రివ్యూ: ఎక్కడికి పోతావు చిన్నవాడా
రేటింగ్: 3.25/5
బ్యానర్: మేఘన ఆర్ట్స్
తారాగణం: నిఖిల్, హెబా పటేల్, నందిత శ్వేత, అవిక గోర్, వెన్నెల కిషోర్, సత్య, ప్రవీణ్, సుదర్శన్, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర తదితరులు
మాటలు: అబ్బూరి రవి
సంగీతం: శేఖర్ చంద్ర
కూర్పు: చోటా కె. ప్రసాద్
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
నిర్మాణం: మేఘన ఆర్ట్స్
కథ, కథనం, దర్శకత్వం: వై ఆనంద్
విడుదల తేదీ: నవంబరు 18, 2016
మరణానంతరం మనిషి శరీరం ఇరవై ఒక్క గ్రాములు బరువు తగ్గుతుంది అని సైన్స్ చెబుతుంది... అంటూ టీజర్‌తోనే మన దృష్టిని ఆకట్టుకున్న 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ప్రోమోలతో క్రియేట్ చేసిన ఇంట్రెస్ట్‌కి పూర్తి న్యాయం చేసింది. తామరతంపరగా వచ్చి పడుతోన్న హారర్ కామెడీ సినిమాల నడుమ ప్రత్యేకత చాటుకునే చక్కని కాన్సెప్ట్, చిక్కని కథ, అన్నిటికీ మించి పసందైన హాస్యంతో భలేగా అలరిస్తుంది. పైసా, పైసా చూసి ఖర్చు చేస్తున్న ఈ సంక్షోభ దశలోను నన్ను చూడకుండా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' అంటూ సినీ ప్రియులని సవాల్ చేస్తుంది.
డైరెక్టర్ ఆనంద్ ఆలోచన వినడానికి హాస్యాస్పదంగా అనిపించి ఉండొచ్చు. కానీ ఒక దర్శకుడు ఒక కథని బలంగా నమ్మితే, దానిని మనతో కూడా ఎలా నమ్మించగలడో, లాజిక్ మర్చిపోయేంతగా ఎంతలా నవ్వించగలడో ఈ చిత్రం నిరూపిస్తుంది. 'ప్రేమకథాచిత్రమ్' తర్వాత ఈ జోనర్‌లో వచ్చిన సినిమాల్లో అంతగా నవ్వించే చిత్రమిదే. జోరు మీదున్న నిఖిల్ 'శంకరాభరణం'తో తాళం తప్పినా వెంటనే ట్రాక్ మీదకి వచ్చేసి మరో సాలిడ్ స్క్రిప్ట్ సెలక్ట్ చేసుకున్నాడు. తన జడ్జిమెంట్ నమ్మి అడ్వాన్స్‌గా టికెట్ బుక్ చేసేసుకోవచ్చని ఇంకాస్త నమ్మకం పెంచుకున్నాడు.
ఈ చిత్ర కథేంటన్నది చెప్పేస్తే ఆ ఫన్ మిస్ అయిపోతుంది. అందుకే ఆ స్పాయిలర్స్ జోలికి పోవట్లేదు. బేసిక్‌గా సూపర్ నేచురల్ థ్రిల్లర్ అయినప్పటికీ కామెడీ ఫుల్ డోస్‌లో పండింది. స్టోరీ బేస్ మాత్రం స్ట్రాంగ్ లవ్‌స్టోరీపై డిపెండ్ అయింది. దర్శకుడు ఆనంద్ రచయితగా ఫుల్ మార్కులు స్కోర్ చేస్తాడు. ప్రతి పాయింట్‌పై అతను దృష్టి పెట్టి, గ్యాప్స్ లేకుండా టైట్‌గా నడిపించడానికి శాయశక్తులా కృషి చేసాడు. మొదట్లో తడబడుతూ సాగినప్పటికీ, చివర్లో గాలి పోయిన భావన కలిగించినప్పటికీ పర్‌ఫెక్ట్ మిడిల్ ఉండడంతో ఈ సినిమా నిటారుగా నిలబడిపోయింది.
