కొందరు ప్రముఖులకు చరిత్ర సృష్టించే అవకాశం జీవితంలో అరుదుగా వస్తుంది. ఆ సమయంలో వారు దాన్ని ఉపయోగించుకుంటే వారి పేరు చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాకుండా భావి తరాలకు ఓ పాఠమవుతుంది. చరిత్ర రెండు రకాలుగా సృష్టించవచ్చు. ఒకటి మంచి పని చేసి. రెండోది చెడ్డ పని చేసి లేదా చెడు సంప్రదాయాలను నెలకొల్పి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ రెండో కోవకు చెందుతారు. చరిత్రలో నిర్ణయం తీసుకొని, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్న ఇద్దరు చంద్రులకు గుణపాఠం నేర్పే సువర్ణావకాశం చేతికి అందివచ్చినా ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోకుండా అపకీర్తి మూటగట్టుకున్నారు. ఆ సువర్ణావకాశం ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌లో ఫిరాయింపుదారులతో మంత్రులుగా ప్రమాణం చేయించకుండా తిరస్కరించడం. పదేళ్లుగా ఉమ్మడి రాష్ట్రానికి, రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగుతున్న నరసింహన్ ఇక ఎక్కువకాలం పదవిలో ఉండకపోవచ్చు. సుదీర్ఘకాలంగా గవర్నరుగా పనిచేస్తున్నందున మరో పదేళ్లపాటు ఉండే అవకాశం లేదు. సరే...ఎన్నాళ్లు ఉన్నప్పటికీ తాను పదవి నుంచి దిగిపోయేలోగా చరిత్రను మలుపు తిప్పే, రాజ్యాంగాన్ని పరిరక్షించే ఒక్క మంచి పని చేసుంటే బాగుండేది. కాని ఆయన ఆ పని చేయలేకపోయారు. ఇందుకు కారణమేమిటో తెలియదు.
ఫిరాయింపుదారులతో మంత్రులుగా ప్రమాణం చేయించి అపకీర్తి మూటగట్టుకున్నారు. ఆ పని చేయించకుండా ఉన్నట్లయితే ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయేది. కేసీఆర్, చంద్రబాబుకు నోట్లో పచ్చి వెలక్కాయ పడేది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయకుండా మీనమేషాలు లెక్కపెడుతూ ముఖ్యమంత్రుల కనుసన్నల్లో పనిచేస్తున్న ఇద్దరు స్పీకర్లకు తమ విధి నిర్వహణ గుర్తుకు వచ్చేది. గవర్నర్ తిరస్కరించివుంటే ఆ చర్య జాతీయ స్థాయిలో చర్చనీయాంశమై కేంద్ర ప్రభుత్వంలోనూ కదలిక వచ్చేది. గవర్నర్ తిరస్కరణ అన్నివిధాల మేలు కలిగించేది. కాని ఆయన ఆ మేలు చేయలేకపోయారు. తెలంగాణలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన తలసాని శ్రీనివాస యాదవ్ తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానన్నాడు. దాన్ని స్పీకరుకు ఇచ్చానన్నాడు. ఆయన రాజీనామా లేఖ అందలేదని స్పీకర్ కార్యాలయం ఓ ఆర్‌టీఐ (సమాచార హక్కు చట్టం) కార్యకర్త లేఖకు సమాధానం ఇచ్చింది. రాజీనామా చేశాడో లేదో తెలియని తలసాని మంత్రి అయిపోయాడు.
తలసాని వ్యవహారంపై గవర్నర్ అసలు స్పందించలేదు. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది రాజ్యాంగ ఉల్లంఘనంటూ మండిపడ్డారు. ఆ మండిపాటు వీడియోను రెండు రోజులుగా టీవీ ఛానెళ్లలో, సోషల్ మీడియాలో చూస్తున్నాం. వింటున్నాం. తలసాని వ్యవహారంపై మండిపడిన చంద్రబాబు తానూ అదే పని చేశారు. దాన్ని గవర్నర్ సమర్ధించారు. తెలంగాణలో తప్పు చేసిన నరసింహన్ ఆంధ్రాలో తప్పు చేయరని రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలూ భావించాయి. ఇరు రాష్ట్రాల్లోని అన్ని పార్టీల నాయకులు ఆంధ్రాలో తప్పు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తప్పు చేస్తే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని తెలంగాణ కాంగ్రెసు నాయకుడు వీహెచ్ హనుమంతరావు హెచ్చరించారు. చరిత్ర హీనుడిగా మిగిలిపోవద్దన్నారు. అయినప్పటికీ గవర్నర్ పట్టించుకోలేదు. దీంతో తెలంగాణలోనూ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. గవర్నర్, చంద్రబాబు తప్పు చేశారని ప్రతిపక్ష నాయకులంటున్నారు. కొన్ని వర్గాల ప్రజల్లో ఆ అభిప్రాయముంది. కాబట్టి తాము చేసింది ఒప్పేనని ఇద్దరూ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది.
ముఖ్యంగా చంద్రబాబుకు ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే తలసానికి మంత్రి పదవి ఇవ్వడం తప్పని చెప్పిన చంద్రబాబు తానూ అదే తప్పు ఎందుకు చేశారో వివరించాల్సిన అవసరముంది. తనను మించిన నీతిపరుడు, నిజాయితీపరుడు దేశంలోనే లేరని చెప్పుకుంటున్న బాబు ఫిరాయింపుదారులకు పదవులు ఇవ్వడంలో తాను ఎలా నిజాయితీగా వ్యవహరించారో స్పష్టం చేయాలి. గతంలో తమిళనాడుకు గవర్నర్‌గా పనిచేసిన ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి అప్పటి ముఖ్యమంత్రి జయలలిత పట్ల ఎంత ధైర్యంగా వ్యవహరించారో గుర్తుకు తెచ్చుకోవాలి. జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడానికి బీజం వేసింది చెన్నారెడ్డే. ఆమె అవినీతికి సంబంధించి ఫిర్యాదులు అందడంతో ఆమెను ప్రాసిక్యూట్ చేసేందుకు ఆయన అనుమతి ఇచ్చారు. ఓ ముఖ్యమంత్రిని, అందులోనూ బ్రహ్మాండమైన ప్రజాదరణ ఉన్న జయను ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడమంటే ఎంత ధైర్యముండాలి..! అయినా వెనకాడలేదు. ఆమె అవినీతికి పాల్పడిందని నమ్మారు. అదే నిజమైంది. ఆయనతో పోల్చుకుంటే నరసింహన్ ఏమిటి...?