ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ పాట పాడుతున్నారు. ఏమని? 'రారండోయ్...రారండోయ్ ఆంధ్రుల్లారా రారండోయ్..హైదరాబాదులో చాలునింక మీ ఆటలు..మీ పాటలు'..అంటూ రేడియోలో బాలానందం గీతంలా పాడుతుంటే, తెలంగాణలో, ప్రధానంగా హైదరాబాదులో స్థిరపడిపోయిన ఆంధ్రులు ఓ మంచి పాట పాడుతున్నారు. వారేమంటున్నారు? 'హైదరాబాద్ వదిలి మేము రాములే...ఇదే మా ఊరులే..ఆంధ్రాలో మాకేమి ఉందిలే..ఉందిలే'..అని హుషారుగా ఆలపిస్తున్నారు. ఈ పాటల గోలేమిటి? అనుకుంటున్నారు కదూ...! ఇది 'స్థానికత'కు (నేటివిటీ) సంబంధించిన అంశం. తెలంగాణలో (ప్రధానంగా హైదరాబాదు) స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలు 2017 జూన్ 2వ తేదీ నాటికి ఆంధ్రాకు వచ్చి స్థిరపడితే వారికి ఆ రాష్ట్రంలో 'స్థానికత' వస్తుంది. స్థానికత ఉన్నవారికి ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో ప్రాధాన్యం లభిస్తుంది. తెలంగాణలో ఉన్న ఆంధ్రులే కాదు, పక్కా తెలంగాణవారు కూడా ఇష్టమైతే ఆంధ్రాకు వెళ్లి స్థిరపడినా వారికి కూడా నేటివిటీ లభిస్తుంది. తెలంగాణవారు పిలిచినా వెళ్లరనుకోండి. అది వేరే విషయం.
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఆంధ్రులు ఉన్నప్పటికీ లక్షలాదిమంది రాజధాని హైదరాబాదులో స్థిరపడ్డారు. వారు వచ్చి ఆంధ్రాలో స్థిరపడాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. స్థానికత తీసుకోవడమనేది ఐచ్ఛిక విషయం. వారి ఇష్టమైతే వెళ్లొచ్చు. లేకపోతే లేదు. 2017 జూన్ 2వ తేదీ నాటికి ఆంధ్రాలో స్థానికత పొందడానికిగాను ప్రభుత్వం 2014లోనే ఉత్తర్వులిచ్చింది. అంటే రాష్ట్ర విభజన జరగ్గానే స్థానికతకు అవకాశం కల్పించిందన్నమాట. కాని ఇప్పటివరకు 830 మంది మాత్రమే స్థానికత తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణలో లక్షలాది మంది ఆంధ్రులు ఉండగా అందులో ఈ సంఖ్య ఎంత? గత మూడేళ్లలో కనీసం వెయ్యిమంది కూడా ఆంధ్రాకు వెళ్లి స్థిరపడటానికి ఆసక్తి చూపలేదని అర్థమవుతోంది. 1947లో దేశం భారత్-పాకిస్తాన్‌గా విడిపోయినప్పుడు లక్షలాది మంది ప్రజలు ఇటు నుంచి అటు వెళ్లారు. అటు నుంచి ఇటు వచ్చారు.
ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు తక్కువ. కాబట్టి కిక్కిరిసిపోయిన రైళ్లలో, ఎడ్ల బండ్ల మీద, కాలి నడకన ఇష్టమైన దేశాలకు వెళ్లారు. కొందరు ప్రముఖుల పుస్తకాల్లో ఈ ఘటనలు చదువుతుంటే మనసు భారమై ఆనాటి పరిస్థితి ఇంత భయంకరంగా ఉందా అనిపిస్తుంది. కాని అంతటి భావోద్వేగాలు, సెంటిమెంటు ఇప్పుడు లేవు. హైదరాబాదులో స్థిరపడిన ఆంధ్రులకు ఆంధ్రాలోని తమ ప్రాంతాలపట్ల ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ అక్కడికెళ్లి ఏం చేయాలి? అనే ప్రశ్న వేసుకుంటున్నారు. హైదరాబాదులా సకల సౌకర్యాలతో, ఉపాధి అవకాశాలతో, విద్యా కేంద్రాలతో, అత్యాధునిక ఆస్పత్రులు వగైరా సౌకర్యాలతో ఉన్న నగరం ఆంధ్రాలో లేదు. అసలు రాజధానే లేదు. కొన్ని తరాల కిందట హైదరాబాదులో, తెలంగాణ జిల్లాల్లో స్థిరపడినవారిలో చాలామంది ఆంధ్రాలో ఉన్న ఆస్తులు కూడా అమ్ముకున్నారు. ఎప్పుడో వచ్చి స్థిరపడిన పెద్దవారికి సొంత రాష్ట్రంపై మమకారం ఉన్నా హైదరాబాదులోనే పుట్టి పెరిగి, ఇక్కడే చదవుకొని, ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి ఆంధ్రా మీద అసలు మోజు ఉండే అవకాశం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా వెళ్లారు. కాని ప్రయివేటు కంపెనీల్లో పనిచేసేవారికి, వ్యాపారులకు ఆంధ్రాకు వెళ్లి స్థిరపడాల్సిన అవసరం ఏముంటుంది? దేశం విడిపోయినప్పుడు సెంటిమెంట్ పనిచేసింది. కాని ఇప్పుడు ఉపాధి ఎక్కడ ఉంటే అదే మన సొంత రాష్ట్రమనే భావన ఉంది. మెరుగైన జీవితమే ఇప్పటి ప్రజల లక్ష్యం.
దశాబ్దాలుగా హైదరాబాదులో పనిచేసిన ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు భారమైన హృదయాలతో రాజధాని ప్రాంతానికి (అమరావతి) తరలివెళ్లారు. ఉద్యోగినులు తమ తోటి తెలంగాణ ఉద్యోగినులను కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి పరిస్థితీ ఇదే. ఉద్యమం సమయంలో రెండు ప్రాంతాల ఉద్యోగులు హోరాహోరీగా పోరాడినా విభజన తరువాత అదంతా ముగిసిపోయిన కథ. రెండు ప్రాంతాల ఉద్యోగుల మధ్య సహజంగా ఉన్నా స్నేహభావం, ప్రేమాభిమానాలు చనిపోలేదు.
అందుకే ఆంధ్రా ఉద్యోగులు బస్సుల్లో, రైళ్లలో ఆంధ్రా ప్రాంతానికి వెళ్లిపోతుంటే తెలంగాణవారు కన్నీటితో వీడ్కోలు పలికారు. హైదరాబాదులోని ఆంధ్రా ఉద్యోగులు రాజధాని ప్రాంతానికి తరలడానికి ఎన్ని మల్లగుల్లాలు పడ్డారో, ఎంత తర్జనభర్జన జరిగిందో, ప్రభుత్వానికి ఎన్ని షరతులు పెట్టారో, ఎన్ని రాయితీలు, సౌకర్యాలు డిమాండ్ చేశారో తెలిసిందే. చాలామంది ఉద్యోగుల పిల్లలు నగరంలో పుట్టి పెరిగి, చదువుకున్నవారే. ఇంకా చదువుకుంటున్నవారున్నారు. చదవులు ముగించినవారు ఉద్యోగాలు చేస్తున్నారు. ఆంధ్రాకు తరలివెళ్లిన ఉద్యోగుల్లో అనేకమందికి హైదరాబాదులో సొంత ఇళ్లున్నాయి. ఇళ్ల స్థలాలు, ఇతర ఆస్తిపాస్తులున్నాయి. వివాహాల రీత్యా సంబంధబాంధవ్యాలున్నాయి. నగరంతో దశాబ్దాలుగా ఉన్న అనుబంధం తెంచుకోవడం సులభం కాదు. ఇందుకు ఇంకా కొన్ని తరాలు పడుతుంది.