తుగ్లక్‌ డెసిషన్స్‌.. ఇదొక సాక్ష్యం.?

పెద్ద పాత నోట్ల రద్దు 'తుగ్లక్‌ డెసిషన్‌' అనడానికి సుమారుగా 50 ఉదాహరణలు చెప్పొచ్చు. ఎందుకంటే, పెద్ద పాత నోట్లు రద్దు చేసిన తర్వాత గడచిన 50 రోజుల్లో 50కి పైగా సవరణ నిర్ణయాలు తెరపైకొచ్చాయి. పెద్ద పాత నోట్లు చెల్లని చిత్తుకాగితాలనీ, కొన్ని చోట్ల చెల్లుతాయనీ, బ్యాంకుల నుంచి విత్‌ డ్రా పరిమితి పెంపు అనీ, తూచ్‌ అనీ.. ఇలా ఏవేవో తుగ్లక్‌ నిర్ణయాలు ఒకటి కాదు రెండు కాదు.. చాలానే చూశాం. 

తాజాగా, మరో తుగ్లక్‌ నిర్ణయం తెరపైకొచ్చింది. ఈసారి ఆర్డినెన్స్‌ రూపంలో. అది తుగ్లక్‌ నిర్ణయం.. అని ప్రధాని నరేంద్రమోడీకే అన్పించిందేమో, క్యాబినెట్‌ ఆమోదించిన ఆ నిర్ణయంలో చిన్నపాటి మార్పులు చేయక తప్పలేదు. మార్చ్‌ 31 తర్వాత పెద్ద పాత నోట్లను ఎవరైనా కలిగి వుంటే, వారిని జైల్లో తోసెయ్యడానికి వీలుగా ఆర్డినెన్స్‌ని తీసుకురావాలనుకున్నారు. దీనికి క్యాబినెట్‌ ఆమోద ముద్ర కూడా వేసింది. కానీ, చివరి నిమిషంలో అందులో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. 'అరెస్ట్‌ - జైలు శిక్ష' అనే అంశాల్ని అందులోంచి తొలగించారు. జరీమానా మాత్రం యధాతథం. 

కరెన్సీ నోటు అంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. అదొక బాండ్‌ పేపర్‌. రిజర్వు బ్యాంకు గవర్నర్‌ సంతకం చేసిన బాండ్‌ పేపర్‌ అది. చదువుకున్నోడెవడికైనాసరే, కరెన్సీ నోటు అంటే ఏంటో అర్థమవుతుంది. దురదృష్టవశాత్తూ కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అంత జ్ఞానం వున్నట్లు కన్పించడంలేదు. అందుకే, ఆ బాండ్‌ని చిత్తుకాగితంగా లైట్‌ తీసుకున్నారు. కేంద్రం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే అధికారం కలిగి వుండొచ్చుగాక.. కానీ, ప్రజల జీవితాలతో చెలగాటమాడాలనుకుంటే ఎలా.? 

మొత్తమ్మీద, తాము తీసుకుంటున్న తుగ్లక్‌ నిర్ణయాలని ఇప్పటికైనా కేంద్రం పరోక్షంగా అంగీకరించినట్లయ్యిందన్నమాట.! అన్నట్టు, ఆర్డినెన్స్‌ మీద రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోద ముద్ర వేశాక, అది అమల్లోకి వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.

Show comments