వెంకయ్య అదృష్టవంతుడే.

ఆయన మాట వినపడని రోజులేదు. ఆయన ఫోటో కనపడని పేపర్‌ లేదు. ఏ విషయంపై నైనా అనర్గళంగా, అప్పటికప్పుడే మాట్లాడగలిగిన శక్తి ఉన్నది. దేన్నైనా సమర్థించుకోగల సత్తా ఆయనకు ఉన్నది. ప్రతిపక్షంలో ఒకరోజు ఆధార్‌ నిరాధార్‌ అంటాడు. అధికార పక్షంలోకి రాగానే ఆధార్‌ను గట్టిగా సమర్థించి విమర్శకుల ఆటకట్టిస్తారు. ప్రత్యేక హోదా గురించి రాజ్యసభలో మన్మోహన్‌సింగ్‌ సర్కార్‌ను నిలదీసి ముచ్చెమటలు పెట్టించిన వెంకయ్యనాయుడు తర్వాత అధికారంలోకి రాగానే మోడీ ప్రభుత్వ వైఖరిని గమనించి అందుకు అడ్డంగా వాదించక తప్పలేదు.

ఆయన ఎంత గట్టిగా వాదించారంటే చివరకు ప్రత్యేక హోదా గురించి ఎవరూ మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. ఏవిధంగానైనా వాదించి ప్రత్యర్థుల నోళ్లు మూయించడంలో ఆయన దిట్ట. ఆయన పార్లమెంట్‌లో ఉన్నారంటే చాలు ప్రత్యర్థులు ఆయనను ఎదుర్కోవడానికి భయపడతారు. నిజానికి ఆయనను తట్టుకోలేక ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించి సభను వాయిదా వేయించిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. మొత్తం మోడీ ప్రభుత్వ కేబినెట్‌లో మోడీని గట్టిగా భుజాన వేసుకుని మాట్లాడిన నాయకుడు మరొకరు లేరు.

జీఎస్టీ అయినా, పెద్దనోట్ల రద్దు అయినా, నల్లధనం అయినా ఆయన మోడీ సర్కార్‌ను గత మూడేళ్లుగా భుజాన ఎత్తుకున్నారు. మోడీ త్రీడీ అంటూ ప్రశంసించారు. ప్రజలకోసం అవతరించిన దైవదూతగా అభివర్ణించారు. గతంలో ఇండియాయే ఇందిరా అని అప్పటి సమాచార శాఖ మంత్రి బారువా ప్రశంసిస్తే... వెంకయ్య ఆయన కంటే ఎక్కువగా మోడీని ప్రశంసించారు. దేశంలో వెంకయ్య అంటే తెలియనివారు లేరు. ఎక్కడకు వెళ్లినా ఆయన తన ఉనికి నిరూపించుకుంటారు. కేంద్రంలో వెంకయ్య హవా విపరీతంగా సాగుతోంది. ఆయన ఫోన్‌ చేస్తే చకచకా పనులు జరిగేవి. ప్రతిపక్షాలు కూడా ఆయనను అభిమానించక తప్పని పరిస్థితి కల్పించారు.

అలాంటి వెంకయ్యనాయుడును నరేంద్రమోడీ ప్రభుత్వం ఎందుకు వదులుకున్నది? నిజానికి మోడీకి కేంద్రమంత్రుల్లో అత్యంత విధేయుడుగా వ్యవహరించే నాయకుడు వెంకయ్య తప్ప మరొకరు లేరు. అయినప్పటికీ మోడీ ఆయనను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పించి ఉపరాష్ట్రపతి వంటి ఉత్సవ విగ్రహ స్థానంలో ఎందుకు పెట్టాలనుకున్నది? ఇందుకు రకరకాల కారణాలున్నాయని చెప్పవచ్చు. ఒకటి, వెంకయ్యనాయుడు నరేంద్రమోడీకి ఎంతో లోతైన బలమైన నేతగా కనిపించడం.

