ఇండస్ట్రీ టాక్...ఖైదీ నెం.150

సాధారణంగా ఒక పెద్ద సినిమా విడుదలైంది అంటే ఇటు ఇండస్ట్రీలోనూ, అటు ప్రేక్షకుల్లోనూ ఓ అభిప్రాయం అంటూ వుంటుంది. ప్రేక్షకుల అభిప్రాయానికి వస్తే, అభిమానులు , దురభిమానులు, జెన్యూన్ ఆడియన్స్ ఇలా మూడు రకాలుగా వుంటుంది అభిప్రాయం. అయితే ఇండస్ట్రీ అభిప్రాయం రెండుగానే వుంటుంది. అది బయటకు ఒకటి, లోపలకు మరొకటి. సినిమా అన్ని విధాలా బాగుంటే ఒకటిగానే వుండే అవకాశం వుంటుందేమో కానీ, వేరుగా వుంటే మాత్రం ఈ విధమైన బయట, లోపల అనే రెండు రకాలు వినిపిస్తాయి.  ఖైదీనెం.150 సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. సినిమా బాగుందని అనే అన్నారంతా. అందులో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ‘గ్రేట్ఆంధ్ర’ కొందర్ని పలకరించింది. పేరు బయటకు వెల్లడించమంటూ ఒపీనియన్లు కోరింది. జెన్యూన్ గా సేకరించినవి.

సినిమాలో ఎంచడానికి ఏం లేదు. బాస్ ఈజ్ బ్యాక్. ఆయన కోసమే వచ్చే జనం ఇక సినిమాలో ప్లస్ లు మైనస్ లు పట్టించుకోరు. వాళ్లు పదేళ్ల తరవాత మెగాస్టార్ ను చూడడానికి వచ్చారు. చూసారు. ఆయన వారి అంచనాలకు తగినట్లు కనిపించారు. దట్సాల్. అది చాలు సినిమా ఆడేయడానికి. 

- ఓ నిర్మాత.

నిజానికి ప్రజలకు ఏదో చేయాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి..జనసేన పార్టీకి జవసత్వాలు ఇవ్వాలి అంటే ఇలాంటి సినిమాను పవన్ కళ్యాణ్ చేసి వుండాలి. కేవలం ఓ గ్రామం కాన్వాస్ గా తీసుకుంటేనే సినిమా ఇలా వుంది. అదే ఓ రాష్ట్రం కాన్వాస్ గా తీసుకుని, రైతుల సమస్యలను ఇదే వేలో పవన్ తన దైన పంచ్ డైలాగ్ లతో చేసి వుంటే, ఆయన పొలిటికల్ మైలేజ్ ఓ రేంజ్ లో వుండేది. కానీ ఎందుకో ఆయన చేయలేదు

-ఓ దర్శకుడు

కమర్షియల్ సినిమాలో లాజిక్ లు చూడకూడదు కానీ, కొన్ని కొన్ని సార్లు చూడక తప్పదు. పైగా లాజిక్ లు మిస్ కాకుండా చేయడానికి అవకాశం వుండి కూడా చేయకపోతే ఎలా? క్లయిమాక్స్ సీన్ లో నాగబాబు ఓ న్యాయమూర్తిగా కోర్టు వరండాలో నిల్చుని టక్కున జడ్జిమెంట్ చెప్పేయడం ఏమిటి? అక్కడికక్కడే విలన్ చావుకు వ్యవస్థ కారణం అని డిక్లేర్ చేసేయడం ఏమిటి? పైగా ఇద్దరు చిరంజీవులకు క్లియర్ మార్పు కనిపిస్తున్నపుడు, ఇక్కడి వారు అక్కడ అక్కడి వారు ఇక్కడ చటుక్కున మారిపోవడం ఏమిటి? పల్లెటూరి వదిలి మగవారంతా వచ్చారని ఓసారి అంటారు. పిల్లలు పట్టించుకోకపోతే పట్నం వచ్చి వుంటున్నారని మరో డైలాగ్ లో చెబుతారు. ఇవన్నీ సరిదిద్దుకోగల చిన్న చిన్న విషయాలు. ఇవి వదిలేస్తే సినిమా బాగానేవుంది.

-ఓ సినిమా రచయిత

మేకింగ్ పరంగా మరి కాస్త ఖర్చు పెట్టాల్సింది. చాలా సరిపెట్టుకుంటూ నిర్మాణం సాగించినట్లు కనిపిస్తుంది. పైగా వృద్ధ రైతులుగా మరీ జూనియర్ ఆర్టిస్టులతో సరిపెట్టేసారు. కనీసం ముగ్గురయినా సీనియర్లు వుండి వుంటే దాని అందమే వేరు. ఎల్ బి శ్రీరామ్, తనికెళ్ల భరణి, ఇలాంటి వారిని మధ్యలో వుంచితే సీన్లకు మరింత ఎఫెక్ట్ వచ్చేది. దానివల్ల ద్వితీయార్థం మరింత బాగుండేది. సినిమా ఇంకా మరింత ఎత్తుకు చేరేది.

-ఓ దర్శకుడు

చిరంజీవి చాలా అందంగా వున్నారు. అదే సినిమాకు పెద్ద ప్లస్. పాటల కన్నా, ఫైట్లు బాగున్నాయి. ఆ ఏజ్ లో ఆయన ఆ మాత్రం డ్యాన్స్ లు చేయడం కూడా మెచ్చుకోవాలి. ఫైట్ మాస్టర్లు బాగా మేనేజ్ చేసారు. అయితే అన్ని చోట్లా ఒకే ఫిజిక్ తో కనిపించలేదు. రెండు పాటల్లో మాత్రం చాలాబాగున్నారు మెగాస్టారు. మిగిలిన చోట్ల మళ్లీ లావుగా కనిపించారు. 

-ఓ పీఆర్వో

ఇద్దరు హీరోల పాత్రల్లో శంకరం పాత్రను మరి కాస్త ఎలివేట్ చేసి వుండాల్సింది. మరీ పప్పు శుద్దలా చూపించారు. ద్వితీయార్థంలో అసలు మాటలే లేకుండా చేసారు. అదే విధంగా పొలిటికల్ వ్యవహారాలు గుర్తుకుతెచ్చే డైలాగులు ఒకటి రెండు పడితేనే హాలు దద్దరిల్లి పోయింది. మరొక్కటి రెండు పడి వుంటే సూపరే సూపర్.

-ఓ అసిస్టెంట్ డైరక్టర్

చిరంజీవి, ఆయన న్యూ లుక్, ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక్కసారి కత్తి ఒరిజినల్ చూడండి. ఆ ఎమోషన్లు, ఆ ఇంటెన్సిటీ, ఆ కాయిన్ ఫైట్, అవన్నీ గమనించండి. అప్పుడు ఈ సినిమా ఎలా వుందో మీకే అర్థం అవుతుంది. అంతా బాగుంది. కానీ ఎక్కడో సోల్ మిస్ అయింది.

-ఓ జర్నలిస్ట్ 

Show comments