తా నిరూపించుకోవాలి. కాని అదే సమయంలో పొత్తు గురించి ఆలోచన ఎందుకు? ఒకవేళ టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నారని అనుకుందాం. అప్పుడు అధికారం టీఆర్‌ఎస్‌దే అవుతుం దిగాని బీజేపీది కాదు. కమలం పార్టీ టీఆర్‌ఎస్‌లో భాగ స్వామి (ఏపీలో మాదిరి) కావల్సిందే. పొత్తు పెట్టుకుంటే టీఆర్‌ఎస్‌ కేటాయించిన సీట్లలో పోటీ చేయాల్సివుం టుంది. పొత్తుకు బీజేపీ ఆసక్తి చూపినా టీఆర్‌ఎస్‌ చూపిస్తుందా? అసలు దానికి అంత అవసరముందా? వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ గెలిచి కేసీఆర్‌ సీఎం అవుతాడని ఇప్పటికే కొన్ని  సర్వేల్లో తేలింది.

బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లింల నుంచి వ్యతిరేకత వస్తుంది. వారి ఓటు బ్యాంకు దూరమవుతుంది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్‌ అందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేయించి కేంద్రానికి పంపారు. ఎన్నికల్లోగా ఏదోవిధంగా ఈ హామీ నెరవేర్చాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. ఒకవేళ అది కనుక నెరవేరితే ముస్లింలు కేసీఆర్‌ను దేవుడిలా చూస్తారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం రిజర్వేషన్‌ అటకెక్కుతుంది. ఇక ఎన్నికల ప్రచారంలో బీజేపీ అయోధ్యలో రామమందిర నిర్మాణంపై ప్రచారం చేసే అవకాశముంది. ఇది టీఆర్‌ఎస్‌ను బాగా దెబ్బ తీస్తుంది. కాబట్టి ఏ కోణం నుంచి చూసినా టీఆర్‌ఎస్‌ కమలం పార్టీతో పొత్తుకు మొగ్గు చూపుతుందనుకోలేం.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దాదాపు దేశమంతా అప్పుడే అంటే రెండేళ్ల ముందుగానే ఎన్నికల వాతావరణం ఏర్పడింది. ఇందుకు బీజేపీ వివిధ రాష్ట్రాల్లో సాధించిన విజయాలు, అమిత్‌ షా తన పర్యటనలతో చేస్తున్న హడావుడి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. తెలంగాణలో బీజేపీ ఏం చేస్తుందో ఇంకా స్పష్టత లేదని అమిత్‌ షా స్టేట్‌మెంట్ల ద్వారా అర్థమవుతోంది. 'స్వతంత్రంగా పోటీ చేస్తాం, అధికారం సాధిస్తాం' అని పదేపదే చెప్పడం మైండ్‌ గేమ్‌గా భావించవచ్చు. ఇప్పటివరకు తెలంగాణలో (ఉమ్మడి రాష్ట్రంలో కూడా) బీజేపీకి పట్టు లేదు. ప్రజాదరణ అంతంతమాత్రం.

మోదీ విజయాలను ప్రచారం చేసి ఆ లోపాన్ని అధిగమించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. కమలం పార్టీ టీఆర్‌ఎస్‌పై, ప్రభుత్వ విధానాలపై చేస్తున్న విమర్శలు ప్రజలపై ఎంతమేరకు ప్రభావం చూపుతాయో ఇప్పుడే చెప్పలేం. తనపై వస్తున్న విమర్శలను అధిగమించేందుకు కేసీఆర్‌ కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూ, కొన్ని కేటగిరీల ఉద్యోగులకు జీతాలు పెంచుతూ, వివిధ వర్గాలకు ఆర్థికంగా, ఇతరత్రా ప్రయోజనాలు కల్పిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమిత్‌ షా ఎన్ని మాటలు చెప్పినా పార్టీ విధాన నిర్ణయం తరువాతనే తెలంగాణలో కమలం కార్యాచరణ స్పష్టమవుతుంది.

-మేనా

Show comments