ఏ పదవి ఇచ్చినా సమర్థవంతంగా పనిచేయడం. పట్టణాభివృద్ది, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఆయన సమర్థత నిరూపించుకున్నారు. ప్రతిరోజూ ఆయన ప్రతిపక్షాన్ని ఢీకొని వార్తల్లో ఉండేవారు. ఆయన మోడీ ప్రక్కన నడుస్తుంటే జనం చూపు మోడీ కన్నా వెంకయ్యనాయుడుపై పడేది. మిగతా కేబినెట్‌ మంత్రుల్లాగా వెంకయ్య చెప్పింది చేయడమే కాదు, అంతకంటే ఎక్కువగా చేసేవారు. మొత్తం కేంద్రమంత్రులందర్నీ కలుపుకుని, ఎంపీలందర్నీ పిలిపించి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేసేవారు. తిరంగాయాత్రలు, భారత పర్వ, ఏక్తాదివస్‌ ఇవన్నీ వెంకయ్య ముందుండి నడిపించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడైనందువల్ల పార్టీలో అమిత్‌ షా కలుసుకోలేని వారందరూ వెంకయ్య వద్దకు వచ్చేవారు. వారందర్నీ వెంకయ్య ఆకర్షించి పనులుచేసేవారు. ఎంతైనా అరుణ్‌జైట్లీ న్యాయవాది. సుష్మా విదేశాంగానికి పరిమితమయ్యారు. రాజ్‌నాథ్‌ సింగ్‌కు యూపీలోనే దిక్కులేదు. కాని వెంకయ్య అఖిల భారత స్థాయిలో గుర్తింపు పొందిన వారు. పైగా మోడీ చట్రంలో ఆయన ఎప్పుడూ ఇమిడేందుకు ప్రయత్నించలేదు. చెప్పిన పనులు చేయడం, తర్వాత తన ఇష్టం వచ్చినట్లు తిరగడం చేసేవారు.

ఢిల్లీలోనే ఉండాలని మోడీ చెప్పినప్పటికీ ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడూ ప్రజల్లో, ముఖ్యంగా తన స్వంత రాష్ట్రంలో తిరిగేందుకు ప్రయత్నించేవారు. ఇదే మోడీకి నచ్చలేదు. వెంకయ్య ఆయనకు తనకు మించిన నేతగా కనిపించారు. ఆయనను తప్పించాలనుకున్నా తప్పించలేని పరిస్థితిలో పడ్డారు. పైగా గత అద్వానీ శిభిరంలో కూడా వెంకయ్య బలమైన నాయకుడు. వెంకయ్యను తప్పిస్తే అద్వానీ శిభిరానికి చైతన్యం వచ్చేది. అందుకే ఆయనను మర్యాదగా సాగనంపాలనుకున్నారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యను పంపించాలని ఆయన, అమిత్‌ షా గత ఏడాదే నిర్ణయించుకున్నారు. 

వెంకయ్యను తొలుత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి తప్పించారు. వెంకయ్య పార్లమెంటరీ మంత్రిగా ఉంటే ఉపరాష్ట్రపతి పదవికి నేరుగా పంపించడం కష్టమయ్యేది. ప్రతిపక్షాలతో ఢీకొని సమర్థవంతంగా పనిచేస్తున్న వ్యక్తిని ఎందుకు తప్పిస్తున్నారన్న ప్రశ్న తలెత్తేది. అంతేకాదు. ఆయన స్థానంలో వెంటనే మరొకరిని భర్తీ చేయాలన్నా కష్టమయ్యేది. అందుకే ముందుగా వెంకయ్య శిష్యుడైన అనంతకుమార్‌ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా నియమించి వెంకయ్య పర్యవేక్షణలో పనిచేయమన్నారు. నిజానికి అనంతకుమార్‌ పైకి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అయినా అంతా వెంకయ్యపై ఆధారపడేవారు.

పార్లమెంటరీ వ్యవవహారల మంత్రిత్వశాఖ నుంచి సమాచార శాఖకు పంపించిన తర్వాత వెంకయ్య మరీ విజ్రుభించారు. సమాచార శాఖను ఆయనంత బాగా ఉపయోగించుకున్న వారులేరు. ప్రతిరోజూ పత్రికలు, టీవీల్లో కనపడేవారు. మీడియా అధిపతులను పిలిచి మాట్లాడేవారు. సినీ పరిశ్రమ ప్రముఖులను సన్నిహితం చేసుకున్నారు. తెలుగువాడైన విశ్వనాథ్‌కు దాదాసాహెబ్‌ పురస్కారం ఇప్పించుకున్నారు. స్మార్ట్‌ సిటీల పథకాన్ని వేగవంతం చేశారు. సులభంగా వ్యాపారం చేసేందుకు నిర్మాణ రంగంలో మార్పులకు ఆయన దోహదం చేశారు. రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని కట్టుదిట్టం చేసేందుకు కీలకమైన బిల్లును ప్రవేశపెట్టారు. ఢిల్లీలో మురికివాడల నిర్మూలన విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించారు.

