వందేళ్ల పాలనా?...చిన్నమ్మా సరిపోతుందా?

ఆశకు అంతు ఉండాలి అంటారు పెద్దలు. ఆశకు అంతుండాల్సింది సామాన్యులకే కాదు అసామాన్యులమని భావించుకుంటున్న రాజకీయ నాయకులకు కూడా. కాని వారికి ఆ సోయి ఉండదు కదా. వారి ఆశలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. అధికారంలోకి వచ్చిన పార్టీ కొన్ని దశాబ్దాలపాటు తానే అధికారంలో ఉండాలనుకుంటుంది. కొందరు పార్టీల అధినేతలు తరతరాలుగా తామే అధికారంలో (ముఖ్యమంత్రులుగా, ప్రధాన మంత్రులుగా) ఉండాలనుకుంటారు. ఈమధ్య ఈ ధోరణి మరీ ఎక్కువైంది. కేసీఆర్‌, చంద్రబాబు నాయుడు మరో ముప్పయేళ్లు అధికారంలో ఉండాలనుకుంటున్నారు. తప్పనిసరిగా ఉంటారని పార్టీ నాయకులు చెబుతున్నారు. అంటే వందేళ్ల వయసు వచ్చేవరకన్నమాట....! తమిళనాడులోని అధికార అన్నాడీఎంకేకు కొత్తగా ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన దివంగత జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళా నటరాజన్‌ కోరిక కూడా ఇదే. ఆమె ఇంకా ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి తాను వందేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని అనలేదు. 'అమ్మ మనతో లేరు. అయినప్పటికీ మన పార్టీ మరో వందేళ్లు అధికారంలో ఉండాలి' అని చిన్నమ్మ తన చిన్న కోరికను వెలిబుచ్చారు. ఒకవేళ ముఖ్యమంత్రి  అయితే జీవితాంతం తానే ఈ పదవిలో ఉంటానని అంటుందేమో...!  

అనుకున్న తేదీ కంటే ముందే ఆమె ఈరోజు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించింది. మొట్టమొదటిసారిగా గొంతు విప్పి మాట్లాడింది. జయలలితతో మూడు దశాబ్దాలకు పైగా స్నేహం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎక్కడా బహిరంగంగా మాట్లాడింది లేదు. భగవంతుడు జయలలితను తన ప్రియమైన బిడ్డగా భావించారని చెప్పింది. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్‌ శత జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా ఘనంగా నిర్వహిస్తామని శశికళ ప్రకటించింది. 

ఈ సందర్భంగా ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని రెండు డిమాండ్లు చేసింది. ఎంజీఆర్‌ శత జయంతి ఉత్సవాల సందర్భంగా స్టాంపు విడుదల చేయాలని, సారక నాణేన్ని విడుదల చేయాలని కోరింది. మొన్న జయలలిత విషయంలోనూ అన్నా డీఎంకే అనేక గొంతెమ్మ కోరికలు కోరింది. వాటికి ఇవి అదనం. జయకు దేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్న ప్రదానం చేయాలని, పార్లమెంటులో ఆమె విగ్రహం పెట్టాలని అన్నా డీఎంకే డిమాండ్‌ చేసింది. అంతేకాకుండా జయలలిత జన్మదినోత్సవాన్ని 'జాతీయ రైతుల దినోత్సవం'గా ప్రకటించాలని,   'నోబెల్‌ శాంతి బహుమతి' ఇవ్వాలని, రామన్‌ మెగసేసే అవార్డు ప్రదానం చేయాలని తీర్మానించారు. 

సరే...ఇదిలా ఉంటే శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడాన్ని సవాలు చేస్తూ రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఉత్తర్వులు రిజర్వులో పెట్టారు. శశికళను ఎంపిక చేయడం చెల్లదని తీర్పు చెబితే దిగిపోవల్సిందే. పార్టీ రాజ్యాంగం ప్రకారం జనరల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. ప్రధాన కార్యదర్శి  పదవికి పోటీ చేయాలంటే ఐదేళ్ల సభ్యత్వం పూర్తయివుండాలి. అదే ప్రధాన అర్హత. 

కాని శశికళకు ఐదేళ్ల సభ్యత్వం లేదు. మధ్యలో జయకు శశికళతో విభేదాలు వచ్చినప్పుడు ఆమెను తన ఇంటి నుంచి వెళ్లగొట్టడమే కాకుండా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచే బహిష్కరించారు. కొంతకాలానికి స్నేహం కుదిరాక చేరదీశారు. పార్టీ సభ్యత్వమిచ్చారు. కాని మధ్యలో సభ్యత్వం రద్దు కారణంగా గ్యాప్‌ వచ్చింది. ఐదేళ్ల సభ్యత్వం పూర్తయ్యేందుకు మరో మూడు నెలల సమయముంది. ఈ కారణంగా ఆమె ఎన్నికయ్యే అవకాశం లేదు కాబట్టి ప్రధాన కార్యదర్శిగా 'నియమాకం' జరిగింది. మూడు నెలల తరువాత మళ్లీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటారు. ఇలా ఎంపిక చేయడం పార్టీ నిబంధనావళికి విరుద్ధమంటూ శశికళ పుష్ప హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రధాన కార్యదర్శిని 'నామినేట్‌' చేయొచ్చనే అంశం పార్టీ రాజ్యాంగంలో అసలు లేదని శశికళ పుష్ప వాదించింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం జోక్యం చేసుకోదు. న్యాయస్థానం తేల్చాల్సిందే. 

Show comments