మూడేళ్ళు.. రెండు రాష్ట్రాలు.. ఒకటే రాజకీయం!

తెలుగు రాష్ట్రాలు విజయవంతంగా మూడేళ్ళ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాయి. కొత్త పేరుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే, పాత పేరుతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడింది సరిగ్గా మూడేళ్ళ క్రితం, జూన్‌ 2న. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన 'ఉమ్మడి రాష్ట్ర ప్రస్థానం' 2014లో 'ముక్కలయిపోయింది'.! కారణాలేవై తేనేం, రెండు తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి వేరుపడ్డాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కల కాదు, నిజమయ్యింది. ఆరు దశాబ్దాల పోరాటం విజయ తీరాలకు చేరింది. అదే సమయంలో, వద్దనుకున్న విభజన బలవంతంగా ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధికి దూరంగా విసిరేసింది.

ఈ పాపం ఎవరిది.? అన్న ప్రశ్నకి 'అందరూ ఆ పాపంలో భాగస్వాములే' అన్న సమాధానం వస్తుంది. గతం గతః గతాన్ని వెనక్కి తీసుకురాలేం. ఇప్పుడు ఆలో చించాల్సింది భవిష్యత్తు గురించే. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాలు ఒకే 'జాతి'గా ముందడుగు వేస్తే, మునుపటి కంటే ఘనంగా తెలుగు కీర్తి దశదిశలా వ్యాప్తిచెందుతుం దన్నది నిర్వివాదాంశం. ఇంతకీ, గడచిన మూడేళ్ళలో తెలుగు రాష్ట్రాలు ఏం సాధించాయి.? అన్న ప్రశ్నకి, ముందుగా రాజకీయ కోణంలో సమాధానం చెప్పాల్సి వుంటుంది. అత్యంత హేయంగా తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపుల పర్వం నడుస్తోంది.

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారంతో పోల్చిన ఏపీ సిఎం చంద్రబాబు, అదే రాజకీయ వ్యభిచారాన్ని తన రాష్ట్రంలోనూ ప్రోత్సహించారు. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కి ఎలా మంత్రి పదవి ఇస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. కానీ, వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అఖిలప్రియ, అమర్‌నాథ్‌రెడ్డి తదితరులకు చంద్రబాబు తన క్యాబినెట్‌లో అవకాశం కల్పించారు. అదే మరి, రాజకీయం అంటే.

తెలుగు రాష్ట్రాల్లోని పాలకులు అభివృద్ధి కంటే, రాజకీయంపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? అటు చంద్రబాబుకి అయినా, ఇటు కేసీఆర్‌కి అయినా 2014 ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ దక్కింది. సీఎంలుగా ఐదేళ్ళు కొనసాగేందుకు వీలుగా ప్రజలు అధికారం కట్టబెట్టాక, పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించాల్సిన అవసరమేముంది.? ఇక్కడ మేటర్‌ క్లియర్‌.. ఇద్దరు చంద్రులదీ అభత్రాభావమే. విపక్షాలు బలపడితే, రాజకీయంగా తమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుందనే భావనలో ఇద్దరూ పార్టీ ఫిరాయింపుల్ని పెంచి పోషించారు.

ఏ పార్టీకి ఎంత బలం వుంది.? అన్నది, ఐదేళ్ళకోసారి ఎన్నికలొచ్చినప్పుడు ప్రజలే నిర్ణయి స్తారు. అప్పటిదాకా, అధికారం కారణంగా ఏర్పడ్డ 'వాపు' ని చూసి ఏ రాజకీయ పార్టీ అయినాసరే మురిసిపోవా ల్సిందే. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. కేంద్రం నుంచి రావాల్సిన స్థాయిలో నిధులు రాలేదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెబుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుదీ ఇదే మాట. అయితే, చంద్రబాబు - బీజేపీతో వున్న సాన్ని హిత్యం కారణంగా సుత్తిమెత్తని వ్యాఖ్యలు చేస్తున్నారంతే. రెండు రాష్ట్రాలకీ కేంద్రం నుంచి అందాల్సిన స్థాయిలో సాయం అందనప్పుడు, కేంద్రాన్ని ఇద్దరూ ఎందుకు గట్టిగా ప్రశ్నించడంలేదు.?

ఈ ఒక్క ప్రశ్న చాలు, ఇరు రాష్ట్రాల్నీ ఇద్దరు చంద్రులు ఎంత గొప్పగా పరిపాలిం చేస్తున్నారో చెప్పడానికి.! పెద్ద పాతనోట్లరద్దు వ్యవ హారంలో అయినా, పెట్రో ధరల విషయంలో అయినా, ఇతరత్రా అనేక విషయాల్లో అయినా కేంద్రాన్ని ప్రశ్నిం చడమంటే చాలు, ఇద్దరు చంద్రులూ బెంబేలెత్తిపోతున్నారంతే. పైగా ఒకరితో ఒకరు పోటీ పడి, ప్రధాని మోడీకి మద్దతిచ్చేస్తున్నారు. ముంపు మండలాల్ని దోచుకుపోయారని కేసీఆర్‌, గుర్తుకొచ్చినప్పుడల్లా బీజేపీని విమర్శిస్తుంటారు. అదే ప్రశ్న, సూటిగా ప్రధాని మోడీకి మాత్రం వేయలేరాయన.

ఎందుకంటే, మోడీ ఉత్తమోత్త ముడు కేసీఆర్‌ దృష్టిలో. మరి, ముంపు మండలాలు ఎలా ఏపీకి వెళ్ళినట్లు.? ఇదే ముంపు మండలాల్ని రాబట్టుకో వడంలో ఎంతో కష్టపడాల్సి వచ్చిందనీ, అవి రాకపోతే ముఖ్యమంత్రి పదవి చేపట్టబోనని నరేంద్రమోడీకి చెప్పాననీ చెప్పుకుంటారు చంద్రబాబు. ఇదే తరహా డిమాండ్‌, ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఎందుకు చేయరు.? 'బొచ్చె'లో వేసినదాంతోనే ఇద్దరు ముఖ్యమంత్రులూ సంతృప్తి చెందుతున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.!

రెండు రాష్ట్రాల మధ్య జల జగడాల్ని కేంద్రం తీర్చలేకపోయినా, కేంద్రాన్ని ఆ విషయంలోనూ ప్రశ్నించలేకపోతున్న చంద్రబాబు, కేసీఆర్‌.. గల్లీలో (రాష్ట్రాల స్థాయిలో) మాత్రం ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య తగాదాలు ఎవరికీ శ్రేయస్కరం కాదనే మాట అప్పుడప్పుడూ ఇద్దరు చెబుతుంటారు.. కానీ, వాళ్ళే ఆ విషయాన్ని అర్థం చేసుకోరు. ఎందుకు అర్థం చేసుకోరంటే, ఎవరి రాజకీయ అవసరాలు వాళ్ళవి. రాజకీయం కంటే ప్రజలు ముఖ్యం కాని పాలకులు రాజ్యమేలుతున్న రోజులివి.

Show comments