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నుంచి తప్పించడమే వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చేందుకు సంకేతంగా అప్పుడు చాలామందికి అనిపించలేదు. కాని పార్లమెంట్‌లో ప్రతిపక్షాల పట్ల వెంకయ్య అనుసరించిన వైఖరి ఆయనకు ప్లస్‌పాయింట్‌ అయింది. రాజ్యసభ చైర్మన్‌ అయితే ప్రతిపక్షాలు ఆయన పట్టులోకి వస్తారని మోడీకి తెలుసు. సభ చైర్మన్‌ ఒకసారి రూలింగ్‌ ఇచ్చిన తర్వాత తిరుగు ఉండదు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా పెద్దలసభలో ఉన్న వెంకయ్యనాయుడుకు రాజ్యసభ నిబంధనలు బాగా తెలుసు.

బీజేపీ మైనారిటీలో ఉన్న రాజ్యసభలో ప్రతిపక్షాలను కంట్రోల్‌ చేయాలంటే వెంకయ్యకు మించిన సీనియర్‌ నాయకుడు మరొకరు లేరు. వెంకయ్య పట్టణాభివృద్దితో పాటు గృహనిర్మాణం, పేదరిక నిర్మూలన మంత్రిత్వశాఖను కూడా సమర్థవంతంగా నిర్వహించారు. వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా ప్రకటించేందుకు కొద్దిరోజుల ముందే ఈ శాఖల్ని కలిపి గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖగా మార్చడంతో ఈ శాఖ ప్రాధాన్యత తగ్గిపోయింది. అప్పుడే వెంకయ్యను తప్పిస్తారేమోనన్న అనుమానాలు బయలుదేరాయి.

వెంకయ్య ను విస్మరించలేని స్థాయికి ఆయన ఇమేజ్‌ పెరగడం, రాజ్యసభకు ఆయన అవసరం కనపడడంతో ప్రధాని, షాలకు ఆయనను మర్యాదగా తప్పించే అవకాశం దొరికింది. ఇక  ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల విషయంలో వెంకయ్యనాయుడును కాదని ఏదీ చేయలేని స్థితి ఏర్పడడం కూడా వెంకయ్యను ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం పెట్టాలనుకోవడానికి మరోకారణం.

ఏపీకి సంబంధించిన చిన్నా చితకా పనులను వెంకయ్య దగ్గరుండి చేసేవారు. కేబినెట్‌ మంత్రులను పిలిచి మరీ పనులను చేయించేవారు. ప్రధానమంత్రి కార్యాలయానికి తరుచూ ఫోన్లు చేసేవారు. అధికారులను ఏపీ పనులు కావడంలేదని క్లాసు పీకేవారు. ప్రత్యేక హోదా రాకపోయినా అంతకుమించి ప్యాకేజీ రావాలని అహర్నిశలు పోరాడారు. తెలుగుదేశంతో తెగతెంపులు చేసుకోవడం సరైంది కాదని బీజేపీ అంతర్గత సమావేశాల్లో ఆయన గట్టిగా వాదించేవారు. కేసీఆర్‌తో కేంద్రం మైత్రికి తెరవెనుక దోహదం చేశారు.

నిజానికి రాష్ట్ర రాజకీయ నాయకుల్లో సగం మందికి వెంకయ్య అంటే ఈర్ష్యాసూయలు తప్ప ఆయనను వ్యతిరేకించేందుకు కారణాలు లేవు. ఏ పనులకోసమైనా వెంకయ్యపై ఆధారపడే వాళ్లే తెరవెనుక ప్రచారం చేసేవారు. ఏపీలో బీజేపీ బలం ఏమాత్రం లేకపోయినా, వెంకయ్య ఉంటే పార్టీ బాగుపడదని చెప్పేవారు. అమిత్‌ షా, రాంమాధవ్‌ల చెవి కొరికేవారు. కొందరికి చంద్రబాబు పట్ల ద్వేషం అయితే కొందరికి ఒకవర్గం అంటే తీవ్రద్వేషం.

దీనివల్ల వారు వెంకయ్య ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేసేవారు. వారెవరికీ వెంకయ్యతో నేరుగా ఢీకొనే ధైర్యంలేదు. ఆయన ఎదురుపడితే నమస్కరించి ప్రక్కకు తప్పుకునేవారే. మరోవైపు వెంకయ్య వారిపట్ల ద్వేషభావం ఎన్నడూ ప్రదర్శించలేదు. ఎవరైనా తనవద్దకు వస్తే చాలు వారి పనులు చేసి పెట్టేవారు. అడగనివానిదే తప్పన్నట్లుగా వ్యవహరించేవారు. వెంకయ్య హుందాతనం, ఆయన వాగ్ధాటి, ప్రతి విషయాన్ని ఓపికగా చెప్పే మనస్తత్వం వల్ల ఆయనపై విమర్శలన్నీ గాలికి కొట్టుకుపోయేవి. బహుశా ఆయన ఈ హుందాతనమే ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి వచ్చేలా చేసింది.

