అయిదు వేల కోట్ల అప్పు..రెండోస్సారి

గత అయిదేళ్లలో వంద కోట్ల అప్పు తెచ్చినా అది బ్యానర్ వార్తే. ఆంధ్రలో అప్పు అన్న పదం వినిపిస్తే అది ఫస్ట్ పేజీలోకి వచ్చి చేరాల్సిందే. కానీ అంతకు ముందు 2014 నుంచి 2019 వరకు ఎన్ని కోట్ల అప్పులు చేసినా ఎవరికీ తెలియదు. ఇంత అప్పు చేసి మా నెత్తిన పెట్టారు అని వైకాపా ప్రభుత్వం మొత్తుకున్నా పట్టదు. కానీ వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో అప్పులు చేసి పోయిందనే విషయం టముకేయడం మానరు. 

వర్తమానానికి వస్తే ఈ నెల ఫస్ట్ న జీతాలు, పింఛన్లు, సామాజిక కార్యక్రమాల కోసం గత నెలలోనే ప్రభుత్వం అప్పు చేసింది. అప్పటికే ప్రభుత్వం మంజూరు చేయించుకున్న అప్పును అలా దాచి పెట్టి, 25 తరువాత డ్రా చేసారు. దాన్ని రేపు ఒకటి ఉదయం జనాలకు ఆడంబరంగా పంచబోతున్నారు. ఇది పండగ. అప్పు చెేసి పప్పు కూడు కాదు. రాష్ట్రం మరో శ్రీలంక అయిపోదు. సరే, ఏ ప్రభుత్వం వచ్చినా చేసేది ఇదే. 

మరి వచ్చే నెల సంగతి ఏమిటి? మళ్లీ ఫస్ట్ వస్తుంది కదా. అందుకే ఈ నెల 5000 కోట్ల అప్పు తేబోతున్నారు. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీ వేలంలో పాల్గొని అయిదు వేల కోట్లు అప్పు తెచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టేసారు. అంటే ఇది రెండో విడత అప్పు అన్న మాట. ఈ మేరకు వార్తలు బయటకు వచ్చాయి. 

కానీ ఇన్నాళ్లూ జగన్ ప్రభుత్వం చేసిన అప్పులను, ఇప్పుడు జగన్ చేసిన అప్పటి తప్పులను నిత్యం కథనాలు వండి వడ్డించే మీడియా మాత్రం ఈ అయిదు వేల కోట్ల అప్పును ఉద్దేశపూర్వకంగానే మరిచిపోయింది. అసలు దాని ఊసే ఎత్త కుండా, పింఛన్లు పండుగ అంటూ హడావుడి చేస్తూంది. గత అయిదేళ్లు ఫింఛన్లు ఇచ్చింది కనిపించలేదు. ఈ వెయ్యి పెంచింది మాత్రమే కనిపిస్తోంది. Readmore!

ఇక నెలనెలా ఎన్ని వేల కోట్లు అప్పు చేసినా ప్రభుత్వానికి వచ్చిన సమస్య లేదు. ఎందుకంటే ఆ అప్పు ఎవరికీ కనిపించకుండా అక్షరాల చాటున దాచేయడానికి ‘మన’ మీడియా వుండనే వుందిగా.

Show comments