ఆరునెలల ముందే ఎన్నికలు?

పెద్ద నోట్లరద్దుతో సంచలనం సష్టించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ తదుపరి చర్య ఏమి తీసుకుంటాడా అన్న విషయం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీిలో నేతలు మోడీ తమను ముంచుతాడో, తేల్చుతాడో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అయితే మోడీ బ్యాటింగ్ ఆపడని వరుసగా విప్లవాత్మక చర్యలు తీసుకుంటారని అనేకమంది భావిస్తున్నారు. 2017, 2018బడ్జెట్‌లో మోడీ ప్రవేశపెట్టే కీలక నిర్ణయాలే బీజేపీ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. నిజానికి బీజేపీి నేతలే కాదు, బీజేపీియేతర పార్టీలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మోడీ గేమ్‌ప్లాన్ అర్థంకాక తికమకపడిపోతున్నారు.

మోడీ ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నాడని, అతడికి తిరుగుండదని, అతడితో పెట్టుకుంటే తమకు కూడా నూకలు చెల్లుతాయని భావించే వారు బీజేపీియేతర పార్టీల్లో కూడా ఉన్నారు. వారిలో ప్రథముడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. ఆ తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ెకేసీఆర్ అడుగుజాడల్లో నడిచేందుకు సిద్దమవుతున్నారు.
 
ఇంతకీ మోడీ గేమ్‌ప్లాన్ ఏమిటి? వరుస షాకింగ్ నిర్ణయాలతో ప్రతిపక్షాన్ని, దేశాన్ని కుదిపేసి మొత్తం ఓట్ బ్యాంక్‌ను తన గుప్పిట్లో పెట్టుకోవడం. సామాన్యులు, మధ్యతరగతి, సంపన్నులు మూడు వర్గాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని వారు తనను కొలిచే విధంగా చేయడం. ఇందుకు మోడీ దగ్గర ఎన్నో ప్లాన్‌లు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో సంచలనం సష్టించిన మోడీ మరెన్నో కీలక నిర్ణయాలు తీసుకోనే అవకాశాలు లేకపోలేదు. మోదీ తదువరి చర్య ఏమిటా అన్న విషయం ప్రత్యర్థులే ఊహించలేకపోతున్నారు.

నిజానికి పెద్దనోట్ల రద్దు, ఏటీఎంల వద్ద క్యూలలో జనం తిప్పలు, డబ్బులు చేతుల్లో లేక ప్రజల కటకట చూసిన తర్వాత జనం మోడీని దెబ్బతీస్తారని పలువురు భావించారు. కాని అలాంటిదేమీ జరగలేదు. పైగా కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి మరునాడే ఢిల్లీ వెళ్లి మోడీ చంక నెక్కుతారని ఎవరూ ఊహించలేదు. పైగా నగదు రహిత గ్రామాలంటూ మోడీ తానా అంటే తందానా అనడం ప్రారంభించారు. ఆ తర్వాత నితీశ్ కుమార్, నవీన్ పట్నాయక్ కూడా మోడీ చంకనెక్కారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఒంటరివారయ్యారు. కాంగ్రెస్, లెఫ్ట్ నిరసనలకు అంత ప్రతిస్పందన లభించలేదు. భారత్ బంద్ దాదాపు విఫలమైంది. ఇప్పుడే ఇలా ఉంటే మోడీ తర్వాత ఎంత బలోపేతమవుతాడో ప్రతిపక్షాలు ఊహించలేకపోతున్నాయి.
 
2017 మోడీకి కీలక సంవత్సరం. ఉత్తరప్రదేశ్‌లో గెలిచినా గెలవకపోయినా మోడీ కీలక నిర్ణయాలు తీసుకోవడం మానరు. 2017లో యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కనీసం రెండు, లేదా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా మోడీ తనది పైచేయి అని చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి, అంతేకాక ఓటమితో నిమిత్తం లేకుండా మోడీ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోకుండా ఆగే ప్రసక్తి లేదు. వాటిలో కొన్ని- జనధన్ ఖాతాల్లో సబ్సిడీల బదులు డబ్బులు వచ్చేలా చూడడం (నగదుబదిలీ), ఆదాయపు పన్ను లేకుండా చేయడం, బడ్జెట్‌లో అద్భుత సంక్షేమపథకాలు ప్రవేశపెట్టడం, ఆక్రమిత పాకిస్తాన్‌పై దాడులు చేయడం మొదలైనవి.
 