నిజానికి వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవి బందీఖానా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఇకనుంచి ఇష్టం వచ్చినట్లు ప్రజల్లోకి వెళ్లి అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చేందుకు వీలుండదు. అంతా ఫ్రోటోకాల్‌ ప్రకారమే జరగాలి. ఆయన ఏ రాష్ట్రం వెళ్లినా ముందుగా ముఖ్యమంత్రులకు, నేతలకు తెలపాలి. కనుక పదేపదే ఎక్కడికైనా వెళ్లేందుకు వీలులేదు. ఆయనను కలుసుకునేవారి సంఖ్య కూడా తగ్గిపోతుంది. తరుచూ విదేశాలకు వెళుతూ ఉండాలి.

ఆయన నోటిని కట్టిపడేయడంతో ఆయన స్వేచ్చ తగ్గిందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల తరఫున ఇక పని చేసేవారుండరు. దీనివల్ల రెండు రాష్ట్రాలకు తీరని నష్టం జరిగిందనే చెప్పాలి. నరేంద్రమోడీకి కూడా అంతగా సమర్థించే నేత దొరకడు. మనం ఇప్పటివరకు చూసే వెంకయ్య, ఇకనుంచి చూసే వెంకయ్య వేరుగా ఉంటారని వేరే చెప్పనక్కర్లేదు. అయితే వెంకయ్యనాయుడుకు ఇష్టంఉన్నా, లేకపోయినా ఉపరాష్ట్రపతి పదవిరావడం ఒక తెలుగువాడికి గర్వకారణం.

సర్వేపల్లి రాధాకృష్ణన్‌, వివిగిరిల తర్వాత, దాదాపు నాలుగు దశాబ్దాలకు ఈ ఉన్నత పదవి తెలుగు నేతకు దక్కింది. వెంకయ్య ఇన్నాళ్లు పడ్డకష్టానికి ఇది సముచిత ఫలితమేనని చెప్పాలి. అయినా మరో రెండేళ్లలో ఏడుపదులు సమీపిస్తున్న వ్యక్తి ఇంకెన్నాళ్లు ఇతరులకోసం కష్టపడాలి.. గతంలో లాగా ఆయన ఉదయం 8గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు అందరికీ అందుబాటులో ఉండనవసరంలేదు.

రాజ్యసభ హడావిడి ఎలాగూ ఉంటుంది. మిగతా సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి, ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించడానికి సమయం ఉంటుంది. అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ వంటి నేతలకు రాష్ట్రపతి పదవి వస్తుందని ఆశించారు. కాని వారిని మోడీ పూర్తిగా విస్మరించారు. ఈ నేపథ్యంలో వెంకయ్యకు ఆయన విలువ ఇచ్చి చెప్పుకోదగ్గ పదవి ఇవ్వడం మంచిదే అయింది.

ఏడుపదులు పూర్తయిన తర్వాత మోడీ ఎలాగూ మంత్రిపదవుల్లో ఉంచే అవకాశంలేదు. 2019లో వెంకయ్య, అరుణ్‌ జైట్లీ, రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులను మంత్రిపదవిలోకి తీసుకుంటారన్న గ్యారంటీ లేదు. అప్పుడు చేద్దామన్నా గవర్నర్‌ పదవులు తప్ప మరే అవకాశం ఉండదు. గవర్నర్‌ పదవులు ప్రధాని ఇష్ట ప్రకారం ఉండే తుమ్మితే ఊడే పదవులు. అంతకన్నా ఉపరాష్ట్రపతి పదవి వేయిరెట్లు మిన్న.

ఆ పదవిలో ఉన్న వారిని ప్రధానమంత్రి కూడా శాసించలేరు. పార్టీకి, ప్రభుత్వానికి స్వతంత్రంగా వ్యవహరించగల పదవి అది. రాజ్యసభ చైర్మన్‌గా ఆయన ముందు ప్రధాని అయినా నిలుచోవాల్సిందే రమ్మన్నప్పుడు రావాల్సిందే. వెంకయ్య లాంటి నేత అయితే తనకు అనుకూలంగా ఉంటారనే మోడీ ఆయనను ఎంచుకున్నారు. మరో అయిదేళ్ల తర్వాత పరిస్థితులు అనుకూలంగా ఉంటే వెంకయ్యకు రాష్ట్రపతి పదవి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేవు. ఏరకంగా చూసినా వెంకయ్య అదష్టవంతుడే.

-హారీష్‌

Show comments