సుఖ జీవనమే ఐఏఎస్‌ల లక్ష్యమా?

'ఉద్యోగికి దూర భూమి లేదు' అంటారు పెద్దలు. అంటే ఉద్యోగి అనేవాడు ఎంత దూరమైనా వెళ్లి పనిచేయాల్సిందే. నా రాష్ట్రంలోనే, నా జిల్లాలోనే, నా మండలంలోనే, మా ఊళ్లేనే పనిచేస్తానని అనకూడదు. ప్రభుత్వ అవసరాలనుబట్టి ఎక్కడికైనా వెళ్లాల్సిఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు కొందరు పైరవీలు చేసుకొని, లంచాలు ఇచ్చి ఉన్న ఊళ్లోనే పోస్టింగులు వచ్చేలా చూసుకుంటారు. ఒకవేళ దూరపు ఊళ్లో ఉద్యోగం వచ్చినా తరువాత ఏదోవిధంగా పైరవీలు చేసుకొని సొంత జిల్లాకో, ఊరికో వచ్చే ప్రయత్నాలు చేస్తారు. ఇందుకు ఏవేవో కారణాలు చెబుతారు. ఉన్న ఊళ్లోనే ఉంటూ ఎక్కువ కష్టపడకుండా ఉద్యోగం చేయాలనేది చాలామంది ఉద్యోగులకు ఉండే సహజ లక్షణం. 

చిన్నాచితక ఉద్యోగులకు కుటుంబపరమైన, ఆర్థికపరమైన కష్టాలు ఏవో ఉంటాయి కాబట్టి అలాంటివారు సొంతూళ్లోనో, జిల్లాలోనో ఉద్యోగం చేయాలనుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కాని ఆలిండియా సర్వీసు (సివిల్‌ సర్వీసు)లకు చెందిన ఉన్నతాధికారులు (ఐఏఎస్‌, ఐపీఎస్‌ తదితర అధికారులు) కూడా కడుపులో చల్ల కదలకుండా సర్వ సౌకర్యాలు ఉన్న ఊళ్లోనే సుఖంగా ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు. వీరి ఉద్యోగం ఉన్నతం. కాని ఆలోచనలు అధమం. సర్కారుకు కళ్లు, చెవులుగా ఉంటూ పాలనలో కీలక పాత్ర  పోషించే అధికారుల్లో కొందరు  సొంత ప్రయోజనాలు, సుఖాల కోసం అర్రులు చాస్తున్నారు. 

చిన్న ఉద్యోగుల్లా ఉన్నచోటు నుంచి కదిలేది లేదని మొండికేస్తున్నారు. భారీగా జీతభత్యాలు తీసుకుంటూ, సర్కారు సొమ్ముతో అనేక సౌకర్యాలు పొందుతున్న వీరు 'ఫలానా రాష్ట్రంలో మేము పని చేయం' అని చెప్పేస్తున్నారు. ఆ ఫలానా రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్‌. అనేక ఇబ్బందులు, తలనొప్పులు ఉన్న ఏపీకి ఐఏఎస్‌ అధికారులు మరింత తలనొప్పిగా తయారయ్యారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పటినుంచి అనేకమంది ఉన్నతాధికారులు ఏపీకి వెళ్లడానికి ఇష్టపడటంలేదు. చాలామంది ఐఏఎస్‌ అధికారులు తెలంగాణలో అదీ హైదరాబాదులోనే పనిచేయడానికే ఇష్టపడుతున్నారు. 

ఇందుకు కారణం...ఈ అధికారులు సుఖ జీవనానికి అలవాటు పడటమే. హైదరాబాద్‌ అన్నివిధాల అభివృద్ధి చెందిన నగరం. సకల సౌకర్యాలు ఉన్న మెగా సిటీ. ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిలో ఏమీ లేవని వీరి భావన. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం అరకొర సౌకర్యాలతో ఉంది. అంతా పల్లె వాతావరణం. మరోమాటలో చెప్పాలంటే అక్కడుంటే అడవిలో ఉన్నట్లే. అందుకే అక్కడికి వెళ్లడానికి ఎక్కువమంది ఐఏఎస్‌ అధికారులు ఇష్టపడటంలేదు. వీరంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసినవారే. ఆంధ్ర ప్రాంతం కొత్త కాదు. 

కాని విభజన తరువాత తెలంగాణలోనే ఉండాలని, అక్కడ కుదరకపోతే కేంద్రానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటివారిలో ఏపీ కేడర్‌కు చెందిన ఉత్తర భారతీయులే కాకుండా తెలుగువారూ ఉన్నారు. అధికారుల విభజనలో ఆంధ్రాకు అలాటైనవారిలో కొందరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. మరికొందరు ఏవో కారణాలతో జాయిన్‌ కాలేదు. ఇంకొందరు డిప్యూటేషన్‌పై కేంద్రానికి వెళ్లిపోయారు. మరికొందరు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు.  వాస్తవానికి ఆంధ్రాకు ఐఏఎస్‌ అధికారులు తక్కువగా ఉన్నారు.  

ఈ ఏడాది మేలో వచ్చిన వార్తల ప్రకారం  విభజన తరువాత ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌ అధికారులు 211 మంది. కాని  165 మంది ఉన్నారు. వీరిలోనూ పది మంది కేంద్రానికి వెళ్లిపోయారు. తాజాగా కొందరు ఐఏఎస్‌ అధికారులు కేంద్రానికి వెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును అనుమతి కోరారు. ఇద్దరు అధికారులు  కేంద్ర సర్వీసులకు వెళ్లిపోగానే మరికొందరు అదే దార్లో ఉన్నారు. వీరిలో ఇద్దరు అధికారులు విజ్ఞప్తిని సీఎం ఆమోదించారు. మరో అధికారి విజ్ఞప్తిని పెండింగులో పెట్టారు. కేంద్ర సర్వీసులకు పోవడం ఇష్టంలేనివారు తెలంగాణ సర్కారులో ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతుండటంతో వీరు ఆశలు పెంచుకుంటున్నారు. 

ఉద్యోగులు, అధికారులు అమరావతికి తరలివెళ్లే గడువు దగ్గర పడుతుండటంతో పోకుండా ఆగిపోయే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ రెండేళ్లలో అన్ని హంగులు, సౌకర్యాలతో విజయవాడ సమీపంలో సచివాలయం సహా పాలనకు అవసరమైన భవనాలు (తాత్కాలికమే) నిర్మించివుంటే ఉద్యోగుల్లో ఇంత విముఖత ఉండేది కాదేమో. ఇప్పుడు వారి బాధ ఒక్కటే నగరానికి దూరంగా పల్లెకు తీసుకెళ్లి పడేస్తున్నారని. 

Show comments