కూతురు మృతదేహాన్ని బయటకు తీసిన తండ్రి

ఆల్రెడీ కూతురు చనిపోయింది. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. కానీ ఆ తండ్రికి ఇంకా ఆశ చావలేదు. పైగా మూఢనమ్మకాల పిచ్చి. దీంతో సమాధి చేసిన కూతురు మృతదేహాన్ని త్రవ్వి తీశాడు ఆ తండ్రి. బిహార్ లో జరిగింది ఈ ఘటన.

భాగల్ పూర్ లో ఈ వింత ఘటన వెలుగుచూసింది. నోనియా పట్టీకి చెందిన భగవాన్ మహతో కూతురు హర్షిత కుమారి. 10 నెలల ఈ చిన్నారి ఆరోగ్యం విషమించింది. దీంతో గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం భగల్ పూర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ చిన్నారి బతకలేదు.

దీంతో హర్షిత మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. అంత్యక్రియల్లో భాగంగా మృతదేహాన్ని ఖననం చేశారు. సరిగ్గా అదే టైమ్ లో సీన్ లోకి ఎంటరైంది సోనీ దేవి.

తననుతాను మంత్రగత్తెగా చెప్పుకునే ఈమె, చిన్నారి హర్షితను బతికిస్తానని నమ్మబలికింది. దీంతో భగవాన్ లో ఆశలు చిగురించాయి. వెంటనే సమాధి దగ్గరకు వెళ్లి మట్టిని తవ్వి, కూతురు మృతదేహాన్ని బయటకు తీశాడు. తిరిగి హాస్పిటల్ కు చేరుకున్నాడు. Readmore!

తన కూతురికి ఆక్సిజన్ పెట్టాల్సిందిగా హాస్పిటల్ సిబ్బందిని కోరాడు. వంద మంది గ్రామస్తులతో సహా వెళ్లడంతో హాస్పిటల్ సిబ్బంది భయపడ్డారు. మరోవైపు సోనీ దేవి ఊరుకోలేదు. ఎమర్జెన్సీ వార్డులోనే బాలికపై పూలు జల్లుతూ ఏవో పూజలు ప్రారంభించింది.

దీంతో ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, భూత వైద్యురాలు సోనీ దేవిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. భగవాన్ తో సహా గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. 24 గంటల కిందట చనిపోయిన పాప తిరిగి బతికే అవకాశం లేదని నచ్చజెప్పారు.

Show comments