టర్కీకి... ఏపీకి పోలిక ఏమిటి?

మన తెలుగు సినిమా రంగంలో ఉన్నంతమంది హాస్య నటులు మరే భాషలోనూ లేరని చెబుతుంటారు. అలాగే మన తెలుగు రాజకీయాల్లో ఉన్నంతమంది హాస్య రాజకీయ నాయకులు మరే రాష్ట్రంలోనూ ఉండరేమోనని అనుమానంగా ఉంది. ఉన్నా ఉండొచ్చు చెప్పలేం...! ప్రత్యర్థి పార్టీలపై, అపోజిషన్‌ నాయకులపై వీరి విమర్శలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. అందులోనూ పాలకుల విమర్శలు వారి అజ్ఞానాన్ని, రాజకీయ పైశాచికత్వాన్ని బయటపెడుతుంటాయి. వీళ్లకు పోలికలు చెప్పడం రాదు. సరైన రీతిలో విమర్శించడం తెలియదు. 

ప్రజాస్వామ్యంలో విధానాలపై విమర్శించడం సముచితంగా ఉంటుందిగాని వ్యక్తిగతంగా బూతులు తిట్టుకుంటే చీప్‌గా ఉంటుంది. కాని మన నాయకులంతా నాటు, మోటు, ఘాటు. ప్రతి రాజకీయ పార్టీలోనూ అజ్ఞాన నాయకులు అనేకమంది ఉన్నారు. ఇలాంటివారిలో అధికారంలో ఉన్నవారు రెండాకులు ఎక్కువే చదువుకొనివుంటారు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, టీడీపీ  అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ను తీవ్రంగా విమర్శించారు. టీడీపీ నాయకులు జగన్‌ను రోజూ విమర్శిస్తూనే ఉంటారు. ఇది కొత్త విషయం కాదు కదా...!  

విమర్శించడం కొత్త కాదు. కాని వారి అజ్ఞానం ఎలా ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. జగన్‌ ఎన్ని గడపలు తొక్కినా, ఎన్ని యాత్రలు చేసినా ఈ జన్మకు ముఖ్యమంత్రి కాలేడని పల్లె అన్నారు. సీఎం పదవి కోసం ఆయన పగటి కలలు కంటున్నారని, కాని చైతన్యవంతులైన ప్రజలు బుద్ధి చెబుతారని మండిపడ్డారు. సరే...ఇదంతా రొటీనే. జగన్‌ అసమర్థుడు, అవినీతిపరుడని, ఆయన అధికారంలోకి రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందనే ఉద్దేశంతోనే ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఇదంతా పాత విషయమే. కాని భవిష్యత్తులో ఎంపీ, ఎమ్మెల్యే కూడా కాలేడన్నారు. ఇది అతిశయోక్తిగా ఉంది. 

అవినీతి ఆరోపణలు రాకముందే కాదు వచ్చాక, జైలుకు వెళ్లాక కూడా ప్రజాప్రతినిధి అయ్యాడు కదా. 67 స్థానాలతో ఆయన పార్టీ బలమైన ప్రతిపక్షంగా నిలిచింది కదా.  ఇక డొక్కా మాణిక్య వరప్రసాద్‌  ఓ డైలాగ్‌ కొట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన బాబు ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రయత్నిస్తే టర్కీలో అక్కడి ప్రజలు సైనిక తిరుగుబాటుదారులకు బుద్ధి చెప్పినట్లుగా ఏపీ ప్రజలు జగన్‌కు బుద్ధి చెబుతారని అన్నారు. ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల ఎంతటి గౌరవం ఉందో టర్కీని చూసి తెలుసుకోవాలన్నారు.  Readmore!

అసలు టర్కీ సైనిక తిరుగుబాటుకు, ఏపీలో ప్రజలు జగన్‌కు బుద్ధి చెప్పడానికి సంబంధం ఏమిటి? అర్థంపర్ధం లేని ఈ పోలిక ఏమిటి? అక్కడ ప్రభుత్వాన్ని కూలదోయాలని సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటు చేసి రోడ్ల మీదకు వచ్చింది. ప్రజలు ఆ తిరుగుబాటుదారులను రోడ్ల మీదనే ఎదుర్కొని ప్రాణాలకు తెగించి పోరాడారు. అది బహిరంగంగా జరిగిన యుద్ధం. ఆ ఘటనను ఏపీకి అన్వయించి మాట్లాడటం హాస్యాస్పదంగా లేదా? ప్రభుత్వాన్ని కూలగొడతానని జగన్‌ గతంలో అన్నారు. ఎలా? టీడీపీ నుంచి కొందరు వైసీపీలోకి ఫిరాయిస్తారని, దాంతో బాబు సర్కారు కూలిపోతుందని చెప్పిన మాట వాస్తవమే. 

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఇలాగే కూలిపోతాయిగాని టర్కీలో మాదిరిగా యుద్ధ ట్యాంకులతో, తుపాకులతో రోడ్ల మీదకు వచ్చి స్వైరవిహారం చేయరు. వీధి పోరాటాలు జరగవు. జగన్‌ పార్టీ నుంచి ఇరవైమంది వరకు అధికార పార్టీలోకి ఫిరాయించడంతో ఆయన బలం క్షీణించింది. ఈ స్థితిలో ఆయన ప్రభుత్వాన్న కూలగొట్టగలడా? ఆ పరిస్థితి ఎలా వస్తుంది? డొక్కా మరో మాటన్నారు. ఏడాది తరువాత ఎన్నికలొస్తాయని, ఆ తరువాత తానే సీఎంను అవుతానని జగన్‌ పదేపదే చెబుతున్నారని, ఇలా చెప్పడం రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని అన్నారు. 

సీఎం కావాలని చంద్రబాబు అనుకున్నట్లే జగన్‌ అనుకుంటున్నారు. ఇందులో రాజ్యాంగాన్ని అవమానించడం ఏముంది? ముప్పయ్‌ఏళ్లపాటు చంద్రబాబే సీఎంగా ఉంటారని ఆయన వందిమాగధులు చెబుతున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? విమర్శలు టీడీపీవారు చేసినా, వైసీపీవారు చేసినా సహేతుకంగా ఉండాలి. వైకాపా నాయకులు కూడా విధానాలపై, సర్కారు ప్రజావ్యతిరేక చర్యలు విమర్శలు చేయాలిగాని వ్యక్తిగత దూషణలు చేయకూడదు. నగరి ఎమ్మెల్యే రోజాకు ఈ లక్షణం బాగా ఉంది. ఒకరు ఏ పని చేస్తే మరొకరు అదే పని చేస్తారు. కాబట్టి రాజకీయ నాయకులు సంయమనం పాటిస్తూనే ఘాటైన విమర్శలు చేయొచ్చు. ఆ పని చేతకాక మోటుగా వ్యవహరిస్తున్నారు.  

Show comments