అప్పుడు పకడ్బందీగా...ఇప్పుడు గందరగోళంగా...!

ఇప్పటివరకు దేశాన్ని పరిపాలించిన ప్రధానుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో ప్రత్యేకత చూపించినవారే. అందరు ప్రధానుల్లో ప్లస్‌ పాయింట్లున్నాయి. మైనస్‌ పాయింట్లున్నాయి. ఇది సహజమే. వ్యక్తిగతంగా ఎన్నో ఆశయాలు, లక్ష్యాలున్నా పదవిలోకి వచ్చేసరికి  అనుకున్నవన్నీ సాకారం చేయడం సాధ్యం కాదు. ప్రధాని పదవిలో ఉన్న నాయకుడు అనేక విషయాల్లో విఫలమవుతుంటాడు. ప్రతిపక్షాల, ప్రజల నిందలు భరించాల్సివస్తుంది. కాని పదవీ కాలం ముగిసేలోగా ఏదో విషయంలో ధైర్యంగా వ్యవహరిస్తుంటారు. అలా చెయ్యకపోతే చెప్పుకోవడానికి చరిత్ర ఉండదు. 

అలా ధైర్యంగా చేసిన పని దేశం మీద అనుకూల ప్రభావం చూపించవచ్చు లేదా ప్రతికూల ప్రభావమూ చూపించవచ్చు. ఆ పని ఫలితం ఎలా ఉంటుందనేది అప్పటి దేశ, కాల పరిస్థితుల మీద, జాతీయ, అంతర్జాతీయ పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది. తొలి ప్రధాని నెహ్రూను నవ భారత నిర్మాతగా చెబుతారు. ఈయన ఖాతాలో వైఫల్యాలు ఉన్నప్పటికీ దేశానికి దిశా నిర్దేశం చేశారనే పేరుంది. ఇందిరాగాంధీకి అత్యవవసర పరిస్థితి మచ్చ ఉన్నా రాజాభరణాల రద్దు, భ్యాంకుల జాతీయీకరణ, బంగ్లాదేశ్‌ విముక్తి...ఇలా కొన్ని విజయాలున్నాయి. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలను అమలు చేసి దేశాన్ని నవ శకంలోకి నడిపించిన ప్రధానిగా పీవీ నరసింహారావును జనం తలచుకుంటున్నారు. 

ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. అందరు ప్రధానుల విజయాలను గురించి చెప్పుకోవాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది. ప్రస్తుతం ఇద్దరు ప్రధానుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక విషయంలో వారిద్దరూ అత్యంత ధైర్యంగా వ్యవహరించారు. గట్స్‌ ఉన్న ప్రధానులనిపించుకున్నారు. వారే...మొరార్జీ దేశాయ్‌, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ. ఇద్దరూ ధైర్యంగా చేసిన పని పెద్ద నోట్లను రద్దు చేయడం. ఇద్దరి మధ్య ఉన్న మరో పోలిక ఇద్దరూ నాన్‌ కాంగ్రెసు ప్రధానులు. ఇద్దరూ గుజరాత్‌ రాష్ట్రానికి చెందినవారు. కాకపోతే ప్రస్తుతం మోదీ యూపీలోని వారణాశి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారనుకోండి.  

1978లో మొరార్జీ దేశాయ్‌ పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు దేశం పరిస్థితి వేరు. ఇప్పుడు వేరు. దోమకు, ఏనుగుకు ఉన్నంత తేడా ఉంది. ఆనాడు దేశాభివృద్ధి తక్కువే.  నల్లధనమూ తక్కువే. వస్తూత్పత్తి, ప్రజల కొనుగోలు శక్తి, డబ్బు చెలామణి...ఇలా అన్నీ తక్కువే.  అప్పట్లో దేశాయ్‌ వెయ్యి, ఐదు వేలు, పది వేల నోట్లు రద్దు చేశారు. ఇప్పుడు అవినీతి, నల్లధనం సహా అన్నీ పెరిగాయి. ఆ కాలంలో ఐదు వేలు, పది వేలు నోట్లు చూడటమే అపురూపంగా ఉంటే, ఇప్పుడు 500, వెయ్యి నోట్లు అత్యంత సాధారణమైపోయాయి. చెలామణిలో 86 శాతం ఇవే ఉన్నాయంటున్నారు. 

Readmore!

అప్పట్లో మొరార్జీ, ఇప్పుడు మోదీ లక్ష్యాలు మంచివే. కాని విశ్లేషకులు చెబుతున్న, మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం చూస్తే మొరార్జీ సర్కారు (జనతా పార్టీ ప్రభుత్వం) నోట్ల రద్దును, తరువాత మార్పిడిని పకడ్బందీగా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇప్పటి ఇబ్బందులు చూస్తూనే ఉన్నాం. మొరార్జీ కేంద్రంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటి నుంచే నల్ల కుబేరుల పనిపట్టాలని నిర్ణయించుకున్నారు. వాంఛూ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ నివేదికను తాను ప్రధాని అయ్యాక అమలు (నోట్ల రద్దు) చేశారు. అప్పుడు కూడా రద్దు నిర్ణయాన్ని హఠాత్తుగా ప్రకటించి దేశానికి షాక్‌ ఇచ్చారు. రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ద్వారా అర్థరాత్రి ఆర్డినెన్స్‌ విడుదల చేయించారు. 1

978 జనవరి 16 అర్థరాత్రి రద్దు ప్రకటన చేసి తెల్లవారి బ్యాంకులకు, ట్రెజరీ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. అప్పట్లో ఏటీఎంలు లేవు. రేడియో, కొద్ది పత్రికలు మినహా వెయ్యి కాళ్ల జెర్రి వంటి మీడియా లేదు. నోట్ల మార్పిడికి కేవలం రెండు రోజులే అవకాశమిచ్చారు. అయినప్పటికీ ప్రజలు ఇబ్బందులు పడకుండా పకడ్బందీగా జరిగిందని అప్పటి మీడియా కథనాలు తెలియచేస్తున్నాయి. వాస్తవానికి ఆ కాలంలో ధనికుల దగ్గర తప్ప ఇతర వర్గాల దగ్గర డబ్బు లేదు. పెద్ద నోట్లు అసలే లేవు. ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు దయనీయంగా ఉండేవారు. అప్పటి సర్కారు చిన్న నోట్ల సరఫరా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి అవసరమైన చర్యలు తీసుకుందట. 

అప్పట్లో ఎలాంటి ఆర్థిక సంక్షోభం తలెత్తలేదని చెబుతున్నారు. మొరార్జీ హయాం నాటికంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పెరిగిందని, డబ్బు ఎక్కువైందని అందుకే ఇబ్బందులొచ్చాయని కొందరు అనొచ్చు. కాని అసలు విషయం మోదీ సర్కారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా అనాలోచితంగా నోట్లు రద్దు చేయడమే సంక్షోభానికి కారణం. ఇద్దరు ప్రధానులు దైర్యంగా నిర్ణయం తీసుకున్నా అమలు విషయంలో మోదీ కంటే మొరార్జీయే బెటర్‌గా వ్యవహరించారనుకోవాలి. నోట్లు రద్దు చేసినా తరువాత మొరార్జీ మళ్లీ ప్రధాని కాలేదు. మరి మోదీ పరిస్థితి ఏమిటో....!

Show comments