నిఖిల్ ఎప్పటిలా ఎనర్జిటిక్‌గా నటించాడు. హెబా పటేల్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. అవిక గోర్ కూడా బాగానే చేసింది. ముగ్గురు హీరోయిన్లలో కీలకమైన పాత్ర దక్కిన నందిత శ్వేత ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలిచింది. కీలకమైన ఈ పాత్రలో నటి తేలిపోయినట్టయితే మొత్తానికే ప్రమాదం వచ్చేది. నందిత బాడీ లాంగ్వేజ్, ఆమె హావభావాలు 'అమల' పాత్రని జీవం పోసాయి. వెన్నెల కిషోర్‌కి ఒక గుర్తుండిపోయే క్యారెక్టర్ లభించింది. నందిత శ్వేత దగ్గరకి వెళ్లి వచ్చే సీన్‌లో అతని నటనకి పొట్ట చెక్కలవుతుంది. నిఖిల్ సినిమాల్లో రెగ్యులర్‌గా కనిపించే సత్య మరోసారి తనదైన శైలిలో నవ్వించాడు. సుదర్శన్, ప్రవీణ్ వీళ్లకి మంచి సపోర్ట్ ఇచ్చారు. రాజా రవీంద్ర, తనికెళ్ల భరణి, అన్నపూర్ణ సహాయ పాత్రల్లో కనిపించారు.
అబ్బూరి రవి సంభాషణలు బాగున్నాయి. చిన్న, చిన్న కామెడీ పంచ్‌లు బాగా పేలాయి. సంగీతం ఫర్వాలేదు. పాటలు సినిమా ఫ్లోని డిస్టర్బ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. కేరళ విజువల్స్ కళ్లు చెదిరేట్టు క్యాప్చర్ చేసారు. దర్శకుడు ఆనంద్ ఏదో ట్రెండ్‌కి తగ్గట్టు హారర్ కామెడీ అన్నట్టు కాకుండా, ఆసక్తికరమైన అంశాన్ని ఎంచకుని దానిని ఆకట్టుకునేలా ప్రెజెంట్ చేసాడు.
అన్ని త్రెడ్స్‌కి లాజికల్ కన్‌క్లూజన్ ఇవ్వడానికి చివర్లో కొంచెం ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. అవిక గోర్ ఎపిసోడ్‌ని ఎక్కువ టైమ్ సాగతీయకుండా క్లుప్తంగా చెప్పినట్టయితే బాగుండేది. లోపాలు లేకపోలేదు కానీ ముందే చెప్పినట్టు సాలిడ్ మిడిల్ వాటన్నిటినీ కవర్ చేసి ప్రేక్షకులని సంతృప్తిగా బయటకి పంపిస్తుంది. కథ ఎంత సీరియస్‌గా సాగుతున్నా కానీ దర్శకుడు ఎక్కడా కామెడీ మిస్ అవలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో అరెస్ట్ చేసేసిన సినిమా సెకండ్ హాఫ్‌లో క్లాక్ టవర్ సీన్, పోలీస్ స్టేషన్ సీన్, వెన్నెల కిషోర్ - నందిత సీన్... ఇలా గ్యాప్ లేకుండా ఒక అరగంట పాటు విపరీతంగా నవ్విస్తుంది.
ఈ కథని ఎలా ఎండ్ చేస్తాడా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న టైమ్‌లో మరో ట్విస్ట్‌తో దర్శకుడు మెరిపిస్తాడు. కొన్ని డీటెయిల్స్ జోలికి పోతే విజువల్ ఎక్స్‌పీరియన్స్ స్పాయిల్ చేసినట్టు అవుతుంది కనుక వాటి జోలికి పోవడం లేదు. వంద రూపాయలు క్యాష్ ఖర్చు చేయాలంటే చాలా ఇంపార్టెంట్ అయి ఉండాలి బాస్ అన్నది ఇప్పుడు పబ్లిక్ ఫీలింగ్. ఆ వంద రూపాయలకి తగ్గ వినోదాన్ని అందిస్తామంటూ పరిస్థితులని వెరవకుండా వచ్చేసిన ఈ సినిమాకి బ్లయిండ్‌గా వెళ్లిపోండి. పైసా వసూల్ గ్యారెంటీ.
బాటమ్ లైన్: ఇక్కడికి పోవాల్సిందే చిన్నవాడా!
- గణేష్ రావూరి