తలచినదెల్లా కూల్చేయడం అంత వీజీ కాదు!

జగన్మోహన్ రెడ్డికి తొందర ఎక్కువ. మీడియాలో తనకు అనుకూల ప్రచారం మేనేజ్ చేసుకోవడంలో అవగాహన తక్కువ. అయిదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి విధ్వంసక పాలన సాగించినట్టుగా ప్రతిపక్షాలు చేసిన విమర్శలు ప్రజలు కొంతమేరకైనా నమ్మే పరిస్థితి వచ్చింది గనకనే ఆయన ఓడిపోయారు. కూల్చివేతలు మాత్రమే తెలిసిన ముఖ్యమంత్రిగా ఆయన ముద్రపడ్డారు.

అదే.. అమరావతి ప్రాంతంలో ఎటూ శాసన రాజధానిగా ప్రకటించారు గనకు.. మొత్తం నగర అభివృద్ధి సంగతి ఎలా ఉన్నప్పటికీ.. కనీసం 70 శాతం పూర్తయిన సివిల్ సర్వెంట్లు, న్యాయమూర్తు క్వార్టర్లను పూర్తిచేసి ఉంటే బహుశా ఇమేజి ఇంకోరకంగా ఉండేదేమో. అలాగే.. విధ్వంసం ముద్ర పడ్డానికి తెదేపా నేతల ఇళ్లను ఆస్తులను కూల్చేయించడం కూడా ఒక కారణం.

ఈ విషయంలో జగన్ నియమ నిబంధనల ప్రకారం మాత్రమే వ్యవహరించారు. ప్రజా వేదికను నదీ పరీవాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మించి నందువల్ల మాత్రమే కూల్చేశారు. అలాగే.. తెదేపా నాయకుల ఇళ్లను కూల్చేయించడం కూడా గమనించాలి. వారి నివాసాల్లో కొంత భాగం నిబంధనలను అతిక్రమించి, పొరుగున ఉన్న ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని కట్టి ఉన్నప్పుడు మాత్రమే, ఆ భాగం వరకే కూల్చేయించారు.

కానీ, అసలైన విధ్వంసక పాలన అంటే ఏమిటో ఇప్పుడు చంద్రబాబునాయుడు సర్కారు చూపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను రాష్ట్రంలో దాదాపు అన్నింటినీ కూల్చివేయడానికి కుట్ర రచన చేస్తోంది. నిర్మాణంలో ఉన్నవాటిని ఇప్పటికే కూల్చేశారు. నిర్మాణం పూర్తయిన వాటిని కూడా నేలమట్టం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. Readmore!

అయితే ఈ నిర్మాణాలను కూల్చేయడం అంత వీజీ కాదని పలువురు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. నిర్మాణాలకు సంబంధించి.. కేవలం ప్లాన్ అప్రూవల్ లేదన్నది మాత్రమే.. ప్రభుత్వం చెబుతున్న సాకు. ఆ ఒక్క కారణం మీద ఏకంగా పూర్తయిన భవనాల్ని కూల్చేయడానికి న్యాయస్థానం అంత సులువుగా అనుమతించకపోవచ్చు. పైగా, ప్రతి కార్యాలయానికి కూడా అనుమతుల కోసం ప్లాన్లను 15 నెలల కిందటే సమర్పించినట్టుగా వార్తలు వచ్చాయి. 15 నెలలుగా అధికారులు ప్లాన్ కు అనుమతి ఇవ్వకుండా ఏం చేస్తున్నారు.. అనే చర్చ కూడా వస్తుంది.

ప్రభుత్వం ఇంత అలసత్వం ఉందా? అనే ప్రశ్న వస్తుంది. ప్లాన్ రిజెక్ట్ అయినా చేశారా? అనే చర్చ వస్తుంది. ప్లాన్ ప్రకారం ఉంటే అనుమతించాలని.. ప్లాన్ ను అతిక్రమించి ఉంటే ఆమేరకు పెనాల్టీలు వేయడం లేదా ఇతర చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించే అవకాశం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు.

Show comments