2018లో మోడీ ఆలోచిస్తున్న మరో వ్యూహం అసెంబ్లీ, లోక్‌సభలకు ఎన్నికలు ఒకేసారి జరపడం. 2017లో ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాలు మినహాయిస్తే మిగతా అసెంబ్లీ ఎన్నికలన్నీ 2018, ఆ తర్వాతే జరుగుతాయి. ఈ అయిదు రాష్ట్రాలు మినహాయించి మిగతా రాష్ట్రాలకు, లోక్‌సభకు ఎన్నికలు ఎలా జరిపించాలా అని మోడీ ఆలోచిస్తున్నారు. ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికలు జరిపించడంపై మొత్తం ఎన్నికల కమిషన్ యంత్రాంగం తీవ్రంగా పనిచేస్తున్నది. ప్రధానమంత్రి కార్యాలయంతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నది. 2018లో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల తర్వాత ఎన్డీఏకు రాజ్యసభలో మెజారిటీ వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాక రాష్ర్టపతి ఎన్నికలు, ఉపరాష్ర్టపతి ఎన్నికలు కూడా 2018 జులై నాటికి పూర్తవుతాయి. ఆ తర్వాతే ఒకేసారి ఎన్నికలు జరిపించే విషయం మోడీ ఆలోచిస్తున్నారు. 2019లో లోక్‌సభతో పాటు 16 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ర్ట ప్రభుత్వాలను విశ్వాసంలోకి తీసుకుంటే కాని ఈ ఎన్నికల ప్రక్రియ ఒకేసారి జరగడానికి వీలు లేదు. అందువల్ల మోడీ ఇప్పటికే ఆయా రాష్ర్ట ప్రభుత్వాలకు హింట్ ఇచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే కేసిఆర్,  నితీశ్, నవీన్ పట్నాయక్ చంకలు గుద్దుకుంటున్నారు. నితీశ్ అడ్డం తిరగడంతో కాంగ్రెస్, మమత ఆయనపై గుర్రుమంటున్నారు.

201, 2019లో ఎన్నికలు జరిగే అసెంబ్లీలు రెండింటికీ 2018 డిసెంబర్ లేదా 2019 జనవరిలో ఎన్నికలు జరిపించాలని, లోక్‌సభ ఎన్నికలు కూడా అప్పుడే జరగాలని మోడీ భావిస్తున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్‌కు అనుగుణంగా ఆయన పావులు కదుపుతూ కాంగ్రెసేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను దువ్వుతున్నారు. ఎలాగూ బీజేపీికి 2014లో వచ్చినంత సంఖ్యాబలం రాకపోవచ్చునని, అయితే మెజారిటీ సీట్లు దక్కుతాయని ఆయన భావిస్తున్నారు.  అందువల్ల ఆయన తెలంగాణలో కేసీఆర్, ఒడిశాలో నవీన్ పట్నాయక్, బీహార్‌లో నితీశ్ కుమార్‌తో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా అవగాహన ఏర్పర్చుకోవాలని భావిస్తున్నారు. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత బలహీనపడ్డ అన్నాడిఎంకె ఇప్పటికే నరేంద్రమోడీ గుప్పిట్లోకి వచ్చింది. కనుక 2014లో లోక్‌సభలో బీజేపీిికి వచ్చిన బలం కంటే 50 నుంచి వంద సీట్లకు తగ్గినా మోడీ మళ్లీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు నూటికి నూరుశాతం ఉన్నాయి.

ముందు ఒకేసారి ఎన్నికల పేరుతో దేశమంతటా తన హవా వీచేలా చూసి, బలంలేని చోట మిత్రపక్షాలను ఏర్పర్చుకుని చిరకాలం దేశాధినేతగా కొనసాగాలని, ఈ పథకం విజయవంతం అయితే అధ్యక్ష వ్యవస్థ ప్రవేశపెట్టాలని మోడీ యోచిస్తున్నట్లు కూడా విశ్వసనీయ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే కాంగ్రెస్ నుంచి దేశాన్ని విముక్తి చేయడమేమో కాని చిన్న పార్టీలు కూడా మటుమాయం కావడం ఖాయం.

Show comments