ఎంత తిట్టినా అంతే...రొటీన్‌ వ్యవహారం..!

ఏపీలోని రాజధాని ప్రాంతం వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీలో బడ్జెటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏపీ గడ్డ మీద అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనందుకు అందరూ సంతోషించారు. టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు గొప్ప విజయం సాధించినట్లుగా చెప్పుకుంటున్నాయి. మంచిదే. కాని ఇదంతా గవర్నర్‌ ప్రసంగం చదవకముందే. ఆనవాయితీ ప్రకారం ఉభయసభలనుద్దేశించి ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించారు. ఆ తరువాతే రొటీన్‌ వ్యవహారం మొదలైంది. గవర్నర్‌ ప్రసంగం బ్రహ్మాండమని అధికార పార్టీ నాయకులు, చెత్తగా ఉందని ప్రతిపక్ష నాయకులు మీడియా సమావేశాలు పెట్టి ఊదరగొట్టారు. గవర్నర్‌ ప్రసంగించడం ఎంత రొటీన్‌ వ్యవహారమో ప్రశంసలు, విమర్శలు కూడా అంతే రొటీన్‌. రాజకీయంలో ఇదొక భాగం. ఇందులో గవర్నర్‌ పావు మాత్రమే. ఆయనేం చేస్తారు? ప్రసంగ పాఠం తయారుచేసి ఇచ్చేది ప్రభుత్వం. పొల్లుపోకుండా చదివే బాధ్యత గవర్నర్‌ది. ప్రసంగంలో ఆయన 'నా ప్రభుత్వం' అని ఆయన చెప్పుకున్నా ప్రసంగం సొంతంగా తయారుచేసుకోరు. అందులో విజయాలే తప్ప వైఫల్యాల ప్రస్తావన ఉండదు. గొప్పలు ఉంటాయే తప్ప తప్పులు ఉండవు. ఇది అందరికీ తెలిసిందే. కాని ప్రసంగించింది గవర్నర్‌ కాబట్టి ప్రశంసలు, విమర్శలు అన్ని ఆయన్ని ఉద్దేశించి చేస్తారు.

కేంద్రంలో రాష్ట్రపతికి, రాష్ట్రంలో గవర్నర్‌కు ఈ పరిస్థితి తప్పదు. ఏపీలో ఈ రోజూ జరిగింది ఇదే. ఆయన తన ప్రసంగంలో ప్రత్యేక ప్యాకేజీని సమర్థించారు. దీంతో ప్రతిపక్షాలు ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ (అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం అదే కాబట్టి) ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేశారు. ఇంకా అనేక అంశాలున్నా హోదా కోసం ఆ పార్టీ పోరాడుతోంది కాబట్టి దీన్ని ప్రధానాంశంగా తీసుకున్నారు. ఎంత తిడితే ఏం ప్రయోజనం? గవర్నర్‌ ప్రసంగంలో మార్పులుండవు కదా. గవర్నర్‌ సొంతంగా ప్రసంగం తయారుచేసుకొని మాట్లాడకపోయినా పెద్దాయన్ని గౌరవించాలి కాబట్టి 'గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు' తెలిపే కార్యక్రమం ఉంటుంది. ఇదంతా విమర్శలు ప్రతివిమర్శలతోనే గడిచిపోతుంది. ధన్యవాదాల సంగతి తరువాత ముందు వాదోపవాదాలకే ప్రాధాన్యం. ఇదీ రొటీన్‌ వ్యవహారమే. గవర్నర్‌ను, రాష్ట్రపతిని సాధారణంగా 'రబ్బర్‌ స్టాంప్‌' అంటుంటారు. ప్రభుత్వం చెప్పినదానికల్లా గవర్నర్‌ తల ఊపుతారని, ప్రశ్నించరని ఇలా అంటుంటారు. ప్రశ్నిస్తే గొడవలైపోతాయి కాబట్టి సాధారణంగా ఎవ్వరూ ఆ పని చేయరు. ప్రభుత్వ చర్యలతో, అభిప్రాయాలతో విభేదించిన గవర్నర్‌లు, ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగ పాఠాలను కాకుండా సొంత ప్రసంగాలు చదివిన గవర్నర్‌లూ చరిత్రలో ఉన్నారు.

గవర్నర్‌ తన సొంత ప్రసంగం చదివిన ఘటన ఒకప్పుడు పశ్చిమ బెంగాల్లో జరిగింది. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా ఉన్న తొలి మహిళా ఐపీఎస్‌ అధికారి కిరణ్‌ బేడీకి, ప్రభుత్వానికి పడటంలేదు. ఆమె ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఫైల్‌ తాను పరిశీలిస్తానని పట్టుబడుతున్నారు. పాలనా వ్యవహారాల్లో గవర్నర్లు జోక్యం చేసుకోరు. కాని కిరణ్‌ బేడీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్‌కు, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా చేసిన  నజీబ్‌ జంగ్‌కు  పొట్టుపొట్టుగా జరిగిన గొడవలు మొన్నటివరకు చూశాం. ఇదంతా కేంద్రం రేపిన చిచ్చని అంటుంటారు. తెలుగువారి విషయానికొస్తే పూర్తి స్వతంత్రంగా వ్యవహరించిన నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా పనిచేసిన డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి. ఆయన తమిళనాడు గవర్నర్‌గా ఉన్నప్పుడు అప్పటి సీఎం జయలలితతో ఘర్షణ పడని రోజు లేదు. అక్రమాస్తుల కేసులో జయ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చింది చెన్నారెడ్డే. అందులోనే ఆమె చివరకు దోషిగా తేలింది.

చెన్నారెడ్డి బహిరంగంగానే జయ మీద రెచ్చిపోయారు. ఆమె కూడా అలాంటిదేననుకోండి. ఒక దశలో చెన్నారెడ్డి 'నన్ను అగౌరవపరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి' అని జయను హెచ్చరించారు. తనపై ఆరోపణలు చేసే మంత్రుల పదవులు పోతాయని బెదిరించారు. ఒకసారి ఆయన మీడియాతో మాట్లాడుతూ 'ఆమెను చివరి పాయింటు వరకు వెళ్లనీయండి. ఏం జరుగుతుందో చూద్దురుగాని' అని వ్యాఖ్యానించారు. 'నాకు రాజకీయాలు తెలుసు. నేను జీరోను కాను' అని ఒకసారి అన్నారు.  ఒకసారి గవర్నర్‌ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. చెన్నారెడ్డి గవర్నర్‌ పోస్టును ఎన్నడూ రబ్బరు స్టాంపు పదవిలా చూడలేదు. ఆయన గవర్నర్‌గా పనిచేసిన ప్రతి రాష్ట్రంలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త సంప్రదాయాలు ప్రవేశపెట్టారు. గవర్నర్‌ రాజ్‌భవన్‌కే పరిమితం కాకూడదని, ప్రజల మధ్య ఉండాలనేవారు. మరో మాజీ సీఎం రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా ఉన్నప్పుడు జయకు పూర్తి విధేయుడిగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ తెలంగాణకు అనుకూలంగా ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. Readmore!

Show comments