చింకారా.. బ్లాక్ బక్.. కృష్ణ జింక.. పేరేదైతేనేం, వన్మమృగాల్ని వేటాడిన నేరంలో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కి శిక్ష పడింది. అయితే, ఈ కేసులో అతను నిర్దోషి అని కూడా ఇటీవలే తేలింది. నేరము - శిక్ష అంటే ఏంటి.? నేరం జరిగింది, శిక్ష పడింది. నిందితుడు, నేరస్తుడయ్యాడు. నేరస్తుడేమో, నిర్దోషి అయ్యాడు. ఏంటీ మతలబు.? ఇదే చాలాకాలంగా ఎవరికీ అర్థం కాని ప్రశ్న.
కృష్ణ జింక చంపబడింది నిజం. సల్మాన్‌ఖాన్ అండ్ టీమ్ ఆ కృష్ణ జింకని వేటాడింది నిజం. కానీ, ఇక్కడ సాక్ష్యమే దొరకలేదు. అంతే, కేసు నీరుగారిపోయింది. నేనే ప్రత్యక్ష సాక్షిని మొర్రో.. అంటూ ప్రత్యక్ష సాక్షి మీడియా ముందుకొచ్చినా ఉపయోగం లేదు. అతన్ని భయపెట్టారు, కోర్టుదాకా వెళ్ళనీయకుండా చేశారు. ఇదీ 'మేనేజ్‌మెంట్' అంటే. న్యాయస్థానానికి కావాల్సింది సాక్ష్యం మాత్రమే.
సల్మాన్‌ఖాన్‌కి ఇలాంటివి కొత్తేమీ కాదు. తప్పతాగి, ఇష్టమొచ్చినట్లుగా వాహనాన్ని నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన కేసులోనూ సల్మాన్‌ఖాన్‌ది ఇదే పరిస్థితి. నేరం జరిగిపోయింది. ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సల్మాన్‌ఖాన్ నిందితుడి నుంచి దోషిగా ప్రమోట్ అయ్యాడు. చివరికి నిర్దోషిగా తేలాడు. అసలేం జరుగుతోంది దేశంలో.? ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా.. అని సరిపెట్టేసుకుందామా.?
న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల్ని ప్రశ్నించకూడదు. కానీ, ఆ తీర్పులు మాత్రం ఒక్కోసారి ఒక్కోలా వుండొచ్చు. ఇదెక్కడి న్యాయం.? రాజస్థాన్ ప్రభుత్వం తీరిగ్గా, సల్మాన్‌ఖాన్‌పై కోర్టుకు వెళ్ళిందిప్పుడు. ఇన్నాళ్ళూ ఏం చేసిందట.? అనడక్కండి. అదంతే. వ్యవస్థలోని ఈ లోపాలే, న్యాయవ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయి.
ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుందట.? రాజస్థాన్ ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించినా, సల్మాన్‌ఖాన్ దోషి అని తేలినా, ఆ తర్వాత ఇంకో కోర్టుని ఆశ్రయించి సల్మాన్‌ఖాన్ క్లీన్ చిట్ తీసుకొచ్చేయగలడు. ఒకటి కాదు, రెండు కేసుల్లో సల్మాన్‌ఖాన్ తప్పించుకోగలిగాడంటే, అతన్ని ఎలా తక్కువ అంచనా వేయగలం.? సో, చింకారా కేసులోనే కాదు, ఏ కేసులో అయినా సరే సల్మాన్‌ఖాన్‌ని ఎవరూ ఏమీ చేయలేరంతే. నిజం నిష్టూరమే.. కానీ తప్పదు, ఒప్పుకుని తీరాల్సిందే.